తిండికి గండం

ABN , First Publish Date - 2020-03-26T09:03:54+05:30 IST

కరోనా వైర్‌సను అరికట్టేందుకుగాను ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడం, ప్రజలను ఇళ్లలోంచి బయటకు రావద్దని...

తిండికి గండం

  • దుకాణాల్లో నిండుకుంటున్న నిత్యావసరాలు!
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు బ్రేక్‌
  • పప్పులు, నూనెలు, చక్కెర, సబ్బుల కొరత తీవ్రం
  • స్థానిక ట్రాలీలనూ అనుమతించని పోలీసులు
  • దుకాణాల వద్ద భారీగా గుమిగూడుతున్న జనం
  • నిల్వల్లేక హోల్‌సేల్‌ దుకాణాలూ లాకౌట్‌
  • బేగంబజార్‌ నుంచి జిల్లాలకు నిలిచిన రవాణా
  • ఆన్‌లైన్‌ స్టోర్‌ల వాహనాలకూ పోలీసుల బ్రేక్‌
  • డ్రైవర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారంటూ..
  • కేంద్రానికి ఈ-కామర్స్‌ కంపెనీల ఫిర్యాదు
  • రవాణా వాహనాల్ని అనుమతించాలన్న కేంద్రం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను అరికట్టేందుకుగాను ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడం, ప్రజలను ఇళ్లలోంచి బయటకు రావద్దని కోరడంపై సానుకూల స్పందనే వ్యక్తమవుతోంది. అయితే ఇన్నాళ్లపాటు వారు బయటికి రాకుండా ఉండాలంటే నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థానికంగా ఉన్న దుకాణాల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇంటికి ఒకరు చొప్పున వెళ్లి ఆయా సరుకులను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదంతా జరగాలంటే వస్తువులు ఉత్పత్తి దశ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, హోల్‌సేల్‌ షాపులకు, రిటైల్‌ షాపులకు.. ఇలా అన్ని దశల్లోనూ ఎటువంటి ఆటంకం లేకుండా రవాణా అయ్యే వీలును కల్పించాల్సి ఉంటుంది. కానీ, కరోనా నియంత్రణలో భాగంగా రవాణా మార్గాలను మూసివేయడంతో ఆ ప్రభావం వస్తువుల రవాణా పైనా పడింది. పోలీసులు సాధారణ వాహనాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులు, నూనెలు, సబ్బులు ఇతర సరుకులతో వచ్చే లారీలను అనుమతించటంలేదు.


ఈ నెల 21న చివరిసారిగా సరుకులను తీసుకొచ్చిన లారీలు.. గత నాలుగు రోజుల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కిరాణా, జనరల్‌ స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్లలో ఉన్న నిత్యావసర సరుకులు నిండుకుంటున్నాయి. నిత్యావసర సరుకుల రవాణాకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. దీనిని పోలీసులు పట్టించుకోవడంలేదు. కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు వంటివి మహారాష్ట్ర నుంచి, కర్ణాటకలోని బీదర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. అయితే ఒక రోజంతా ప్రయాణం చేసి వెళితే..  సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ అక్కడే లారీల్లోకి లోడ్‌ ఎత్తటం లేదు. 


హోల్‌సేల్‌ షాపుల నో స్టాక్‌ బోర్డులు

హైదరాబాద్‌లోని హబ్సిగూడ కేంద్రంగా నూనెలు సరఫరా చేసే ఒక డిస్ట్రిబ్యూటర్‌... స్టాక్‌ లేదని గోడౌన్‌కు తాళం వేసుకున్నారు. అందుబాటులో ఉన్న విజయ నూనెలను కూడా సిటీలోని సూపర్‌ మార్కెట్లు, కిరాణాలు, జనరల్‌ స్టోర్లకు చేర్చలేని దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల లేబర్‌ సమస్య కూడా కారణంగా కనిపిస్తోంది. బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, మలక్‌పేటలో ఉండే ట్రేడర్లు, డీలర్లు తమషాపుల్లో స్టాకులేదని బోర్డులు పెట్టేశారు. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ షాపుల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన సరుకుల రవాణా కూడా నిలిచిపోయింది. సరుకు డెలివరీ వాహనాలను అనుమతించకపోతే రెండు, మూడు రోజుల్లో సరుకుల కొరత స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. వాహనాలను నిలిపేస్తే మధ్యలో చిక్కుకుపోయి తిండికి అలమటిస్తామని డ్రైవర్లు విధుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో దుకాణాల్లో సరుకులు ఖాళీ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తిగా అయిపోతాయని, ప్రభుత్వం సరుకు రవాణా వాహనాలను అనుమతించాలని దుకాణదారులు కోరుతున్నారు. 


దుకాణాల వద్ద సమస్యలు

సరుకులు తెచ్చుకునేందుకు దుకాణాలకు వెళ్లిన వారికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కసారిగా వినియోగదారులు వస్తుండటంతో ఒక్కోసారి ఐదుగురు చొప్పున లోపలికి పంపించి సరుకులు ఇస్తున్నారు. దీంతో బయటి పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండాల్సి రావడంతో సామాజిక దూరం పాటించాలన్న అంశం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఆన్‌లైన్‌ షాపింగే పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే.. ఆ స్టోర్ల రవాణా వాహనాలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌ కూడా ముందుకు రావడంలేదు. దీంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన వారికి సరుకులు సరఫరా చేయలేమని బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌ వంటివి తేల్చి చెబుతున్నాయి. 


చెల్లించిన  డబ్బును నేరుగా తిరిగి ఇవ్వకుండా, వాలెట్‌లో వేస్తున్నారు. ఫలితంగా మళ్లీ ఆన్‌లైన్‌లో కొనుగోలుకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో ఇటు ఆన్‌లైన్‌లో సరుకు రాక, బయట ఎక్కడైనా సరుకులు కొనుక్కునేందుకు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఢిల్లీ, హైదరాబాద్‌ సహా దేశంలో పలు చోట్ల ఈ-కామర్స్‌ కంపెనీలు తమ కార్యకలాపాలను పోలీసులు అడ్డుకుని దాడి చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఆపొద్దు

న్యూఢిల్లీ, మార్చి 25: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల పనికి ఆటంకం కలిగించడమో, మూసివేయడమో చేయరాదని స్పష్టం చేసింది. ప్రజలకు నిత్యావసర సరుకులు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకుగాను ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఔట్‌లెట్స్‌, ఫార్మాసిస్‌, తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులను అనుమతించాలని పేర్కొంది. వినియోగదారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సౌకర్యాలు ఎప్పటిలాగే అందుబాటులో ఉండాలని సూచించింది. 


బియ్యం పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం

ఈ- పాస్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పు

కరోనా విపత్తు నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో... ఇప్పటికే 30 నుంచి 40 శాతం సరుకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్‌ దుకాణాలకు చేరిపోయింది. నేటి నుంచి అన్ని జిల్లాల్లో రేషన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. 6 కిలోల చొప్పున ఉన్న ఈ- పాస్‌ సాఫ్ట్‌వేర్‌ను 12 కిలోల చొప్పున మార్చేశారు. దీంతో సాంకేతిక సమస్యలు తొలగిపోయాయి. అయితే ఒకేరోజు వినియోగదారులందరికీ బియ్యం పంపిణీ చేయకుండా టోకెన్‌ పద్ధతిలో పంపిణీ చేయాలని కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీచేశారు.


సరుకు రవాణా కోసం పాస్‌లు ఇవ్వాలి

క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్లను బెదిరించడం, కొట్టడం, అనుమతించకపోవడం చేస్తున్నారు. స్టోర్‌కు సరుకు వచ్చినా దింపేందుకు సిబ్బంది లేరు. ఇన్ని అవరోధాల నడుమ కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉంది. అందుకే పోలీసులు మాకు పాస్‌లు జారీ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సైబరాబాద్‌ పొలీసులు ఈ దిశగా కొంత చురుగ్గా ఉన్నా.. మిగిలిన చోట్ల అది కనిపించడం లేదు. ఇప్పుడున్న రీతిలోనే నియంత్రణ విధిస్తే ఒకటి రెండు రోజుల తరువాత స్టోర్స్‌ క్లోజ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 

  • - క్యుమార్ట్‌ జేఎండీ బీవీకే రాజు

Updated Date - 2020-03-26T09:03:54+05:30 IST