గర్భిణిలు కాఫీలు తీసుకుంటే పిల్లలు నల్లగా, కుంకుమ పువ్వు తీసుకుంటే అందంగా పుడతారా?

ABN , First Publish Date - 2022-03-08T18:41:05+05:30 IST

ఊహ తెలిసింది మొదలు, ఊపిరి వదిలే వరకూ బరువు బాధ్యతలతో, సవాళ్లతో మహిళల జీవితం సాగిపోతుంది. తనను తాను నిరూపించుకోవాలనే నిరంతర తపన మహిళలు

గర్భిణిలు కాఫీలు తీసుకుంటే పిల్లలు నల్లగా, కుంకుమ పువ్వు తీసుకుంటే అందంగా పుడతారా?

ఆంధ్రజ్యోతి(08-03-2022)

ఊహ తెలిసింది మొదలు, ఊపిరి వదిలే వరకూ బరువు బాధ్యతలతో, సవాళ్లతో మహిళల జీవితం సాగిపోతుంది. తనను తాను నిరూపించుకోవాలనే నిరంతర తపన మహిళలు స్వీయ శ్రద్ధను విస్మరించేలా చేస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలు మెరికల్లాంటిమహిళలను ఒకింత కుదిపేస్తూ ఉంటాయి. పరిపూర్ణ జీవితాన్ని గడపడం కోసం, అలాంటి సమస్యలను నివారించుకునే మెలకువలను మహిళలు అలవరుచుకోవాలి. 


ఆహారమే ఆరోగ్యం

మహిళల ఆరోగ్యం కుంటుపడడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే! వయసుకు తగిన విధంగా, అవసరమైన పోషకాలు అందేలా చూసుకోగలిగితే ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. 


చిన్న పిల్లల్లో....

12 నుంచి 15 ఏళ్ల వయసు ఆడపిల్లలకు ఎంతో కీలకమైనది. ఆ వయసులో ఎదుగుదల సక్రమంగా సాగడం కోసం పోషకాలు, మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, మైక్రో న్యూట్రియంట్లు అందించడం అవసరం. వారి శరీరాల్లో హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి, సరైన వయసులో రజస్వల కావడం కోసం, నెలసరి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఆడపిల్లలకు చిన్న వయసు నుంచే చక్కని పోషణ అందించాలి. ఇందుకోసం గుడ్లు, పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ ఇవ్వాలి. సాధ్యమైనంత వరకూ జంక్‌ఫుడ్‌ తినకుండా చూసుకోవాలి. నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్‌ లడ్లు, సున్నండలు లాంటి ఇంట్లో తయారుచేసిన చిరుతిళ్లనే ఇవ్వాలి. అలాగే రాగులు, సజ్జలు లాంటి వాటితో జావ, సంగటి తయారు చేసి, వాటిని చిన్న వయసు నుంచే అలవాటు చేయాలి. 


టీనేజీ వయసులో...

టీనేజీ అమ్మాయిలను రక్తలేమి వేధిస్తూ ఉంటుంది. లావైపోతామనే భయంతో సమయానికి తినకపోవడం, ఉపవాసాలు ఉండడం, చేతికందినది తిని సరిపెట్టుకోవడం మూలంగా ఆడపిల్లల్లో అనీమియా తలెత్తుతుంది. దాంతో నెలసరి క్రమం తప్పడం లేదా నెలసరి రక్తస్రావం విపరీతంగా పెరగడం జరుగుతాయి. ఫలితంగా రక్తలేమి మరింత పెరిగి, బలహీనపడిపోతారు. నిస్సత్తువ, మగత, తలనొప్పి, ఒంటి నొప్పులు వేధిస్తాయి. చదువు మీద ధ్యాస తగ్గుతుంది. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండడం కోసం మరీ ముఖ్యంగా తల్లులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ కనబరచాలి. ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, చికెన్‌, తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. చాక్లెట్లు, శీతల పానీయాలు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచి, ఇంట్లో వండిన ఆహారమే తినేలా చూసుకోవాలి. సబ్జా, నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, పాలిష్‌ పట్టని ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 


మధ్య వయసులో... 

ఇంటి పని, ఆఫీసు పనులతో ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో మహిళలు గమనించుకోలేని దశ ఇది. కుటుంబానికి సమస్తం సమకూర్చిపెట్టే క్రమంలో తమ పట్ల శ్రద్ధను విస్మరిస్తూ ఉంటారు. దాంతో ఎముకలు, కండరాల నొప్పులు మొదలవుతాయి. అలసట, నిస్సత్తువలు ఆవరిస్తాయి. ప్రసవాలతో ఎముకల దృఢత్వం తగ్గుతుంది. క్యాల్షియం అవసరం పెరుగుతుంది. కాబట్టి వైద్యుల సూచన మేరకు కొన్ని సప్లిమెంట్లను తీసుకోక తప్పదు. పనుల ఒత్తిడిలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా, మూడు పూటలా తింటూ ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులు ప్రతి రోజూ తీసుకోవాలి. 


పెద్ద వయసులో...

ఈ వయసులో తీరిక దొరుకుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దాంతో ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ, పూజలు, ఉపవాసాలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. నిజానికి ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ వయసులో చక్కని డైట్‌ ప్లాన్‌ను అనుసరించాలి. సమయానికి భోజనం, అల్పాహారాలు తీసుకుంటూ ఉండాలి. తేలికగా అరిగే జావలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం, బీపీ మొదలైన సమస్యలు వేఽధిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గోధుమరవ్వ, రాగులు అల్పాహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజూ గుడ్లు, పాలు ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవాలి. ఎముకల బలహీనతకు క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి. మెనోపాజ్‌ లక్షణాలను తగ్గించే షియా విత్తనాలు, అవిసె గింజల వాడకం పెంచాలి. పీచు ఎక్కువగా తీసుకోవాలి. 


అపోహలు - వాస్తవాలు

బొప్పాయి: బొప్పాయి, పైనాపిల్‌ మొదలైన పండ్లు ‘థర్మోజెనిక్‌ ఫుడ్స్‌’. శరీర వేడిని పెంచే గుణం వీటికి ఉంటుంది. కాబట్టి మొదటి త్రైమాసికంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండడం మేలనే ఉద్దేశంతో వైద్యులు, పెద్దలూ చెప్తూ ఉంటారు. అయితే మిగతా పండ్ల మాదిరిగానే పరిమితంగా బొప్పాయి తినడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. వరుసగా మూడు నాలుగు రోజుల పాటు ఒక పండు మొత్తం తినడం చేయకూడదు. 


ముదురు రంగు పండ్లు: ముదురు రంగు పండ్లు, కాఫీలు తీసుకుంటే పిల్లలు నల్లగా పుడతారనీ, కుంకుమ పువ్వు తీసుకుంటే అందంగా పుడతారనేవి పూర్తిగా అపోహలు. గర్భిణి ఏ ఆహారం తీసుకున్నా, వాటిలోని పోషకాలు మాత్రమే గర్భంలో పెరిగే బిడ్డకు అందుతాయి. అంతే తప్ప పండ్లు, కూరగాయల రంగులు, స్వభావాలు బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపించవు. 


డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌, 

యశోద హాస్పిటల్స్‌,

మలక్‌ పేట, హైదరాబాద్‌


చలాకీగా చింతల్లేకుండా

శరీరం చలాకీగా ఉన్నంత కాలం ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది. కాబట్టి మహిళలు తమకు వీలున్న వ్యాయామాలతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. 


ఏరోబిక్స్‌: ఎముకలకు సంబంధించిన సమస్యలు లేనివాళ్లు ఎంచుకోదగిన వ్యాయామమిది. తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే ఈ వ్యాయామంతో శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చక్కని ఆకృతి సంతరించుకుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి, ఏరోబిక్స్‌ను సాధన చేయాలి. 


వ్యాయామాలు: వారంలో కనీసం ఐదు రోజులు జిమ్‌లో వ్యాయామాలు చేయడం అవసరం. వ్యాయామాలకు ముందు, తర్వాత స్ట్రెచింగ్‌ తప్పనిసరి. ఎముకల దృఢత్వం కోసం బరువులతో కూడిన వెయిట్‌ ట్రైనింగ్‌ చేయాలి. జిమ్‌ ఇష్టపడనివాళ్లు నడక, పరుగు, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ చేయవచ్చు.  


యోగా: వేసవి వేడిమి ప్రభావాన్ని తగ్గించే శీతలి ప్రాణాయామం చేయడం ఈ కాలంలో అవసరం. ఈ ప్రాణాయామంతో నాడులు, కండరాలు స్వాంతన పొందుతాయి. అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది. సుఖాసనం, బాలాసనం, గరుడాసనం, బితిలాసనాలతో ఒత్తిడి తగ్గించుకోవాలి. నడి వయసులో గర్భాశయం కిందకు జారడం, కటి ప్రదేశం బలహీన పడే సమస్యలకు విరుగుడుగా కపోతాసనం, ఆష్ట్రాసనం, ధనురాసనం, మాతంగా ముద్ర సాధన చేయాలి.          


యాంటీ నేటల్‌ యోగా: సుఖ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేసే యోగా ఇది. బ్రీతింగ్‌, స్ట్రెచింగ్‌, భంగిమలు, రిలాక్సేషన్‌తో సాగే ఈ యోగాతో కండరాలు బలపడతాయి. ఒత్తిడి, ఆందోళనలు తగ్గి కమ్మని నిద్ర పడుతుంది. ప్రసవానికి తగ్గట్టుగా కటి కండరాల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.


మనసు - మహత్తు

19 ఏళ్ల వయసులోపే ఆడపిల్లలు సోషల్‌ ఫోబియా, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ మొదలైన మానసిక సమస్యలకు లోనై ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. జీవితంలోని వేర్వేరు దశల్లో ఇందుకు భిన్నమైన భావోద్వేగాలకూ, ఒత్తిళ్లకూ మహిళలు లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ ఆయా మానసిక సమస్యలను సమస్యలుగా గుర్తించే మహిళలు తక్కువ. 


బాల్యంలో: పిల్లల్లో బడికి బయల్దేరే సమయానికి కడుపు నొప్పి మొదలవుతుంది. అది ఆరోగ్య సమస్య కాదని పెద్దలకు తెలుసు. కానీ టీచర్‌ అంటే భయంవల్ల పిల్లల్లో నిజంగానే కడుపు నొప్పి భావన మొదలవుతుంది. పిల్లల లేత మనసుల మీద పడే ఒత్తిడికి ఇదొక ఉదాహరణ. అకారణంగా హుషారు తగ్గినా, ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నా, ఆహారం తీసుకోకపోతున్నా పెద్దలు పిల్లలను ఆరా తీయాలి. 


టీనేజర్లలో: చదువులో పోటీ ఈ వయసులో ఎక్కువ. బాగా మార్కులు తెచ్చుకుంటేనే గుర్తింపు లభిస్తుందనే నమ్మకం వీరిలో ఉంటుంది. సాటి ఆడపిల్లలతో సమానంగా ఉండాలనే ఒత్తిడిలో, తమను తాము నిరూపించుకోవాలనే తాపత్రయంతో ఈ వయసు ఆడపిల్లలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. గొప్ప మార్కులు తెచ్చుకోకపోయినా ఫర్వాలేదని తల్లితండ్రులు చెప్తున్నా, వినిపించుకోరు. ఫలితంగా ప్యానిక్‌ అటాక్స్‌, డిప్రెషన్‌ లాంటివి పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పెద్దలు పిల్లలతో సమయాన్ని గడుపుతూ, స్నేహితుల్లా మెలుగుతూ మానసిక స్థైర్యాన్ని పెంచాలి.  


యుక్త వయసులో: కెరీర్‌ గురించి బెంగ మొదలయ్యే వయసిది. తోటి స్నేహితులు ఉద్యోగాల్లో చేరిపోవడం, తన చదువుకు తగిన ఉద్యోగం దొరకకపోవడం లాంటివి ఈ వయసు ఆడపిల్లలను కుంగుబాటుకు లోను చేస్తాయి. ఈ వయసులో బయలాజికల్‌ డిప్రెషన్‌ కూడా ఎక్కువే! శరీరంలో హ్యాపీ కెమికల్స్‌ తగ్గిపోవడ వల్ల కారణం లేకపోయినా కుంగుబాటుకు, ఎందుకూ పనికిరాని వాళ్లమనే ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇలాంటప్పుడు కౌన్సెలింగ్‌తో పాటు చికిత్స కూడా అవసరమవుతుంది. 


మధ్య వయసులో: ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకోలేకపోవడం, షెడ్యూల్‌ ప్రకారం పనులను ముగించలేకపోవడం మూలంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలతో గృహిణులు సైతం భిన్నమైన మానసిక సమస్యలకు లోనవుతూ ఉంటారు. తమ శ్రమకు గుర్తింపు లేకపోవడం మూలంగా, ఆసరా లేకపోవడం మూలంగా నిస్సహాయతకు లోనవుతారు. దాంతో ఈ వయసు మహిళల్లో మానసిక సమస్యలన్నీ భౌతిక సమస్యలుగా బయల్పడతాయి. చీకాకు, కోపం, విసుగు మొదలవుతాయి. భర్తతో గొడవ పడడం, పిల్లలను కొట్టడం, తరచుగా గొడవలకు దిగడం లాంటివన్నీ పెరుగుతాయి. ఇలా మహిళల్లో వచ్చే మార్పులను కుటుంబసభ్యులు గమనించి, చేదోడువాదోడుగా నిలవాలి. అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 


పెద్దల్లో: ఈ వయసు మహిళలకు తీరిక ఎక్కువ దొరుకుతుంది. దాంతో గతంలోకి జారుకుంటూ, పాత చేదు జ్ఞాపకాలను తవ్వి తీస్తూ, సంగతులను గుర్తు చేసుకుంటూ... ‘అప్పుడలా జరగకుండా ఉండవలసింది, అప్పుడలా నన్ను వాళ్లు ఎంతో బాధపెట్టారు’ అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. లేదా కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతూ ఉంటారు. అణచి ఉంచిన భావోద్వేగాలన్నీ ముది వయసులో పెల్లుబికి బయటకు వచ్చేస్తూ, ఏ చిన్న ప్రతికూల సంఘటన ఎదురు పడినా, దుఃఖంలోకి కూరుకుపోతూ ఉంటారు. కొన్నిసార్లు. కడుపు ఉబ్బరం, వాంతులు మొదలైన అకారణమైన శారీరక సమస్యల రూపంలో మానసిక సమస్యలు బయట పడుతూ ఉంటాయి. ఈ రకమైన సైకోసొమాజిక్‌ సమస్యలకు వైద్యుల సహాయం అందించడం అవసరం. 


డాక్టర్‌ హరిణి అత్తూరు

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌,

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-03-08T18:41:05+05:30 IST