పూల పండుగ.. లాభాలు మెండుగా!

ABN , First Publish Date - 2022-09-30T05:00:53+05:30 IST

పూలను సాగు చేసిన రైతులు బహు లాభాలు ఆర్జిస్తున్నారు.

పూల పండుగ.. లాభాలు మెండుగా!
చేవెళ్ల మండల పలుగుట్ట గ్రామంలో సాగు చేసిన చామంతి పూలు

  • ఈ ఏడాది పూల సాగు బాగు
  • గులాబీ రైతుకు కాసుల పంట
  • మార్కెట్‌లో గులాబీ కిలో రూ.300
  • కనకాంబరాలు కిలో రూ.800
  • చామంతి కిలో రూ. 150
  • బంతి కిలో రూ.80


పూలను సాగు చేసిన రైతులు బహు లాభాలు ఆర్జిస్తున్నారు. వరుసగా వస్తున్న పండగలతో మార్కెట్‌లో పూలకు గిరాకీ పెరిగింది. బతుకమ్మ, నవరాత్రుల పూజలకు పూల అవసరం అధికంగా ఉండటంతో వాటి కొనుగోళ్లు బాగా పెరిగాయి. దీంతోపాటు ధరలు పెరిగి రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ ఏడాది కురిసిన వర్షాలకు పూల పంటలకు కొంత నష్టం కలిగింది.


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/చేవెళ్ల, సెప్టెంబరు 29 : బతుకమ్మ, దసరా పండగలు పూల రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల సాగు కొంత దెబ్బతిన్నప్పటికీ, చేతికొచ్చిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు సంతోషపడుతున్నారు. దసరా, బతుకమ్మ, దీపావళి సీజన్‌లలో పూలకు మంచి డిమాండ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పండగ సమయాల్లో అలంకరణ కోసం బంతి, చామంతి, గులాబీ, లిల్లీ పూలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూలకు ఎనలేని డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పూల విక్రయాలు బాగా పెరిగాయి. డిమాండ్‌కు సరిపడా పూల దిగుబడులు లేకపోవడంతో పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గులాబీ, బంతి ధరలు రికార్డుస్థాయిలో పలుకుతున్నాయి. దీంతో పూలసాగు చేస్తున్న రైతులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం గులాబీకి ఎక్కువ గిరాకీ ఉంది. కొన్నిచోట్ల అసలు గులాబీ దొరకడం లేదు. కిలో రూ.300 నుంచి 350 వరకు ధర పలుకుతోంది. చామంతి కిలో ధర రూ.150, లిల్లీ పూలు కిలో రూ.100, బంతి కిలో రూ.70 నుంచి రూ.80 చొప్పున ధర పలుకుతుంది. కనకాంబరాలు కిలో రూ.600నుంచి రూ.800 వరకు పలుకుతోంది. జిల్లాలో సుమారు ఆరున్నర వేల ఎకరాల్లో (వానాకాలం, యాసంగి సీజన్లలో) రైతులు పూలసాగు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చేవెళ్ల, మొయినాబాద్‌, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి, మహేశ్వరం, శంషాబాద్‌, కందుకూరు, కొత్తూరు, కేశంపేట తదితర మండలాల్లో పూల సాగు ఎక్కువగా ఉంది. ఎక్కువగా గులాబీ, బంతి, చామంతి, జర్బార, కనకాంబరాలతోపాటు డెకరేషన్‌కు వినియోగించే పలురకాల పూలు, అస్పారస్‌ గడ్డి రైతులు సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో హైదరాబాద్‌ శివార్లలో పూలసాగుపై ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి ప్రతిఏటా కూడా పూల రైతులకు లాభాలు వస్తాయనుకుంటే పొరపాటే. డిమాండ్‌కు మించి పూల పంటలు సాగు చేసిన సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం పూల రైతులు లాభాలు పండిస్తున్నారు. ముఖ్యంగా వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని పూల పంటలు వేశారు. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ వేసిన రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నీటి వనరులు అందుబాటులో ఉండడంతో ఈ ఏడాది పూల పంటల సాగు కూడా పెరిగింది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చాలాచోట్ల పూల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంటల ఉత్పత్తి కూడా తగ్గింది. ఈ కారణంగా ఉన్న పంటకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఎంగిలిపూల  బతుకమ్మ సంబరాలు మొదలుకొని దసరా పండగ వరకు పూల వినియోగం ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే దీపావళి సమయంలో కూడా పూలకు డిమాండ్‌ ఉంటుంది. 


నేరుగా రైతుల నుంచి కొనుగోలు

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పూల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉదాహరణకు పూలమార్కెట్‌లో గులాబీ కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.400వరకు అమ్ముతున్నారు. మిగతా పూల విక్రయాలు కూడా బహిరంగ మార్కెట్‌లో అధికంగా ఉన్నాయి. దీంతో పండగల వేళ పూజలు చేసుకునేవారు నేరుగా రైతుల నుంచే పూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా రైతుల వద్దకే కొనుగోలుదారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు కూడా రవాణా చార్జీలు మిగులుతున్నాయి. 


ఆశించిన ధర రావడం లేదు

కష్టపడి పండించిన చామంతి పూలకు మార్కెట్‌లో ఆశించిన ధర లభించడం లేదు. ఎకరం భూమిలో చామంతి పూలను సాగు చేశాను. రూ.80వేల పెట్టుబడి అయింది. ఇప్పటివరకు రెండు విడతలు పూలు కోశాను. కిలో చామంతి రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. ఇదే ధర మార్కెట్‌లో నిలకడగా ఉంటే రైతులకు లాభం చేకూరుతుంది.

- మల్లారెడ్డి, రైతు, పలుగుట్ట, చేవెళ్ల, మండలం 


సాగు ఖర్చులు పెరిగాయి

పూల మార్కెట్‌లో బంతి, లిల్లీ పూలకు ధరలు అంతగా లేవు. ఒక ఎకరం భూమిలో బంతి, మరో ఎకరంలో లిల్లీ పూలను సాగు చేశాను. కిలో పూలు రూ.70 నుంచి రూ.150 ధరకు అమ్ముడుపోతున్నాయి. సాగు ఖర్చులు పెరగడంతో  రైతుకు ఏం మిగులడం లేదు. రెండు రోజుల నుంచి మార్కెట్‌లో ధరలు పెరిగాయి. నెలక్రితం ధరలు దారుణంగా ఉండేవి. 

- యాదిరెడ్డి, రైతు, పలుగుట్ట, చేవెళ్ల మండలం 


గులాబీలకు డిమాండ్‌ బాగుంది 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గులాబీ పూల పంటలు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. పూల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో గులాబీలకు డిమాండ్‌ పెరిగింది. ప్రసుత్తం కిలో ధర రూ.300 పలుకుతుంది. రెండు ఎకరాల్లో గులాబి మొక్కలు రూ. 3 లక్షలు వెచ్చించి సాగు చేస్తే అధిక వర్షాలతో పూర్తిగా పాడైంది. ప్రస్తుత ధరలతో రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చేంది. ప్రభుత్వం పూల రైతులను ఆదుకోవాలి. 

- భూషణం, రైతు, రామంతాపూర్‌, శంకర్‌పల్లి మండలం 




Updated Date - 2022-09-30T05:00:53+05:30 IST