ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-08-13T06:05:43+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్యతరహాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని వ్యవసాయ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి తెలిపారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి చౌదరి

వ్యవసాయ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి 

బాపట్ల, ఆగస్టు 12: సూక్ష్మ, చిన్న, మధ్యతరహాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని  వ్యవసాయ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి తెలిపారు. ఆహారోత్పత్తుల పెంపుదలపై అనుబంధశాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపన ద్వారా ఆహారోత్పత్తులు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీని కోసం రాయితీలపై బ్యాంక్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పొదుపు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను మరింత వృద్ధి చేయడానికి అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో లభ్యమయ్యే జీడిపప్పు, సముద్ర ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేస్తే ఉత్పత్తిదారులకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే ప్రజలకు ఆహారోత్పత్తులు చౌకధరకే అందుబాటులోకి వస్తాయన్నారు. మత్స్య సంపదకు మంచి ధర వచ్చేలా ప్రాసెసింగ్‌ యూనిట్‌లను స్థాపించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు 72 లక్షల లీటర్లు పాల ఉత్పత్తులు లభ్యమౌతున్నాయన్నారు. కేవలం 22 లక్షల లీటర్లు మాత్రమే ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నారని మిగిలిన 50 లక్షల లీటర్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. పాల ఉత్పత్తులకు అనుబంధంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఉద్యాన ఏడీ జెన్నెమ్మ, వ్యవసాయశాఖ జేడీ అబ్దుల్‌ సత్తార్‌, మత్స్యశాఖ జేడీ డాక్టర్‌ పి.సురేష్‌, ఎల్‌డీఎమ్‌ డి.ప్రేమ్‌కుమార్‌, పరిశ్రమలశాఖ జీఎం మదన్‌మోహన్‌, పశుసంవర్థకశాఖ జేడీ హనుమంతరావు, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T06:05:43+05:30 IST