భోజనాలు బంద్‌

ABN , First Publish Date - 2021-12-02T07:05:53+05:30 IST

నిత్యం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అందించే ఆహార సదుపా యాలను నిలిపివేశారు. కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు చెల్లిం చకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమలాపురంలోని ఏరియా ఆసుపత్రితోపాటు జిల్లావ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఫుడ్‌ కాంట్రాక్టర్లకు లక్షలాది రూపాయిల మేర బిల్లులను వైద్య ఆరోగ్య శాఖ చెల్లించాల్సి ఉంది.

భోజనాలు బంద్‌
అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

  • బిల్లులు చెల్లించక.. ఏరియా ఆసుపత్రిల్లో నిలుపుదల
  • నెలల తరబడి కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన బిల్లులు
  • పట్టించుకోని అధికారులు.. ఇబ్బందులు పడ్డ రోగులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

నిత్యం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అందించే ఆహార సదుపా యాలను నిలిపివేశారు. కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు చెల్లిం చకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమలాపురంలోని ఏరియా ఆసుపత్రితోపాటు జిల్లావ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఫుడ్‌ కాంట్రాక్టర్లకు లక్షలాది రూపాయిల మేర బిల్లులను వైద్య ఆరోగ్య శాఖ చెల్లించాల్సి ఉంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు పదేపదే తమ అభ్యర్థనలను ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేదు. దాంతో విసుగు చెంది ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు ముందస్తు నోటీసు అందించి గడువు తీరిన తరువాత ఆసుపత్రిలోని రోగులకు బుధవారం నుంచి ఆహార సదుపాయం నిలిపివేశారు. అమలాపురంలో ఉన్న వంద పడకల ఏరియా ఆసుపత్రిలో నిత్యం 70 నుంచి 80 మంది వరకు ఉండే వివిధ రకాల రోగులకు ఉదయం, సాయంత్రం భోజన సదుపాయం కల్పించేవారు. గత పంతొమ్మిది నెలలుగా కాంట్రాక్టర్లకు ఇక్కడ బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటికే అధికా రులతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రాతినిథ్యం వహించే అమలాపురం ఏరియా ఆసు పత్రిలో రోగులకు భోజన వసతులు నిలిపివేయడంపై అటు రోగులు, ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.12 లక్షల మేర బిల్లులను పెం డింగ్‌లో ఉన్నాయని ఇక్కడ నిర్వాహకుడు రాజులపూడి రూపేష్‌ చెప్పారు. ముందస్తుగా సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చామని, అనివార్య పరిస్థితుల్లో నిలుపుదల చేయాల్సి వచ్చిందంటూ చెప్పారు. అయితే ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. బయట నుంచి భోజనాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. 

సూపరింటెండెంట్‌ వివరణ..

బిల్లులు పెండింగ్‌ విషయంపై కాంట్రాక్టరు తమ దృష్టికి ముంద స్తుగా తీసుకువచ్చారని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె. ప్రభాకరరావు చెప్పారు. కాంట్రాక్టర్‌ నోటీసు ద్వారా తెలిపిన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే 6న జరిగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ చర్చిస్తామన్నారు. 

Updated Date - 2021-12-02T07:05:53+05:30 IST