జానపద నాయకుడా? నూతన మానవుడా?

ABN , First Publish Date - 2021-10-21T06:23:48+05:30 IST

‘‘మహిషాసుర మర్దన రోజు పోయాడు రాక్షసుడు. ఎంతమందిని చంపాడు నీచుడు...’’ ఒక ఫేస్ బుక్ ‘మిత్రుడు’ పెట్టిన పోస్టులోని కాసింత సంస్కారవంతంగా ఉన్న వాక్యాలు అవి. ఆర్కే గా ప్రసిద్ధుడయిన మావోయిస్టు...

జానపద నాయకుడా? నూతన మానవుడా?

‘‘మహిషాసుర మర్దన రోజు పోయాడు రాక్షసుడు. ఎంతమందిని చంపాడు నీచుడు...’’ ఒక ఫేస్ బుక్ ‘మిత్రుడు’ పెట్టిన పోస్టులోని కాసింత సంస్కారవంతంగా ఉన్న వాక్యాలు అవి.  ఆర్కే గా ప్రసిద్ధుడయిన మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ మరణం గురించి అన్న మాటలవి. రాజకీయ ఆదర్శాల కోసం పనిచేసేవారికి, వాటిని అంగీకరించని రాజకీయాల నుంచి వ్యతిరేకత, విమర్శ, దూషణ సహజం. కాకపోతే, మరణం అనే సందర్భంలో స్పందనలు భిన్నంగా ఉండాలని మన సంప్రదాయం చెబుతుంది. అదే సమయంలో, కీర్తిశేషులయినంత మాత్రాన, అతిగా ఆకాశానికి  ఎత్తకూడదని కూడా మనవాళ్లే చెబుతారు. సత్యానికి చేరువగా, సభ్యతకు లోబడి వ్యాఖ్యలు చేయడం పాటించవలసిన విలువ. కానీ, కొందరి జీవితాలు అంచనాలకు దొరకవు. తీవ్రమైన ప్రేమకు, ద్వేషానికి ఆస్కారమిచ్చే జీవితాచరణలను కొందరికి ఎన్ని సార్లు మననం చేసుకున్నా తనివితీరదు. మరికొందరికి ఎంత దూషించినా తృప్తి కలగదు. 


ప్రయోజనాల రీత్యా తనకు శత్రువు అయిన వారిలో కూడా ద్వేషభావనలను ఉపశమింపజేసి, గౌరవాన్ని ఉద్దీపింపచేయగలినవారు పోరాటంలో కీలకమయిన మజిలీ చేరుకున్నట్టే. ఆర్కే మరణ వార్తలను, ఆయన గురించిన కథనాలను జాతీయ, ప్రాంతీయ పత్రికలు ప్రచురించిన, ప్రసారం చేసిన తీరు, కొన్ని మినహాయింపులతో, ఆశ్చర్యకరమైన సానుకూలతతో ఉన్నాయి. పోలీసు, అర్ధసైనిక బలగాలకు అందకుండా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని, రాజ్యాన్ని కూలదోయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక నిషిద్ధ రాజకీయ పార్టీ నాయకుడిని,  సమాచార సాధనాలన్నీ సముచిత గౌరవంతో, ఒకింత ఆరాధనతో పరిగణించాయి. సహజమరణం కావడం కొంత కారణం కావచ్చు. కానీ, ఆయన ఏ ఎన్‌కౌంటర్ లోనో మరణించి ఉన్నా, ఈ పరిగణన దాదాపు ఈ మోస్తరుగానే ఉండేదనిపిస్తుంది. చనిపోయిన తీరుపై చర్చ లేనందువల్ల, ఆయన జీవితం మీద మరింత లోతైన కుతూహలం కలిగి ఉండవచ్చు కూడా.  ఆర్కే మీద సమాజంలోని అనేక శ్రేణులలో  ఈ గౌరవానికి, ఆరాధనకు, పరిగణనకు కారణమేమిటి? మరి, నీచుడు, రాక్షసుడు అని వ్యాఖ్యలు చేసిన ‘మిత్రుడి’ సంగతేమిటి? మరునాడే అదే ఫేస్‌బుక్ ఖాతాదారు ‘మావోయిస్టు ఆర్కే మరణం--.. ఓ కన్నీటి ప్రేమ కథ’ అన్నపేరుతో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం పొందిన పోస్టును రీపోస్టు చేశారు. ‘‘ఎంతటి కఠినాత్ముడికైనా కన్నీళ్లు రాక మానవు’’ అని, ‘‘ఈరోజులలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపించడం సహజం’’ అన్న వాక్యాల ఉపోద్ఘాతాన్ని కూడా జోడించారు. తన అసందర్భతను కొంత సరిచేసుకునే ప్రయత్నం చేశారు. 


శ్రీకాకుళ పోరాట నాయకుడు చనిపోయినప్పుడు ఒక పత్రిక ‘నరకాసుర వధ’ అన్న శీర్షికతో సంపాదకీయం రాసిందంటారు. నక్సలైట్ ఉద్యమం ఆరంభమైన తొలి సంవత్సరాలలో, ఆ నాటి ఆచరణ తీవ్రతల వల్ల, అప్పటి మీడియా పరిమితుల వల్ల, ప్రతికూల ప్రచారానికి ఎక్కువ ఆస్కారముండేది. ఎందరో విద్యాధికులు, భద్రజీవనం ఉన్నవారు కూడా పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించినా, వారి త్యాగ నిరతి తరువాతి తరం పోరాటాలకు స్ఫూర్తి అయినంతగా, ఆనాటి వర్తమానానికి ఆలంబన కాలేకపోయింది. ఇప్పుడు, ఐదు దశాబ్దాల తరువాత,  కమ్యూనిస్టు విప్లవకారులను దూషించడానికి ప్రధానస్రవంతి మీడియా దగ్గర నుంచి ప్రజాజీవితంలో ఉన్నవారెవరూ సుముఖంగా లేరు. విభేదించవచ్చు, విమర్శించవచ్చు కానీ, విద్వేషం ప్రకటించడానికి ఉత్సాహపడరు. ఇది భయం వల్లనో, భక్తి వల్లనో ఏర్పడిన స్థితి కాదని, నక్సలైట్ ఉద్యమకారులు తమ వ్యక్తిత్వాల ద్వారా నిర్మించుకున్న ప్రతిష్ఠ అని అనిపిస్తుంది. విచక్షణ లేకుండా హత్యలు చేస్తారని, నాయకులు విలాసజీవితంలో ఉంటారని ప్రచారం జరిగేది. అవేవీ పెద్ద  ప్రభావం వేయకపోవడంతో, తరువాత కాలంలో అరణ్య అజ్ఞాత వాసాలలో కూడా బలహీనతలు, ఆధిపత్యాలు ఉంటాయన్న ప్రచారాన్ని ఆలంబన చేసుకున్నారు. 


ఒక మిలిటెంట్ విప్లవసంస్థలో పనిచేయడానికి కేవలం ఉత్సాహం మాత్రమే కాక, సంసిద్ధత, అవగాహన వంటి అనేక గుణాలు అవసరం. ‘బయటి’ ప్రపంచం నుంచి ‘లోపలికి’ వెళ్లే వారిలో ప్రపంచంలోని జాడ్యాలు, అవలక్షణాలు ఎంతో కొంత ఉంటాయి. కారణం లేకుండా ఎవరి మీదా దాడి చేయరు, అమాయకులను గురిపెట్టరు అన్న నమ్మకానికి విఘాతం కలిగించిన సంఘటనలు కూడా అనేకం జరిగాయి. మంచి, చెడు సంఘటనల బేరీజులో నక్సలైట్లు మొత్తం మీద తమ ప్రతిష్ఠను నిలుపుకుంటూనే వచ్చారు. అర్ధ శతాబ్ద కాలంలో వివిధ ప్రభుత్వాలు ప్రజాహృదయాలలో స్థాపించదలచుకున్న ప్రతికూల కథనం విఫలమైంది. నక్సలైట్ల ఉద్యమం నష్టపోయిందా, విస్తరించిందా, ప్రస్తుతం ఏ దశలో, ఏ స్థాయిలో ఉన్నది అన్న ప్రశ్నలతో, వాటి సమాధానాలతో నిమిత్తం లేకుండా, ఆ ఉద్యమకారులు తమ గురించి తాము వ్యక్తం కాగోరిన రీతిలో కథనాన్ని నిర్మించగలిగారు. ఆర్కే మరణంపై జనసామాన్యంలో కలిగిన స్పందనలు, ఆయన గురించి, ఆయన నేపథ్యం గురించి, కుటుంబం గురించి కలిగిన ఆసక్తులు, విప్లవకారులపై సమాజంలోని సానుకూల కథనాన్ని మరింత దృఢపరిచాయి. ప్రసిద్ధ విప్లవ కథకుడు అల్లం రాజయ్య కథ ‘అతడు’,  ఒక హతుడైన విప్లవకారుడి వ్యక్తిత్వాన్ని, అతనితో మెలగిన, అతనిని ప్రేమించిన అనేక పాత్రల మననం ద్వారా కథనం చేస్తాడు. ఆర్కే జీవిత కథనాన్ని ఈ వారం రోజులూ తెలుగు సమాజం  తెలుసుకునిమరీ మననం చేసుకున్నదనిపించింది. 


రెండు తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టు ఉద్యమం నామమాత్రమే అని చెప్పవచ్చు. ఛతీస్‌గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దు కావడం వల్ల తెలంగాణలో, ఒరిస్సాకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉనికి ఉండవచ్చును. ఆర్కే తెలుగు ప్రజల ముందుకు బహిరంగంగా వచ్చిన పదిహేడేళ్ల కిందటిస్థితి వేరు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన విప్లవ పార్టీల నేతలు ప్రజలలో వేసిన ముద్ర గాఢమైనది. ప్రతీకాత్మకంగా అయినా, ప్రధానస్రవంతి అధికారవ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ శక్తులను ప్రజలు గుర్తించారని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. సాయుధుడైన నక్సలైట్ అంటే ప్రజలకు స్ఫురించే ఒక రూపాన్ని– టోపీ పెట్టుకుని, తెల్లచొక్కా వేసుకున్న ఒక మృదుభాషి మార్చివేశాడు. ఆయన, ఆయనతో పాటు వచ్చినవారు, అటువంటి పోరాటవాదుల గురించిన అన్ని అపోహలను, అపసవ్య కథనాలను పూర్వపక్షం చేస్తూ, రక్తమాంసాలతో కూడిన మానవీయ యోధులను ఆవిష్కరించారు. అనంతరం ఎదుర్కొనవలసి వచ్చిన దారుణ దమనకాండను దృష్టిలో పెట్టుకుని 2004 చర్చలను, పెద్ద పొరపాటుగా కొందరు పరిగణించవచ్చును కానీ, అది దీర్ఘకాలికంగా అందించిన ప్రయోజనం గొప్పది. విప్లవకారులు, ప్రభుత్వం ఒక ప్రక్రియలో భాగస్వాములయ్యారు, బలాబలాలైనప్పటికీ, చర్చల బల్ల ముందు రెండు పక్షాలూ సమవుజ్జీలయ్యారు. ఆనాడు, ఆర్కే వేసిన ముద్ర, ఆర్కేను ప్రజలు చూసిన పద్ధతి ఈ రెండూ ఆయన మరణం సందర్భంగా వ్యక్తమైన సానుభూతిలో పరావర్తనం చెందాయి. 


ప్రజలు మావోయిస్టు పార్టీ వంటి శక్తులకు ఆర్కే వంటి ముఖచిత్రం కావాలని కోరుకుంటున్నారా? అవసరమైతే ఒక మెట్టు దిగి, దృఢత్వం చెదరకుండానే ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధపడే ఆచరణాత్మకతను మావోయిస్టు పార్టీ అలవరచుకోవాలా? మిలిటెంట్ ఆచరణ, పోలీసు నిర్బంధం, నిషేధం,  అరణ్యవాసం, ఎన్‌కౌంటర్లు, వ్యక్తిగత జీవితమే లేని నిస్వార్థత- ...ఇవన్నీ దైనందిన సాధారణమైనట్టు పరిగణిస్తూ, ఆర్కేను స్మరించుకుంటున్న తెలుగు ప్రజలకు ఇదంతా గతం తాలూకు బెంగ కాదని, వర్తమాన ఆకాంక్ష కూడానని విప్లవకారులు గుర్తిస్తారా?


తెలుగు రాష్ట్రాలలో విప్లవపార్టీల ఉనికిని కాపాడుకోవడంలో పెద్దగా పట్టింపు చూపని ప్రజలు, నాయకులో, కార్యకర్తలో మరణించినప్పుడు వ్యక్తం చేసే ఆవేదన నైతికమైనదేనా? లేక, ఇక్కడ భౌగోళికంగా ఉద్యమం లేకున్నా, దేశవ్యాప్తంగా తెలుగువారే నేతలుగా ఉండడం వల్ల మిగిలిన అవశేష వాతావరణమా? కొండలకు ఆవల, సుదూరంగా ఒక సాయుధ శక్తి సమాజంలోని దుర్మార్గాలకు, అసమానతలకు విరుగుడు సాధన చేస్తున్నదన్న భావనాత్మకమైన ఉద్వేగం కోసమే మావోయిస్టులా? లేదా, వ్యవస్థలో విపరీత స్థాయికి చేరిన అంతరాలు, స్వార్థం, క్రౌర్యం, కపటత్వాలను మదింపు వేయడానికి  అవసరమైన పతాకస్థాయి ఆదర్శవాదిగా విప్లవకారుడి ఉనికిని కోరుకుంటున్నారా?


ఇంతా చేసి భద్రజీవులకు కావలసింది ఒక జానపద కథానాయకుడేనా?


కె. శ్రీనివాస్

Updated Date - 2021-10-21T06:23:48+05:30 IST