'Flu' fevers: జ్వరాల జోరు..!

ABN , First Publish Date - 2022-09-14T13:54:43+05:30 IST

నిన్నటి వరకూ కరోనాతో అల్లాడిన నగరం.. ఇప్పుడు ‘ఫ్లూ జ్వరాలతో వణికిపోతోంది. అది కొవిడ్‌ జ్వరమా, లేక ఫ్లూ జ్వరమో అర్థంగాని అయోమయంలో

'Flu' fevers: జ్వరాల జోరు..!

- భారీగా విజృంభిస్తున్న ‘ఫ్లూ’ 

- రెండేళ్ల తరువాత ఇదే అత్యధికం


చెన్నై, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకూ కరోనాతో అల్లాడిన నగరం.. ఇప్పుడు ‘ఫ్లూ జ్వరాలతో వణికిపోతోంది. అది కొవిడ్‌ జ్వరమా, లేక ఫ్లూ జ్వరమో అర్థంగాని అయోమయంలో సామాన్యులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదిలా వుండగా రెండేళ్ల తర్వాత నగరంలో ‘ఫ్లూ’ జ్వరాలు('Flu' fevers) ఇంతగా విజృంభించడం ఇదే తొలిసారి. 

సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ‘ఫ్లూ’ ప్రబలటం ఆనవాయితీ. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం, మాస్కులు ధరించడం వల్ల ‘ఫ్లూ’ జ్వరాలు ఎక్కువగా వ్యాపించలేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వైరస్‌ నిబంధనలకు స్వస్తి చెప్పారు. మాస్కులు లేకుండా నిర్భయంగా సంచరిస్తున్నారు. దీంతో నగరంలో ప్రస్తుతం వైరల్‌ జ్వరాలు మళ్ళీ అధికమయ్యాయి. ‘ఫ్లూ’ జ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ జ్వరాల బారినపడుతున్న చిన్నారులు, విద్యార్థుల సంఖ్య అధికమైనట్లు వారు పేర్కొంటున్నారు. దగ్గు, జ్వరం సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య గత నాలుగు రోజులుగా విపరీతంగా పెరిగింది. ‘ఫ్లూ’ జ్వరాలు ఎక్కువగా చిన్నారులకే వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గు(Cold, cough)తో జ్వరం తగ్గకపోవడం ‘ఫ్లూ’ ఆనవాళ్లు. ఇలాంటి జ్వరాల నిరోధానికి వ్యాక్సిన్‌ అందుబాటులోనే ఉన్నాయి. ఇలాంటి జ్వరం వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫ్లూ’ జ్వరాలు శ్వాసకోశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని, దీంతో దగ్గు అధికమవుతుందన్నారు. వీటికి తోడు వంటి నొప్పులు, గొంతు ఎండిపోవడం, అప్పుడప్పుడూ వాంతులు కూడా, కడుపునొప్పి కూడా వెంటబెట్టుకుని వస్తాయి. ఈ జ్వరాలు రెండు రోజుల్లోనే తగ్గుతాయి. కొందరికి వారం రోజులు పైగా కొనసాగుతాయి. ఈ సమస్యలతోనే ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వాస్పత్రుల్లో జ్వరపీడితులు చికిత్సకోసం చేరుతున్నారు. ఈ జ్వరాలకు చికిత్సలందించేందుకు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ’ఫ్లూ’ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ జ్వరబాధితులు దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు జ్వరం వ్యాపిస్తుందని వైద్యనిపుణులు తెలిపారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారు తప్పకుండా మాస్కు ధరించి ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2022-09-14T13:54:43+05:30 IST