బడ్జెట్‌పై శ్రద్ధ పెట్టండి

ABN , First Publish Date - 2020-12-05T10:16:00+05:30 IST

బడ్జెట్‌ తయారీపై శ్రద్ధ పెట్టాలని, అంచనాలు సరిగ్గా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు కాగ్‌ అక్షింతలు వేసింది. అంచనాలకు, వాస్తవాలకు మధ్య రూ. వేల కోట్ల తేడా ఉంటోందని అభిప్రాయపడింది.

బడ్జెట్‌పై శ్రద్ధ పెట్టండి

 ఆర్థిక శాఖకు కాగ్‌ అక్షింతలు


అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ తయారీపై శ్రద్ధ పెట్టాలని, అంచనాలు సరిగ్గా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు కాగ్‌ అక్షింతలు వేసింది. అంచనాలకు, వాస్తవాలకు మధ్య రూ. వేల కోట్ల తేడా ఉంటోందని అభిప్రాయపడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిరోజైన శుక్రవారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదిక సభలో ప్రవేశపెట్టారు. ఆ ఏడాది అంచనా వేసిన ఆదాయానికి, వాస్తవ రాబడికి మధ్య 40,836 కోట్ల రూపాయల భారీ తేడా ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. అదే విధంగా పెట్టుబడుల వ్యయం రాష్ట్ర స్థూల ఉత్పతితో కేవలం 2.14 శాతం మాత్రమే ఉందని వెల్లడించింది.


2018-19లో మొత్తం రెవెన్యూ వ్యయం 1,28,570 కోట్ల రూపాయల్లో కమిటెడ్‌ వ్యయం రూ.68,225 కోట్లకు పెరిగినట్లు వివరించింది. ప్రభు త్వం సబ్సిడీలు తగ్గించడమే దీనికి కారణమని కాగ్‌ స్పష్టం చేసింది. వేస్‌ అండ్‌ మీన్స్‌ వాడుకున్నందుకుగానూ 2017-18లో రూ.44 కోట్లు, 2018-19లో రూ. 64కోట్లు ఆర్బీఐకి ప్రభుత్వం వడ్డీ చెల్లించిందని వివరించింది. అలాగే, బడ్జెట్‌లో కేటాయించకుండా రూ.2,790 కోట్లు అదనంగా ఖర్చు చేశారని వెల్లడించింది. ఈ విషయాలపై ఆర్థిక శాఖ దృష్టి సారించాలని, ప్రత్యేక అధికారులను నియమించుకుని వ్యయ నిర్వహణ మెరుగుపరచుకోవాలని సూచించింది. 

Updated Date - 2020-12-05T10:16:00+05:30 IST