వైసీపీలో లుకలుకలు

ABN , First Publish Date - 2022-06-29T06:13:48+05:30 IST

మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నచందంగా సీఎం సొంత ఇలాకాలో వైసీపీ వ్యవహారం ఉంది. జగన్‌ సీఎంగా మూడేళ్ల పాలనకే వైసీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగలు కక్కుతుండడం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీల సాక్షిగా కార్యకర్తల గోడు, నేతల అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి.

వైసీపీలో లుకలుకలు
కడప ప్లీనరీలో దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు

ప్లీనరీ సాక్షిగా బట్టబయలు అవుతున్న అసమ్మతి సెగలు

బద్వేలు ప్లీనరీకి ఎమ్మెల్సీ సొంత తమ్ముడు, కాశినాయన జడ్పీటీసీతో పాటు, ఎంపీపీ డుమ్మా

కడప ప్లీనరీలో మధ్యలోనే బయటకి వెళ్లిన వైసీపీ శ్రేణులు 

కడప, జూన్‌ 28(ఆంరఽధజ్యోతి): మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నచందంగా సీఎం సొంత ఇలాకాలో వైసీపీ వ్యవహారం ఉంది. జగన్‌ సీఎంగా మూడేళ్ల పాలనకే వైసీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగలు కక్కుతుండడం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీల సాక్షిగా కార్యకర్తల గోడు, నేతల అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. మొన్న పులివెందుల్లో జరిగిన ప్లీనరీలో కార్యకర్తలు గోడు వినిపించగా నిన్న జరిగిన ప్రొద్దుటూరు,  జమ్మలమడుగు ప్లీనరీల్లో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా ప్లీనరీల్లో నేతల మధ్య విభేదాలు, కార్యకర్తల అసమ్మతి రాగాలు కనిపించాయి. 

మంగళవారం బద్వేలులో జరిగిన ప్లీనరీలో మరోసారి నాయకుల మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి. కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధాల బద్వేలు నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. బద్వేలు వైసీపీలో కొద్ది రోజులుగా కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ప్లీనరీ సాక్షిగా ఇవన్నీ బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోదరుడు, కాశినాయన జడ్పీటీసీ డి.సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ నల్లేరు పోలమ్మ, మాజీ మండలాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి వర్గీయులు ఈ ప్లీనరీకి గైర్హాజరు కావడం వైసీపీలో కలకలం రేపింది. ఎమ్మెల్సీ సొంత మండలం, ఆయన కుటుంబీకులే సమావేశానికి రాకపోవడం పట్ల తీవ్ర చర్చ జరిగింది. కాశినాయన నుంచి కొద్ది మంది నాయకులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. ప్లీనరీకి గైర్హాజరైన విషయంపై ఆంధ్రజ్యోతి కాశినాయన మాజీ మండలాధ్యక్షుడు నల్లే విశ్వనాథరెడ్డితో మాట్లాడగా పార్టీలో గుర్తింపు లేకపోవడంతో సమావేశానికి గైర్హాజరయ్యారన్నారు. పార్టీపై అమితమైన అభిమానం ఉందన్నారు. 

ఇక కడపలో జరిగిన ప్లీనరీ సమావేశం తొలుత చప్పగా సాగింది. కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు రాజకీయ ప్రసంగాలు చేశారు. కాసేపు ఓపికగా కూర్చున్న నాయకులు, కార్యకర్తలు ఆ తరువాత కుర్చీల నుంచి కదలడం మొదలుపెట్టారు. ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు ప్రసంగించే సమయానికి సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. వెళ్లి పోయే వారిని కూర్చోబెట్టాలని కొంత మంది కార్పొరేటర్లు నాయకులు ప్రధాన ద్వారం వద్ద నిలబడి బతిమాలుతూ కనిపించారు. అయినా ఎవరు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. మాటలు చెప్పడం... కార్యకర్తలను అవసరానికి వాడుకోవడం తప్ప తగిన గుర్తింపు లేదంటూ గుసగుసలాడుకోవడం వినిపించింది.

Updated Date - 2022-06-29T06:13:48+05:30 IST