పూవులైతే చాలు

ABN , First Publish Date - 2020-07-13T05:56:39+05:30 IST

అది నీ గొంతో నా గొంతో కాకపోవచ్చు కానీ మన గొంతులకై చిరుగుతున్న గొంతు చేసిన నేరమల్లా ఇనుప పాదాలకు పచ్చి ముళ్ళై గుచ్చుకోవడం...

పూవులైతే చాలు

అది నీ గొంతో నా గొంతో కాకపోవచ్చు

కానీ మన గొంతులకై చిరుగుతున్న గొంతు

చేసిన నేరమల్లా

ఇనుప పాదాలకు పచ్చి ముళ్ళై గుచ్చుకోవడం.



నాలుగు చువ్వల వెనుక జలపాతాన్ని బంధిస్తే

నది పుట్టదని నమ్మే చెదల సిద్ధాంతమది.

గోడల పెట్టెలను తాకిన మనిషి తడి 

జైలు జీరని నగరానికీ మోసుకొచ్చిందనీ

ఎప్పుడూ అటు చూడని పువ్వులను

జడిలో తడుపుతుందనీ తెలియదేమో..


వీచే గాలికి వూగి సంబరపడటం,

చక్రాల కింద నలిగే సాటి కుసుమాలకు

కర్మ రంగు ఊహల్ని పులిమి జాలిపడటమేగాని

పువ్వులపైకొచ్చిన చక్రాలకెప్పుడు ఎదురుతిరిగాం?

అందుకే పూలరేకులపై ముళ్ళూ మొలవాలి.

బంధించబడ్డది కేవలం గొంతు మాత్రమే

నినాదాలు నదులై సముద్రాల్ని చేరతాయి

పారే దారిలో

మనిషి తోటల్నీ తడిపిపోతాయి.


అది నీ కలో నా కలో కాకపోవచ్చు

మన కలలు నేరమయ్యేలోగా

స్వేచ్ఛా కలలు కనే స్వేచ్ఛ కోసం

ఓ గొంతవ్వాలి.

ఊచలు తెంపమని అడగడానికి

ఎర్ర పూవులవ్వాల్సిన పని లేదు

పూవులైతే చాలు.

శ్రీ వశిష్ఠ సోమేపల్లి

99664 60536


Updated Date - 2020-07-13T05:56:39+05:30 IST