పూల పండుగకు ముస్తాబు

ABN , First Publish Date - 2020-10-24T10:59:29+05:30 IST

పూల పండుగకు ఊరూవాడ ముస్తాబయ్యాయి. బతుకు నీవమ్మా... బతుకమ్మ.. అంటూ భక్తి శ్రద్ధలతో మహిళలు బతుకమ్మ ఆడారు.

పూల పండుగకు ముస్తాబు

నేడు సద్దుల బతుకమ్మ సంబరాలు

జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు 

కొవిడ్‌ నిబంధనలపై ప్రచారం  


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పూల పండుగకు ఊరూవాడ ముస్తాబయ్యాయి. బతుకు నీవమ్మా... బతుకమ్మ.. అంటూ భక్తి శ్రద్ధలతో  మహిళలు   బతుకమ్మ ఆడారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద బతుకమ్మతో  వెళ్లి రావామ్మ అంటూ సాగనంపనున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కొవిడ్‌ జాగ్రత్తలను ప్రచారం చేస్తున్నారు. బతుకమ్మ అనగానే మహిళల ఆటాపాట గుర్తుకొస్తాయి. బతుకమ్మ అంటే మహిళలేకాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడు చులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ  సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ రోజుల్లో పల్లెబాటలకు ఇరువైపులా.. పసుపు పారబోయిసినట్లుగా తంగేడుపూలు కనిపిస్తాయి. తీరొక్క పూలు ఆడపడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద బతుకమ్మను మహిళలు జరుపుకుంటే.. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. 


పెద్ద బతుకమ్మ పేర్చి కొత్త దుస్తులు ధరించి గౌరి దేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద ఆడ పడుచులు బతుకమ్మ  ఆడుతారు. చీకటి పడుతున్న వేళ ఊరి శివారులోని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఆటాపాటలతో పెద్ద బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేధ్యంగా  సమర్పిస్తారు. ఆడ పడుచులు పల్లెంలో తెచ్చిన నీటితో  వాయినాలు ఇచ్చుకుంటారు.  


బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు తీరంలో సిరిసిల్ల మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ దీపాలతోపాటు వాగులో ప్రత్యేకంగా నీటి సౌకర్యాన్ని కల్పించారు.  శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జిందం చక్రపాణి  ఏర్పాట్లను పరిశీలించారు.


వేములవాడ పట్టణంలో రెండు రోజుల ముందే పెద్ద బతుకమ్మ సంబరాలు జరగగా  సిరిసిల్ల, చందుర్తి, తంగళ్లపల్లి, బోయిన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వేములవాడ రూరల్‌, ముస్తాబాద్‌, ఇల్లంత కుంట, వీర్నపల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటల వద్ద విద్యుత్‌ దీపాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురవడంతో సిరిసిల్ల మానేరు వాగు పారుతోంది, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో బారికేడ్లు కట్టి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-10-24T10:59:29+05:30 IST