బాబా చూపిన ఆదర్శం

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మానవులు ఎలా ఉండాలో, సాటివారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మహా గ్రంథాలను చదివి ఉండనక్కరలేదు...

బాబా చూపిన ఆదర్శం

విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మానవులు ఎలా ఉండాలో, సాటివారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మహా గ్రంథాలను చదివి ఉండనక్కరలేదు. సత్పురుషుల జీవితాలను పరిశీలిస్తే చాలు. వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తే చాలు. ఏ కాలానికైనా అదే మార్గదర్శకం. ఈ కరోనా సమయంలోనూ అదే ఆదర్శం.


శిరిడీ సాయి బాబా వద్దకు భాగోజీ షిండే అనే వ్యక్తి వచ్చాడు. అతను కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి బాబా ఆశ్రయం ఇచ్చారు. తన వద్దనే ఉంచుకున్నారు. బాబా బయటకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు భాగోజీ కూడా బయటకు వచ్చేవాడు. ఒకసారి బాబా చెయ్యి కాలింది. అప్పటి నుంచి ప్రతిరోజూ ఆయనకు భాగోజీ కట్టు కట్టేవాడు. అలా రోగుల పట్ల ఆయన ఎంతో దయగా ఉండేవారు. 

ఒకసారి శ్రీమతి మేనేజర్‌ అనే భక్తురాలు షిరిడీ వచ్చింది. ఆమె తరచుగా బాబాను సందర్శించేది. బాబాకు సమీపంలోనే కూర్చొని, ఆయన మాటలు వింటూ ఉండేది. అలాంటి సందర్భంలో కుష్ఠు రోగి ఒకరు బాబా వద్దకు వచ్చాడు. అతనికి వ్యాధి ముదిరిపోయింది. ఒంటి మీద పుండ్ల నుంచి దుర్వాసన వస్తూ ఉండేది. అతను అతి కష్టం మీద మసీదు మెట్లు ఎక్కి, బాబా చెంతకు చేరాడు. బాబా పాదాలకు నమస్కరించాడు. అతని శరీరం నుంచి వచ్చే దుర్వాసనను గమనించి, ‘అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా?’ అని శ్రీమతి మేనేజర్‌ అనుకుంది. ఆ కుష్ఠు రోగి ఎంతో కష్టంతో అక్కడి నుంచి కిందకు వెళ్ళాడు. ‘హమ్మయ్యా! వెళ్ళిపోయాడు’ అనుకుందామె.

బాబా ఇది గమనించారు. ఆ కుష్ఠు రోగిని పిలవమని చెప్పారు. అతను మళ్ళీ అతి కష్టంగా బాబా వద్దకు వచ్చాడు. బాబా అతని దగ్గర ఉన్న గుడ్డ సంచీలోంచీ రెండు పేడా ముక్కలు తీసి, ఒక దాన్ని శ్రీమతి మేనేజర్‌కు ఇచ్చారు. బాబా ఇచ్చారు కాబట్టి ఆమెకు తినక తప్పలేదు. మరో ముక్కను బాబా తన నోట్లో వేసుకున్నారు. అక్కడ అంతమంది ఉండగా పేడా ముక్కను బాబా తనకే ఎందుకు ఇచ్చారో శ్రీమతి మేనేజర్‌కు అర్థమయింది. ఎవరినీ అసహ్యించుకోవద్దనే చక్కటి గుణపాఠం సాయిబాబా చెప్పారని ఆమె తన అనుభవాల్లో పేర్కొంది.

రోగుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో బాబా చేసి చూపించారు. ఎవరినీ అసహ్యించుకోవద్దని, వారిని ఆదరంగా చూడాలనీ చెప్పారు. 

నేడు కరోనా రోగులను వారి కుటుంబ సభ్యులే ఆదరించడం లేదన్న వార్తలు చూస్తున్నాం. వారికి దూరంగా ఉండండి. వారి నుంచి వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించండి. కానీ వారికి కావలసిన మందులూ, ఆహారం అందించండి. వారితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పండి. వారిని ఒక గదిలో ఉంచి, వ్యాధి తగ్గే వరకూ సహకరించండి. తొంభైఅయిదు శాతం మంది కరోనా రోగులు వారం, పది రోజుల్లో బాగై బయటకు వస్తారు. మానవత్వంతో కరోనా రోగులను ఆదుకుందాం. 

- జస్టిస్‌ బి. చంద్రకుమార్‌, 8978385151


Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST