Abn logo
Sep 24 2021 @ 00:25AM

ఈటెలకు రెడ్లను దూరం చేయాలని..

రెడ్డి సామాజికవర్గంపై టీఆర్‌ఎస్‌ కన్ను

25న భారీ ఎత్తున సమావేశం

స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌ రెడ్డి, సబితారెడ్డి హాజరు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు రెడ్డి సామాజికవర్గంపై దృష్టి సారించింది. రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఉండే నియోజకవర్గంగా పేరుండడంతోపాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన సతీమణి పక్షాన అండగా ఉంటూ వస్తున్న రెడ్డిలను ఎలాగైనా దూరం చేయాలని భావిస్తున్నది. ఈటల సతీమణి జమున రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో నియోజకవర్గంలో ఈటలకు ఆ వర్గం నుంచి కొంత మద్దతు లభిస్తున్నది. ఆ మద్దతును దూరం చేసే కార్యక్రమంలో భాగంగానే గత ఎన్నికల్లో ఈటలపై పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం సిఫారసు చేసింది. 


ఇప్పటికే పార్టీలోకి పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ను బలహీనపర్చడంతోపాటు రెడ్డి సామాజికవర్గ ఓట్లను తమవైపు మళ్లించడంలో కౌశిక్‌ రెడ్డి ఉపయోగపడతాడని ఆయనను పార్టీలోకి తీసుకుంది. బీజేపీలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్‌ మాజీ శాసనసభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నది. వెలమల ప్రాబల్యం ఉన్న పార్టీగా పేరున్న టీఆర్‌ఎస్‌ పట్ల జిల్లాలో రెడ్డి సామాజికవర్గం మొదటి నుంచి కొంత గుర్రుగానే ఉన్నది. టీఆర్‌ఎస్‌ పార్టీలో రెడ్ల ప్రాధాన్యాన్ని రోజురోజుకు తగ్గిస్తున్నారన్న అపవాదు కూడా ఆ పార్టీకి ఉన్నది.


ఉమ్మడి జిల్లా పరిధిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండగా నలుగురు వెలమలు ఎమ్మెల్యేలుగా మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారని రెడ్డి సామాజికవర్గం బాహటంగానే పలుమార్లు విమర్శించింది. ఇప్పుడు రెడ్డి సామాజికవర్గంలో ఉన్న అభిప్రాయాన్ని దూరం చేసి వారిని పార్టీలో కలుపుకుపోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు మొదటి అడుగు హుజూరాబాద్‌ నుంచే వేసేందుకు నిర్ణయించుకొని కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫారసు చేసింది. ఇనుగాల పెద్దిరెడ్డికి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ హామీ ఇచ్చినట్లు తెలిసింది.


హుజూరాబాద్‌లో 22,600 రెడ్డి సామాజిక వర్గ ఓట్లు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు 22,600 ఉండగా వారు ప్రాబల్యం చూపే ఓట్లు అత్యంత కీలకమని టీఆర్‌ఎస్‌ భావిస్తూ రెడ్డిలను మచ్చికచేసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలో రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించడంతోపాటు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీనికి ఈ నెల 25న శంకుస్థాపన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశాన్ని జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తోపాటు  అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సురేశ్‌రెడ్డి హాజరయ్యేలా కార్యక్రమం రూపొందించారు.


నియోజకవర్గంలో ఉన్న రెడ్లందరిని పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, వైశ్య, ముదిరాజ్‌, నాయీబ్రాహ్మణ సామాజికవర్గాల సమావేశాలను కూడా ఇప్పటికే భారీ ఎత్తున జరిపి ఆయా కులాల భవన నిర్మాణాలకు స్థలం కేటాయించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏ కులాన్ని కూడా వదలకుండా అందరినీ మచ్చిక చేసుకొని తిరుగులేని విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. రెడ్డి సామాజికవర్గాన్ని దూరం చేయడం ద్వారా ఈటలను ఏకాకిని చేయాలని ఆ పార్టీ ప్లాన్‌గా చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మహిళాసంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నోటిఫికేషన్‌కు ముందే ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. రెడ్డి సామాజికవర్గ సమావేశం ఇప్పుడు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రధాన చర్చగా మారింది. దానికి ఎంత మంది హాజరవుతారు, వారి మనోభావాల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా అన్నదానిపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు.