ఫుట్‌బాల్‌ మైదానం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

సిద్దిపేట క్రీడలహబ్‌గా అభివృద్ధి చెందుతున్నది. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో జాతీయస్థాయి ప్రమాణాలతో మైదానాలు, స్టేడియంలు ఏర్పాటవుతున్నాయి. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ. 1.80 కోట్లతో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్‌ మైదానం సిద్ధమైంది. పనులు దాదాపు పూర్తవడంతో ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫుట్‌బాల్‌ మైదానం సిద్ధం

రూ. 1.80 కోట్లు వెచ్చించి జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మాణం

త్వరలోనే ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

జూన్‌2న ఉమ్మడి జిల్లా పోటీలకు సన్నాహాలు

ఇప్పటికే వేసవి శిక్షణ ప్రారంభం


సిద్దిపేట టౌన్‌, మే 10: సిద్దిపేట క్రీడలహబ్‌గా అభివృద్ధి చెందుతున్నది. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో జాతీయస్థాయి ప్రమాణాలతో మైదానాలు, స్టేడియంలు ఏర్పాటవుతున్నాయి. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ. 1.80 కోట్లతో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్‌  మైదానం సిద్ధమైంది. పనులు దాదాపు పూర్తవడంతో ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


రూ. 1.80 కోట్లతో నిర్మాణం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు రూ. 1.80 కోట్లు కేటాయించారు. లోతట్టు ప్రాంతంలో ఉండే ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి, మట్టిపోసి ఎత్తు పెంచారు. ప్రత్యేకంగా తెప్పించిన గడ్డిని పరిచి ఫుట్‌బాల్‌కోర్టును రెడీ చేశారు. ఫుట్‌బాల్‌ ఆడే క్రమంలో క్రీడాకారులు కింద పడినప్పుడు గాయాలు కాకుండా నాణ్యమైన గడ్డిని నిర్ణీత ప్రమాణాల మేరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మైదానం నిర్వహణ కూడా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయస్థాయి ప్రమాణాలతో మైదానాన్ని సిద్ధం చేశారు. ఈ పనులను సిద్దిపేట జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, క్రీడల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుదిదశకు చేరుకున్నాయి. 95 శాతం పనులు పూర్తవగా మిగిలినవి పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి మైదానం సిద్ధమవగా భవిష్యత్తులో సకల సౌకర్యాలతో పూర్తిస్థాయి స్టేడియం నిర్మించనున్నారు.


ఉమ్మడి మెదక్‌ జిల్లా ఫ్రెండ్లీ పోటీలు

జాతీయస్థాయి ప్రమాణాలతో సిద్ధం చేసిన మైదానంలో త్వరలోనే టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, క్రీడా అభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా క్రీడాకారులతో తొలి పోటీ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 


ప్రారంభమైన వేసవి శిబిరం

స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్న ఉచిత ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణ శిబిరం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైంది. క్రీడా అభివృద్ధి శాఖ అధికారి నాగేందర్‌, ఫుట్‌బాల్‌ కోచ్‌ అక్బర్‌ ఆధ్వర్యంలో శిబిరంలో చిన్నారులు, యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


ఉమ్మడి జిల్లా జట్ల మధ్య తొలి పోటీలు : నాగేందర్‌, క్రీడా అభివృద్ధి అధికారి, సిద్దిపేట జిల్లా

సిద్దిపేట పట్టణంలో రూ. 1.80 కోట్లతో నిర్మించిన ఫుట్‌బాల్‌ మైదానం సిద్ధమైంది. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. తొలిసారి ఉమ్మడి మెదక్‌ జిల్లా పోటీలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే స్టేడియం అందుబాటులోకి రానుంది. క్రీడాకారులు ఈ సౌర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.

Read more