‘ఫుడ్‌ప్రాసెసింగ్‌’కు చకచకా..

ABN , First Publish Date - 2021-06-15T04:04:05+05:30 IST

‘ఫుడ్‌ప్రాసెసింగ్‌’కు చకచకా..

‘ఫుడ్‌ప్రాసెసింగ్‌’కు చకచకా..
రఘునాధపాలెం లో సర్వే నిర్వహిస్తున్న జిల్లా అధనపు కలెక్టర్‌ మధుసూదన్‌, భూ సర్వే అధికారులు

ఖమ్మంలో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

రైస్‌మిల్లులు నెలకొల్పేందుకు ప్రభుత్వ నిర్ణయం

భూసేకరణ పనిలో నిమగ్నమైన యంత్రాంగం

రఘునాథపాలెం మండలంలో 150 ఎకరాల గర్తింపు

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 14 : ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా సుమారు 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతోంది. ఒక్క నాగార్జున సాగర్‌, ఇతర చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఈ దిగుబడి వస్తుండగా.. మరో మూడేళ్లలో సీతారామా ప్రాజెక్టు పూర్తయి సాగు జలాలు వస్తే జిల్లా ధాన్యాగారంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కేవలం  ఎనిమిది పార్‌బాయిల్డ్‌ మిల్లులు, మరో 42రా రైస్‌ మిల్లులున్నాయి. ఎనిమది పార్‌బాయిల్డ్‌ మిల్లుల్లో కేవలం 46వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ మన జిల్లాలో యాసంగిలో ఉత్పత్తయ్యే ధాన్యం 5 లక్షల మెట్రిక్‌ టన్నులు. దీంతో ధాన్యం మిల్లింగ్‌కు ఇతర జిల్లాల వారి కాళ్లావేళ్లా పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మిల్లులు అందుబాటులో లేని కారణంగా పలుచోట్ల మొన్నటి యాసంగి ధాన్యం రవాణాకు నోచుకోక రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షాలకు తడిసిపోతుండటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దుస్థితినుంచి గట్టెక్కేందుకు ఖమ్మం జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో జిల్లాను ఫుడ్‌ప్రొసెసింగ్‌ యూనిట్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పెట్టారు. ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో జిల్లా దశ తిరగనుంది. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం చకచకా పనులను మెదలుపెట్టింది.

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లతో ప్రయోజనం..

జిల్లాలో ఉత్పత్తయ్యే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసుకునేందుకు వీలుగా కనీసం 20 పార్‌బాయిల్డ్‌ మిల్లులు, 60 రారైస్‌ మిల్లులు ఏర్పాటవనున్నాయి. దీంతో ఇతర జిల్లాలకు సీజన్‌లో ధాన్యాన్ని రవాణా చేయాల్సిన అవసరం ఉండదు. దీనితో పాటు కూరగాయలు, పండ్లు, ధాన్యం, నూనెమిల్లులు, పప్పులు, సుగంధద్రవ్యాలు, మత్స్య, మాంసం,కోళ్లు, బిస్కెట్లు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారితో పాటు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. 

భూసేకరణలో అధికారులు...

జిల్లాలో ఏర్పాటు కానున్న ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం భూసేకరణ ముమ్మరంగా చేపడుతున్నారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, ఆర్డీవో రవీంద్రనాధ్‌, లాండ్‌సర్వే ఏడీ వోరుగంటి రాము , టీఎస్‌ఐఐసీ అధికారులు సంయుక్తంగా సర్వే చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కారేపల్లి, కొణిజర్ల, రఘునాథపాలెం మండలంలో సర్వే నిర్వహించారు. వీటిలో రఘునాథపాలెం మండలంలోని సర్వే నెంబర్‌ 30, కోయచలక సర్వేనెంబర్‌ 192, చింతగుర్తిలో 266 సర్వేనెంబర్‌లో మొత్తం 150 ఎకరాల ప్రభుత్వ భూమిని అనువైందిగా గుర్తించారు. దాదాపు ఈ స్థలాన్ని ప్రభుత్వం నిర్ణయించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతమైతే జిల్లా కేంద్రానికి దగ్గరగా, రైల్వేస్టేషన్‌కు అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఇది ఖరారైతే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ఆస్కారం కనిపిస్తోంది. గుర్తించిన భూమిని తెలంగాణస్టేట్‌ ఇండస్ర్టియల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ)కి అప్పగించనున్నారు. ఆ తర్వాత ఆ శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం రేటును నిర్ణయించి అప్పగించనున్నారు.

సర్వే పూర్తికావొచ్చింది..

ఎన్‌.మధుసూదన్‌, ఖమ్మం అదనపు కలెక్టర్‌

ఖమ్మం జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కారేపల్లి, రఘునాఽథపాలెం మండలాల్లో ఇప్పటికే భూ సేకరణ సర్వే చేస్తున్నాం. దాదాపు పూర్తి కావొచ్చింది. కొణిజర్ల, రఘునాథపాలెం మండలంలో చింతగుర్తి, కోయచెలక, రఘునాఽథపాలెం గ్రామాల మధ్య ఉన్న 150 ఎకరాలు అనువుగా ఉంది. దీనిపై ప్రతిపాదనలు పంపించనున్నాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభమైతే జిల్లా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.

Updated Date - 2021-06-15T04:04:05+05:30 IST