ఏకైక ఎమ్మెల్యే రాపాక‌కు వరుస ఎదురుదెబ్బలు!?

ABN , First Publish Date - 2021-01-14T18:14:31+05:30 IST

ఏకైక ఎమ్మెల్యే రాపాక‌కు వరుస ఎదురుదెబ్బలు!?

ఏకైక ఎమ్మెల్యే రాపాక‌కు వరుస ఎదురుదెబ్బలు!?

జనసేనకు షాక్‌ ఇచ్చి అధికార పార్టీకి జై కొట్టిన రాజోలు ఎమ్మెల్యే రాపాకకు వైసీపీలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? వైసీపీ నాయకుడిగా గొప్పలు చెప్పుకుంటున్నా.. పార్టీ శ్రేణులు ఏ మాత్రం అంగీకరించడం లేదా? నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతున్నది ఎవరు? అధికారుల తీరుపై ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? బొంతు రాజేశ్వరరావు మౌనం వెనుక రహస్యం ఏంటి ? రాజోలు నియోజకవర్గంలో వైసీపీ నేతల అంతర్గత కుమ్ములాటపై ఏబీఎన్ ఇన్ సైడ్ కథనం ఇప్పుడు చూద్దాం.


ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ..

రెంటికి చెడ్డ రేవడి అన్నట్లుగా మారిందట జనసేన నుంచి గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న రాపాక వరప్రసాదరావు పరిస్థితి. రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహితంగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారు. తన తనయుడ్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతనని, సీఎం తనను పార్టీలో పనిచేయాలన్నారని పదేపదే చెప్పుకుంటున్నారు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే తప్పేంటని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎమ్మెల్యే రాపాకను తమ పార్టీ నేతగా అంగీకరించటం లేదట. రాపాక తన తనయుడు వెంకట రామ్‌ను వైసీపీలో చేర్పించటం.. తాను ఆ పార్టీ నాయకుడినే అని చెప్పుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట.


టాక్ ఏంటి..!?

మరోవైపు ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ రాజోల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. స్థానికేతరురాలైన పెదపాటి అమ్మాజీని సైతం లోకల్ వైసీపీ లీడర్లు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయి నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌గా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు కూడా అమ్మాజీ అజమాయిషీని తట్టుకోలేకపోతున్నారట. ఆమె వైఖరిపై బొంతు రాజేశ్వరరావు వర్గం పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో..వారు కొంతకాలంగా మౌనంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరిన కార్యకర్తలు అమ్మాజీ వర్గంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వైసీపీ క్యాడర్ అమ్మాజీని నాయకురాలిగా అనుమతించలేక పార్టీని వీడలేక సతమతమయ్యారట. ఈ క్రమంలో అమ్మాజీ నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు.


చేదు అనుభవం..

అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు అమ్మాజీకి మింగుడు పడటం లేదంటారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమ్మాజీకి చేదు అనుభవం ఎదురువుతుందట. సఖినేటిపల్లిలో రోడ్డు నిర్మాణ శంకుస్థాపన శిలాపలకంలో అమ్మాజీ పేరు లేకపోవటంతో ఆమె అధికారులపై మండిపడినట్లు సమాచారం. అధికారులు డ్రామాలు ఆడుతూ, రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారట. అమలాపురం ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే అమ్మాజీ అధికారులను నిలదీసినట్లు లోకల్ టాక్. అయితే ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే రాపాక మాత్రం అమ్మాజీ అసహనంపై ఏమాత్రం స్పందించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఆమెకు పుండుమీద కారం చల్లినట్లయిందట.


కార్యకర్తలు విడిపోయారా..?

మరోవైపు నియోజక వర్గంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ఇటీవల మలికిపురం మండలం శంకరగుప్తం ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీలో సీనియర్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ను నిలదీశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. దాంతో ఎమ్మెల్యే రాపాక, పెదపాటి అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావు మూడు వర్గాలుగా పార్టీ కార్యకర్తలు విడిపోయినట్లు తెలుస్తోంది.


ఆధిపత్య పోరు.. 

ఇంకోవైపు రాజోలు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములు విషయంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయట. తక్కువ రేటు ఉన్న భూములకు ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేశారనీ..వాటాల పంపకంలో తేడా రావడంతో అంతర్గత కుమ్ములాటకు దారితీసినట్లు సమాచారం. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు చేపడుతున్న మట్టి తవ్వకాల పనుల డబ్బు పంపకాల్లో మనస్పర్థలు రావడంతో వారి మధ్య అగ్గిరాజేసిందట. ఇలా ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే రాపాక, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పార్టీలో ముదురుతున్న ఈ వర్గపోరును అధిష్టాన పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Updated Date - 2021-01-14T18:14:31+05:30 IST