ఏపీ బీజేపీలో లుకలుకలు

ABN , First Publish Date - 2020-07-10T16:06:40+05:30 IST

ఒకే ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ కమలనాథులను కుదిపేసింది.

ఏపీ బీజేపీలో లుకలుకలు

అమరావతి: ఒకే ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ కమలనాథులను కుదిపేసింది. రాజధాని రైతులను కలవరపరిచింది. నిన్న మొన్నటి వరకు ఉద్యమానికి దన్నుగా ఉన్న బీజేపీ నేతలను కూడా ఆ ప్రకటన డిఫెన్స్‌లో పడేసింది. డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్‌సైజ్‌ను కొంతమంది నేతలు చేపట్టారు. రాజధాని ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న రోజున రైతులను ఉద్దేశించి బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలు మరిచిపోక ముందే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దేవదర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు రేపాయి.


ఏపీ బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. రాజధానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు తమ మనోభావాలను బహిర్గతం చేస్తున్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని, అది బీజేపీ నిర్ణయమని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర పార్టీకి రాష్ట్ర శాఖ పంపింది. ఇందుకు అనుగుణంగానే నేతలంతా మాట్లాడాలని రాష్ట్ర పార్టీ సూచించింది. బీజేపీ, జనసేనతో కలిసిన తర్వాత కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. కన్నా, సుజనా చౌదరి, పురందేశ్వరి ఇతర నేతలంతా మద్దతు తెలిపారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దేవదర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారు. రైతుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని, అమరావతిలోనే రాజధాని ఉండాలని, అదే తమ పార్టీ నిర్ణయమని చెబుతూనే.. మరోవైపు రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. అందులో కేంద్రం జోక్యం చేసుకోదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని మద్దతుదారులకు కోపం తెప్పించాయి. ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు సునీల్ దేవదర్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించాయి.

Updated Date - 2020-07-10T16:06:40+05:30 IST