సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో రంగస్వామి
రెవెన్యూ డివిజనల్ అధికారి రంగస్వామి
రాయచోటిటౌన్, మే 26: రాయచోటి పట్టణంలోని జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రంగస్వామి సూచించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జగనన్న కాలనీల్లో నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు అవసరమైన మెటీరియల్ అందజేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి ఇళ్లు నిర్మించుకునే గ్రూపు సభ్యులకు గ్రూపుల ద్వారా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇసుక, నీరు తదితర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వార్డు సెక్రటరీలు, వీఆర్‌వోలకు కేటాయించిన వార్డుల్లో లబ్ధిదారులకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన మెటీరియల్ సప్లై చేయాలని ఆయన సూచించారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి, వార్డు సెక్రటరీలు, రెవెన్యూ సెక్రటరీలు, హౌసింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.