కోళ్లకు మేత కరువు

ABN , First Publish Date - 2020-03-29T11:12:51+05:30 IST

కరోనా దెబ్బకు కోళ్ల పరిశ్రమ కకావికలమైంది. కొనేవారు లేక మాంసం ధర పడిపోవడం, దాణా కొరత కోళ్ల రైతులను పట్టిపీడిస్తోంది.

కోళ్లకు మేత కరువు

నిండుకున్న దాణా నిల్వలు

 డ్రైవర్లు, హమాలీలు లేక ఆగిన ధాన్యం రవాణా 

 పరిస్థితి చక్కబడకపోతే లక్షల్లో కోళ్లు మృతి

ఆందోళనలో పౌలీ్ట్ర రైతులు


      చిత్తూరు (వ్యవసాయం) మార్చి 28: కరోనా దెబ్బకు కోళ్ల పరిశ్రమ  కకావికలమైంది. కొనేవారు లేక మాంసం ధర పడిపోవడం, దాణా కొరత కోళ్ల రైతులను పట్టిపీడిస్తోంది. ధరలు లేక కోళ్లను మేపలేక ఇప్పటికే చాలా కోళ్లను అయిన కాడికి తెగనమ్ముకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.120 వరకు ధర పలుకుతున్న తరుణంలో ఉన్నవాటిని మేపేందుకు అవసరమయిన దాణా లేకుండా పోయింది. కొందరి వద్ద నేటితో నిల్వలు పూర్తవగా మిగిలిన రైతుల వద్ద మూడు నాలుగు రోజులకు సరిపడ దాణా మాత్రమే ఉంది. 


లక్ష టన్నుల దాణా అవసరం

   జిల్లాలో బ్రాయిలర్‌, లేయర్‌ రకాల కోళ్ళను రైతులు పెంచుతున్నారు. 120 మంది రైతులు 75 వేల లేయర్‌ (గుడ్డుపెట్టే కోళ్ళు) కోళ్ళను, 600 మంది రైతులు సుమారు కోటి వరకు బ్రాయిలర్‌, లింగాపురం (మాంసం కోసం పెంచే కోళ్ళు) కోళ్లను మేపుతున్నారు.  లేయర్‌ రకానికి చెందిన కోడి సగటున రోజుకు 100 గ్రాముల దాణాను తింటుండగా బ్రాయిలర్‌, లింగాపురం కోళ్లు ఒక బ్యాచ్‌కి (40 నుంచి 45 రోజుల మధ్య) నాలుగు నుంచి నాలుగున్నర కిలోల దాణాను తింటాయి. దీనిప్రకారం జిల్లాలోని లేయర్‌ కోళ్ళకు (వీటి జీవిత కాలం ఐదేళ్ళు) 90 రోజులకు కలిపి 67,500 టన్నులు, బ్రాయిలర్‌ కోళ్లకు 90 రోజులకు 45 వేల టన్నుల దాణా అవసరముంది.


రెండూ కలిపితే 1,12,500 టన్నుల దాణా అవసరం. అయితే సుమారు సగం మంది కోళ్ళ రైతుల వద్ద దాణా స్టాకు నేటితో పూర్తయింది. మిగిలిన రైతుల వద్ద మూడు నాలుగు రోజులకు సరిపడే స్టాకుంది. దాంతో రేపటినుంచి కోళ్ళకు మేత ఎలా పెట్టాలనే ఆందోళన రైతుల్లో మొదలయ్యింది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 5 వేల టన్నుల దాణా మాత్రమే అందుబాటులో వున్నట్లు కోళ్ళ రైతులు చెబుతున్నారు. 


ఆగిన సరుకు రవాణా

కోళ్ళ దాణాను చాలామంది కోళ్ళరైతులే తమవద్ద ఉండే ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంటుల్లోనే తయారు చేస్తున్నారు. దాణాకు అవసరమయిన జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, సోయా, గానుగపిండి, తవుడు తదితర సామగ్రిని తెలుగు రాష్టాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సివుంటుంది. లాక్‌డౌన్‌లో రవాణాపై ఆంక్షలు లేనప్పటికీ లారీల డ్రైవర్లు ముందుకు రాకపోవడం, మెటీరియల్‌ లోడ్‌ చేసే హమాలీలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో సరుకు దిగుమతి కాక దాణా కొరత ఏర్పడింది. 


 ప్రభుత్వమే ఆదుకోవాలి

   కోళ్ళ పరిశ్రమకు నాలుగైదు రోజుల్లో దాణా సరఫరా కాకపోతే పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లాకు చెందిన నెక్‌ సభ్యులు చొరవ తీసుకుని దాణా లేని రైతులకు దాణా ఉన్న వారి వద్ద నుంచి సర్దుబాటు చేశారని, ఇకపై సర్దుబాటు చేయడానికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. ఒకటి రెండు రోజుల వరకు కోళ్లు నీరు తాగి బతుకుతాయని. ఆ తర్వాత  తిండిలేక చనిపోవడం మొదలైతే లక్షల్లో చనిపోతాయని ప్రస్తుతమున్న విపత్తు ముందు ఇది మరో విపత్తుగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని పౌలీ్ట్రని ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-29T11:12:51+05:30 IST