నత్తనడకన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులు

ABN , First Publish Date - 2022-01-17T17:31:05+05:30 IST

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొంటున్న అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆదాయంపై దృష్టి సారిస్తూ ప్రయాణికుల సౌకర్యాలపై అలసత్వం

నత్తనడకన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులు

ప్రకటనలకే రైల్వే అధికారులు పరిమితం

ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై చేపట్టిన నిర్మాణం

నేటికీ పూర్తికాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు

ఎస్కలేటర్‌ లేక వృద్ధుల పాట్లు


హైదరాబాద్‌ సిటీ:  రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొంటున్న అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆదాయంపై దృష్టి సారిస్తూ ప్రయాణికుల సౌకర్యాలపై అలసత్వం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్‌ స్టేషన్‌ను కొంతకాలంగా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కొవిడ్‌కుముందు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రోజూ సుమారు 80 రైళ్లు రాకపోకలు సాగించేవి. వీటితోపాటు 129 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడిచాయు. ఆయా రైళ్లలో సగటున 1.20 లక్షల మంది ప్రయాణించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 16 నుంచి రైళ్లు నిలిచిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆయా స్టేషన్లలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిల మరమ్మతు, ప్లాట్‌ఫాంల ఎత్తు పెంచడం లాంటి నిర్మాణాలు ప్రారంభించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నంబర్‌-1 ప్లాట్‌ఫాం నుంచి పదో నంబర్‌ వరకు మూడు బ్రిడ్జిలున్నాయి. స్టేషన్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ ముందు భాగంలో ఒకటి, మధ్యలో ఒకటి, నాంపల్లి వైపున మరొకటి ఉంది.


ప్రయాణికుల సౌకర్యార్థం మధ్య బ్రిడ్జికి అనుసంధానంగా కొన్ని రోజుల క్రితం ఎస్కలేటర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రయాణికులు  ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జిని, ఎస్కలేటర్‌ను వినియోగించుకునేవారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ను నిర్మించిన సమయంలో చేపట్టిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో అధికారులు నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మధ్య బ్రిడ్జితోపాటు స్టేషన్‌ ముందు, చివరిభాగం నుంచి కూడా పది ప్లాట్‌ఫాంలకు అనుసంధానంగా నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.


సా..గుతున్న పనులు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సుమారు రూ. 12 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్‌ఫాం నంబర్‌-1 రిజర్వేషన్‌ కౌంటర్‌ బ్రిడ్జి నుంచి చేపట్టిన పనులు కొంతమేర పూర్తయినప్పటికీ మధ్యలో కూల్చివేసిన పనులను ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీంతోపాటు ఎస్కలేటర్‌ సౌకర్యాన్ని నిలిపివేయడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో నంబర్‌ నుంచి 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వెళ్లాలంటే గతంలో మధ్య బ్రిడ్జి, ఎస్కలేటర్‌ ద్వారా చాలామంది సులువుగా వెళ్లేవారు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేకపోవడంతో ముందు బ్రిడ్జి లేకుంటే.. వెనక బ్రిడ్జి వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ప్రధానంగా వృద్ధులు ఒకటో నంబర్‌ నుంచి మిగతా ప్లాట్‌ఫాంలపైకి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇతర ప్లాట్‌పాంలపై రైలు బయలుదేరే సమయంలో వస్తున్న వారు అందుబాటులో బ్రిడ్జి లేకపోవడంతో రైలును అందుకోలేకపోతున్నారు. 


అధికారులు చొరవ చూపాలి

కరోనా అనంతరం ఇటీవల రైళ్ల సంఖ్య పెరగడంతోపాటు ప్రయాణికులు లక్షలాదిగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నంబర్‌-1 ప్లాట్‌ఫాం మధ్య నుంచి బ్రిడ్జి, ఎస్కలేటర్‌ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి పనులను సకాలంలో పూర్తిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-17T17:31:05+05:30 IST