Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించడమే బెటర్.. వేటిని తప్పకుండా తినాలంటే..

twitter-iconwatsapp-iconfb-icon
వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించడమే బెటర్.. వేటిని తప్పకుండా తినాలంటే..

ఆంధ్రజ్యోతి (07-09-2021): దంచి కొడుతున్న వానలతో చల్లబడిన వాతావరణం ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు, కొన్ని రుతుపరమైన ఇబ్బందులనూ తెచ్చి పెడుతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి, మెలకువగా వ్యవహరిస్తూ ఉండాలి. రుతువుల పరంగా వేర్వేరు కాలాల్లో వేర్వేరు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వానా కాలంలో వాత, పిత్త దోషాలు కలిగిన వారికి వివిధ రకాల రుగ్మతలు తిరగబెడుతూ ఉంటాయి. అవేంటంటే..


వాత: వేసవి ఫలితంగా భూమిలో బిగదీసుకుపోయిన వాయువులు, ఆమ్ల సహిత వాతావరణం మూలంగా, వాతం పెరిగి, వానాకాలంలో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది.


పిత్త: వానాకాలంలో క్షీణించిన జీర్ణశక్తి మూలంగా వేసవిలో వేడి పెరగడంతో పాటు, పిత్తం కూడా పెరుగుతుంది. వానాకాలం చల్లని వాతావరణం చెలరేగిన వెంటనే లక్షణాలు ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాయి.


ఆయుర్వేద చికిత్సలతో...

వర్ష రుతువులో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం మూలంగా ఈ కాలంలో కొన్ని రకాల సమస్యలు విపరీతంగా వేధిస్తాయి. కాబట్టి వాతం, పిత్తాలను సమతుల్యం చేసే ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులను స్వాగతించాలి. లేదంటే వర్ష రుతువులో వేధించే టైఫాయిడ్‌, కలరా, కామెర్లు, జలుబు, దగ్గు మొదలైన ఇబ్బందులు తప్పవు. ఈ రుగ్మతలు దరి చేరకుండా ఉండాలంటే అభ్యంగనం లేదా నూనెతో మర్దన, స్వేదనం, బస్తి చికిత్సలను క్రమం తప్పక అనుసరించాలి.


అభ్యంగనం

వర్షాకాలంలో పెరిగే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పుల నుంచి విముక్తి పొందడానికి అభ్యంగనం ఆచరించాలి. వర్షాకాలంలో వన్నె తగ్గి, నిర్జీవంగా తయారయ్యే చర్మానికి కూడా ఈ చికిత్స ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి తేమ, మెరుపులను ఇవ్వడంతో పాటు ఎముకలు బలపడేలా చేస్తుంది అభ్యంగనం. నూనెతో మర్దన తర్వాత తీసుకునే ఆవిరి స్నానం వల్ల చర్మ రంథ్రాలు తెరుచుకుని విషతుల్య వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా వాపులు, నొప్పులు తగ్గడంతో పాటు బిగుసుకుపోయిన కీళ్లు వదులవుతాయి. 


స్వేదనం

దీన్లో రెండు రకాల చికిత్సలు ఉంటాయి. ఔషధ మొక్కల ఆకులను ఉడికించి ఉపయోగించే ‘పత్ర స్వేదనం’ చికిత్స వల్ల ఆర్థ్రయిటిస్‌ నొప్పులతో పాటు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన వెన్ను సంబంధ స్పాండిలోసిస్‌ సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. రుక్ష స్వేదనం అనే ఉష్ణ చికిత్స వల్ల రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ నొప్పులు తగ్గుముఖం పడతాయి. 


బస్తి (ఎనీమా)

ఈ చికిత్సలో వాడే నూనెలు, ఇతర కషాయాలు వాత దోషాన్ని హరిస్తాయి. వాత దోషం మూలంగా శరీరంలో చేరుకున్న మలినాలు నూనె లేదా కషాయ ఎనీమాల వల్ల బయటకు వెళ్లిపోతాయి. 

వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించడమే బెటర్.. వేటిని తప్పకుండా తినాలంటే..

జలుబు, దగ్గులకు ఆయుర్వేద చికిత్స!

వర్షాకాలం జలుబు, దగ్గు అత్యంత సహజం. ఈ రుగ్మతలను తేలికగా వదిలించుకోవాలంటే....


కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు దాల్చినచెక్క పొడి, అర చెంచా తేనెలను కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.


రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. వేడినీళ్లు జలుబు, దగ్గు, గొంతు నొప్పులకు కారణమయ్యే వైరస్‌లతో పోరాడే శక్తినిస్తాయి. అలాగే శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను బయటకు తోలి, శరీరానికి సరిపడా హైడ్రేషన్‌ను అందిస్తాయి. 


రోజుకొక ఉసిరి కాయ తింటూ ఉన్నా కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉండి, రక్త ప్రసరణ మెరుగై వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందగలుగుతాం!


అవిసె గింజలను నీళ్లలో చిక్కబడేవరకూ ఉడికించి, వడకట్టాలి. ఈ కషాయంలో నిమ్మరసం, తేనెలను కలిపి తీసుకున్నా జలుబు, దగ్గులు తగ్గుతాయి.


నల్లమిరియాలు, బెల్లం, జీలకర్ర నీళ్లలో మరిగించి, తీసుకున్నా జలుబు, దగ్గు వల్ల పట్టేసిన ఛాతీ వదులై ఊపిరి అందుతుంది.


క్యారట్‌ రసం తాగడం వల్ల జలుబు దరి చేరకపోగా, వచ్చిన జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది.


ఆయుర్వేద చికిత్సలతో జ్వరాలు బలాదూర్‌!

ఆయుర్వేదం జ్వరాలను రెండు రూపాల్లో అంచనా వేస్తుంది. జ్వరాన్ని జ్వరంగానూ లేదా ఇతర రుగ్మతల లక్షణంగానూ పరిగణించి, తదనుగుణ చికిత్స అందిస్తే రుగ్మత అదుపులోకి వస్తుంది. రుతువును బట్టి ఆ కాలంలో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. వర్ష రుతువులో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో ‘వతజ జ్వరం’ అని పేరు. ఈ జ్వరాలకు ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు ఉన్నాయి. 


గ్లాసుడు నీళ్లలో చిటికెడు దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాలపొడి కలిపి వేడి చేసి, నిమ్మరసం కలుపుకుని తాగితే జ్వరంతోపాటు, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.


జీలకర్ర అద్భుతమైన యాంటీసెప్టిక్‌! 

జీలకర్ర పొడి కలిపి మరిగించిన నీటిలో తేనె కలుపుకుని తాగితే వర్షాకాల సంబంధ జ్వరాలు తగ్గుముఖం పడతాయి. జ్వరంతో పాటు విపరీతమైన జలుబు, దగ్గు కూడా ఉంటే గోరువెచ్చని తేనెలో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.


డెంగ్యు జ్వర చికిత్స!

ఆయుర్వేదంలో ఈ జ్వరాన్ని ‘దండక జ్వరం’ అంటారు. ఈ జ్వరం వేధిస్తున్నప్పుడు తేలికగా అరిగే గంజి ఆహారంగా ఇవ్వాలి. తులసి, యాలకులు వేసి కాచిన కషాయాన్ని ఇవ్వాలి. కారాలు, నూనెలు తగ్గించి వండిన ఆహారం ఇవ్వాలి. పునర్వవ మూలికతో తయారైన కషాయంతో డెంగ్యు జ్వరం అదుపులోకి వస్తుంది. అలాగే వ్యాధి నిరోధకశక్తిని పెంచడం ద్వారా పరోక్షంగా ఈ జ్వరం తగ్గేలా చేయవచ్చు. కాబట్టి రోగనిరోధ శక్తిని పెంచే తులసి నీళ్లను రోజంతా తాగించాలి. అలాగే రోజు మొత్తంలో 10 నుంచి 15 తులసి ఆకులు నమిలించాలి. డెంగ్యు జ్వరాన్ని తగ్గించే ‘ధతుర’ మూలికను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. మెంతి ఆకులతో తయారుచేసిన తేనీరు తాగుతూ, ద్రాక్ష, దానిమ్మ రసాలు తీసుకున్నా డెంగ్యు జ్వరం తగ్గుముఖం పడుతుంది.


ఛాతీలో ఇబ్బందికి ‘దీర్ఘ ప్రాణాయామం’!

వర్షాకాలం చల్లని వాతావరణం మూలంగా ఛాతీలో కఫం పేరుకుపోయి ఊపిరి ఇబ్బందవుతుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. ఈ ఇబ్బందులు తొలగాలంటే ‘దీర్ఘ ప్రాణాయామం’ సాధన చేయాలి. ఇందుకోసం నేల మీద నిటారుగా కూర్చుని, గాలి పీల్చుకోవాలి. ఈ గాలి ఛాతీ పై ప్రదేశాన్ని, తర్వాత పొట్టనూ నింపాలి. తిరిగి గాలిని బయటకు వదిలే తీరు వ్యతిరేక క్రమంలో సాగాలి. ఇలా మూడు నిమిషాలపాటు రోజులో కనీసం నాలుగు సార్లు సాధన చేయాలి. ఇలా చేస్తే ఛాతీ, ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ పెరిగి కఫం వదులై బయటకు వస్తుంది. 

వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించడమే బెటర్.. వేటిని తప్పకుండా తినాలంటే..

వర్ష రుతువు ఆహారం!

ఎర్ర బియ్యం, గోధుమలు, జొన్నలు ఈ కాలంలో శ్రేష్ఠం.

సొరకాయ, పొట్లకాయ, దొండకాయ ఎక్కువగా తినాలి. పప్పుల్లో కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఎక్కువగా తీసుకోవాలి.

ఖర్జూరం, ద్రాక్ష, కొబ్బరి తింటూ ఉండాలి.

ఆవు పాలు, మజ్జిగ, నెయ్యి క్రమం తప్పక తీసుకోవాలి.

ధనియాలు, జీలకర్ర, బెల్లం, పుదీనా, ఇంగువ, మిరియాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


ఇవి తగ్గించాలి!

రాగులు, బార్లీ తీసుకోకూడదు.

పాలకూర, కాకరకాయ, క్యాబేజీ తగ్గించాలి.

బఠాణీ, సెనగపప్పు తినకూడదు.

బంగాళాదుంప, సగ్గుబియ్యం, క్యారెట్‌ తగ్గించాలి.

తీపి వంటకాలు, పన్నీర్‌, శ్రీఖండ్‌లకు దూరంగా ఉండాలి. 


కషాయాలతో వర్ష రుతువు రుగ్మతలు దూరం!

మూలికలు, పత్రాలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే కషాయాలు వర్ష రుతువు వేధించే పలు రుగ్మతలకు దివ్యౌషధంలా పని చేస్తాయి. అవేంటంటే...


రోగనిరోధకశక్తి: ఈ రుతువులో సన్నగిల్లే వ్యాధి నిరోధకశక్తిని మెరుగు పరుచుకోవడం కోసం యాలకులు, దాల్చినచెక్క, తెల్ల మిరియాలు వేసిన నీటిని మరిగించి తాగాలి. రుచి సహించకపోతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ కషాయం ప్రతి రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధకశక్తి మెరుగ్గా ఉండి, వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.


అజీర్తి: వానాకాలం తగ్గే అజీర్తిని సరిచేయడం కోసం నీటిలో వాము, సోంపు వేసి మరిగించి, తేనె కలిపి తీసుకోవాలి. భోజనం చేసిన ప్రతిసారీ ఈ కషాయం తాగుతూ ఉంటే, అజీర్తి సమస్య తలెత్తదు.


సాధారణ జ్వరం: ఏడు తులసి ఆకులు, ఐదు లవంగాలు తీసుకుని దంచాలి. వీటిని మరిగించిన నీటిలో కలిపి, కొద్దిగా సముద్రపు ఉప్పు చేర్చి, రెండు రోజులపాటు రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే వర్ష రుతు సంబంధ సాధారణ జ్వరాలు తగ్గుతాయి.


తేలికైన ఆరోగ్య చికిత్సలు!

నీటి సంబంధ రుగ్మతలు దరి చేరకుండా వేడి చేసిన నీరే తాగాలి.

వానాకాలంలో అత్యంత సాధారణమైన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగాలి.

తులసి నీళ్లలో పసుపు కలిపి, కషాయం తయారుచేసుకుని నోరు పుక్కిలిస్తున్నా గొంతు నొప్పి తగ్గుతుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.