కమలంలో లుకలుకలు

ABN , First Publish Date - 2022-04-13T07:25:48+05:30 IST

కమలదళంలో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యనేతల

కమలంలో లుకలుకలు

  • ముఖ్య నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం.. రోజూ అవమానిస్తుంటే భరించాలా?
  • ప్రొటోకాల్‌ పాటించరా?: ఎమ్మెల్యే రఘునందన్‌
  • బండి సంజయ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి 
  • టికెట్లు ఇప్పిస్తామనేవారిని నమ్మొద్దు: బండి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కమలదళంలో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యనేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. పైకి కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా, కొంతమంది సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయని, ఒకరి పొడ మరొకరికి గిట్టట్లేదని.. ఒకరికి పేరు రావడం మరొకరికి ఇష్టం లేదన్న పరిస్థితి కొనసాగుతోందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ, గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బయటపడుతున్న ఈ అసంతృప్తి కలకలం సృష్టిస్తోంది. తమకు గౌరవం ఇవ్వట్లేదని, అవమానిస్తున్నారని పేర్కొంటూ, కొందరు సీనియర్‌ నాయకులు కొద్దిరోజుల క్రితం బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.


కేంద్రపార్టీ జోక్యంతో ఈ వ్యవహారం, అంతర్గతంగా సర్దుమణిగినట్లు భావిస్తున్న తరుణంలో.. పార్టీ కార్యక్రమాల వేదికలపై ప్రొటోకాల్‌ పాటించట్లేదంటూ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి కలకలం సృష్టించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వైఖరిని తప్పుబడుతూ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులుకు రఘునందన్‌ తన అసంతృప్తిని తెలియజేశారు. ‘‘రోజూ అవమానిస్తుంటే భరించాలా?’’ అని నిలదీశారు. పార్టీ గురించి, పార్టీ రాజ్యాంగం గురించీ అందరికీ తెలుసని.. ప్రొటోకాల్‌ పాటించకపోతే కుదరదని తేల్చిచెప్పారు.


మంగళవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ఘటన పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘‘రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆహ్వానించిన నన్ను వేదికపైకి ఎందుకు పిలవలేదు? ఎంపీలు మాత్రమే గెలిచిన ప్రజాప్రతినిధులా? ఎమ్మెల్యే కాదా? ఇదేం పద్ధతి? ఈ వైఖరి ఎంతవరకు సమంజసం? ఈ వైఖరి ఇది మొదటిసారి కాదు. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్‌ వద్ద ప్రారంభించినప్పుడు వేదికపై ఉన్న ఏకైక ఎమ్మెల్యేను నేనే. నాతోనే మాట్లాడించలే. ముగింపు సభ మా (సిద్దిపేట) జిల్లాలోని హుస్నాబాద్‌లో జరిగినప్పుడు కూడా  మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించడం కాదా? ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ పదవులు ఇస్తే ఏమవుతుంది? పార్టీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ ఛుగ్‌ చెప్పి 3 నెలలయినా ఎందుకు స్పందించలేదు? నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు భిన్నంగా సంజయ్‌ సొంత జిల్లా కేంద్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎందుకు ఫ్లోర్‌లీడర్‌ను నియమించలేదు? జీహెచ్‌ఎంసీ ఎన్నికలై 16 నెలలు గడచినా.. తరుణ్‌ఛుగ్‌, అభిప్రాయ సేకరణ చేసి మూడునెలలైనా ఫ్లోర్‌ లీడర్‌ను, ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌లను, విప్‌ను ఎందుకు ప్రకటించలేదు??’’ అంటూ రఘునందన్‌ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.


‘‘పార్టీకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న మమ్మల్ని ఇంత అవమానిస్తారా?’’ అని మండిపడినట్లు వెల్లడించాయి. అలాగే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా, ఉద్యమకారుడిగా గుర్తింపున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, జిల్లాల పర్యటన పట్ల సంజయ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ఒక ప్రచారం ఉండగా, సంజయ్‌కు పేరు రావడం ఈటలకు ఇష్టం లేదన్న వాదన మరోవైపు ఉంది. ఈటల జిల్లాలకు వెళ్లేముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తీసుకుంటే బాగుంటుందని, సంజయ్‌ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో.. పార్టీ తరఫున ఈటల రాష్ట్రవ్యాప్త పర్యటనకు కేంద్ర నాయకత్వం అనుమతి ఇవ్వకపోవడం వెనుక  సంజయ్‌ ఉన్నారని ఆయన సన్నిహితులు నమ్ముతున్నారు.



సంజయ్‌ కీలక వ్యాఖ్యలు..

పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని.. టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. వారికి, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. యూపీలో ఇలా చెప్పుకొన్నవారెవరికీ టికెట్లు రాలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఈటలను ఉద్దేశించే చేసినట్టు ఓ వర్గం నేతలు అభిప్రాయ పడుతున్నారు. ‘ముఖ్యనేతలు జిల్లాల్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లోనే పాల్గొనాలి. వ్యక్తిగతంగా, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ పదాధికారుల సమావేశంలో సంజయ్‌ చేసిన మరోవ్యాఖ్య కూడా చర్చకు దారితీసింది.


Updated Date - 2022-04-13T07:25:48+05:30 IST