ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌

ABN , First Publish Date - 2022-06-17T04:44:21+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు స్థానికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌
ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సేకరించిన భూమి

  • మూడు ప్రతిపాదనల్లో మొదట ఇక్కడ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం
  • పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌, ఉప ఉత్పత్తులు
  • రైతులకు లభించనున్న గిట్టుబాటు ధర
  • నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి

    రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు  స్థానికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌లకు ప్రతిపాదించింది. ఒక్కో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌కు కనీసం 200ఎకరాల స్థలం అవసరమవుతుంది. మొదటి దశలో నవాబుపేట మండలం ఆర్కతలలో ఎఫ్‌పీ పార్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ పరిధి సర్వే నెం.32లో 346.14 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఇప్పటికే గుర్తించారు.

వికారాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ నెలకొల్పేందుకు ముందడుగు పడింది. జిల్లాలో మూడు చోట్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భావించినా... మొదటి దశలో నవాబుపేట మండలం ఆర్కతలలో నెలకొల్పేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌పార్క్‌ ఏర్పాటుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లో ప్రతిపాదించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటుకు 200ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. ప్రైవేట్‌ భూముల్లో ఏర్పాటు చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు వ్యయం భారీగా అవనుండడంతో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మర్పల్లి మండలం ఘనాపూర్‌లో సర్వే నెం.57లో 330.31 ఎకరాలు, తాండూరు నియోజకవర్గంలో తాండూరు మండలం జిన్‌గుర్తి సర్వే నెం.206లో 305.34 ఎకరాలు, చేవెళ్ల నియోజకవర్గంలో నవాబుపేట మండ లం ఆర్కతల పరిధి సర్వే నెం.32లో 346.14ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. 


  • భూముల పరిశీలన అనంతరమే...

జిల్లా పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో పరిశీలించి చివరకు ఘనాపూర్‌, ఆర్కతల, జిన్‌గుర్తిలను ఎంపిక చేశారు. ఈ మూడు ప్రాంతాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు నెలకొల్పేందుకు అనువుగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఘనాపూర్‌ ముంబాయి-హైదరాబాద్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉండగా, అర్కతల వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 70కిలోమీటర్ల దూరంలో ఉంది. జిన్‌గుర్తి శివారులో ప్రతిపాదించిన స్థలం తాండూరు-చించోలి హైవేకు సమీపంలోనే ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు అతి ముఖ్యమైన విద్యుత్‌, నీరు, రోడ్డు వంటి  సదుపాయాలు కల్పించేందుకు ఈ గ్రామాల్లో అన్ని వసతులు ఉండడంతో అధికారులు ఈ ప్రాంతాలను ఎంపిక చేసి రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల కల్పనా సంస్థ(టీఎ్‌సఐఐసీ)కి ప్రతిపాదనలు పంపించారు. జిన్‌గుర్తి, ఘనాపూర్‌, ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు నెలకొల్పేందుకు ప్రతిపాదించిన భూములను టీఎ్‌సఐఐసీ అధికారు లు పలుమార్లు పరిశీలించారు. మొదటి విడతలో ఆర్కతలలో పార్క్‌ ఏర్పాటుకు చర్యలకు ఉపక్రమించారు.


  • పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు పెరగనున్న డిమాండ్‌

సాధారణంగా డెయిరీ, పండ్లు, కూరగాయలు, పౌలీ్ట్ర, మాంసం, ఫిషరీస్‌, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఉంటాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుతో రైతులు పండించే పంటలకు స్థానికంగా మరింత డిమాండ్‌ పెరుగుతుంది. అలాగే స్థానికులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. జిల్లాలో 25వేల ఎకరాల వరకు వివిధ రకాల పండ్లు, కూరగాయ తోటలు సాగులో ఉన్నాయి. టమోట, క్యారెట్‌, కీర, క్యాబేజి, మునగ, ఆలు, పసుపు, మిరప, అల్లం తదితర రకాల కూరగాయలు సాగుచేస్తుంటారు. ఇదివరకు మామిడి, జామ, బత్తాయి తోటలు ఉండగా, ఇటీవల దానిమ్మ, యాపిల్‌ బేర్‌, అంజూర, సీతాఫలం తదితర పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. స్థానికంగా పండించే ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే జిల్లాలో కూరగాయలు, పండ్ల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులకు సైతం పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే ఆస్కారం ఉంది.


  • ప్రైవేట్‌ భూసేకరణ చేస్తేనే ముందుకు...

ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన 346.14 ఎకరాల్లో 174 ఎకరాల ప్రభుత్వ భూములను ఇప్పటికే టీఎ్‌సఐఐసీకి అప్పగించారు. కాగా, టీఎ్‌సఐఐసీకి ఆ ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా అభివృద్ధి చేసేందుకు మధ్యలో ఉన్న అసైన్డ్‌, పట్టా భూములు అడ్డంకిగా మారాయి. అసైన్డ్‌, పట్టాభూముల రైతుల నుంచి భూసేకరణకు ప్రభుత్వం ఓ కమిటీ వేయనుంది. భూసేకరణ అధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో భూములను కోల్పోయే పట్టాదారులను గుర్తించనున్నారు. ఎంత మంది, ఎంత విస్తీర్ణంలో భూములు కోల్పోతున్నారు? ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలని అనే దానిపై కమిటీ నిర్ణయించనుం ది. అసైన్డ్‌, పట్టాభూములను కలిపి ఒకే యూనిట్‌గా భూసేకరణ చేయనున్నారు. ఆ భూములు స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ పనులు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మార్కెట్‌ రేటు ప్రకారం ఎకరానికి ఎంత లేదన్నా రూ.30లక్షలకు తక్కువ కాకుండా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతుల పరిహారాన్ని ఎంత నిర్ణయిస్తుందనేది సందిగ్ధంగా ఉంది. ఆ రేటుకు రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ సజావుగా సాగే ఆస్కారం ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం ధర కట్టించడంతో పాటు నిర్వాసిత రైతులకు పెట్టబోయే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తే భూ సేకరణ త్వరగా పూర్తయ్యే ఆస్కారం ఉంది.


  • మూడు ప్రతిపాదనల్లో ఒకదానికి అనుమతి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటుకు జిల్లాలో మూడు చోట్ల ప్రతిపాదనలు పంపించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్కు ఏర్పాటుకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఘనాపూర్‌, జిన్‌గుర్తి, ఆర్కతలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు మొదట ప్రతిపాదించారు. అయితే  మొదటి ఆర్కతలలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జిన్‌గుర్తి, ఘనాపూర్‌లో గుర్తించిన ప్రభుత్వ భూముల్లో మరో విడతలో ఇవే పార్కులు ఏర్పాటు చేస్తారా? లేక వేరే అవసరాలకు వినియోగిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది.

Updated Date - 2022-06-17T04:44:21+05:30 IST