పూల రైతు దిగాలు

ABN , First Publish Date - 2022-01-25T04:40:53+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన పూలకు

పూల రైతు దిగాలు

  • మార్కెట్‌లో ధరలు లేక విలవిల
  • పెట్టుబడి రాక పొలంలోనే పూలు
  • చామంతి కిలో ధర రూ.15, లిల్లీ రూ.10


చేవెళ్ల, జనవరి 24 : ఆరుగాలం కష్టించి పండించిన పూలకు మార్కెట్‌లో సరైన ధరలు లేక రైతులు బోరుమంటున్నారు. కూరగాయల పంటలను సాగుచేస్తే ధరలు కలిసి రావడం లేదని పూల సాగుతోనైనా లాభాలు పొందాలనుకున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. పది రోజులుగా మార్కెట్‌లో పూలకు ధరలు భారీగా తగ్గిపోయాయి. మార్కెట్‌కు తీసుకెళ్తే కొనేవారు లేరని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ధరలు లేక పెరిగిన ఖర్చులతో పొలంలోని పూలను కోయకుండానే వదిలేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూలీల  ఖర్చు కూడా రాకపోగా చేతి నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. 

చేవెళ్ల మండల పరిధిలోని చేవెళ్ల, కౌకుంట్ల, ఆలూర్‌, పలుగుట్ట, కందవాడ, చనువల్లి, పామెన, రేగడిఘనాపూర్‌, ఖానాపూర్‌, బస్తేపూర్‌, దేవునిఎర్రవల్లి, గొల్లపల్లి, కమ్మెట, ఈర్లపల్లి, అంతారం తదితర గ్రామాల్లో చాలామంది రైతులు బంతి, చామంతి, లిల్లీ పూలను సాగు చేశారు. ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఎకరాల్లో డ్రిప్‌ పద్ధతిలో పూల పంటను సాగుచేశారు. ఎకరంలో పూల సాగు చేయాలంటే సుమారు రూ.30వేల ఉంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ఆ పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు వివరిస్తున్నారు. 


దళారుల దోపిడీ

ప్రస్తుతం గుడిమాల్కాపూర్‌ మార్కెట్‌లో చామంతి కిలో ధర రూ.15, లిల్లీ పూల కిలో ధర రూ.10 పలుకుతుండటంతో పొలంలోని పూలను కోసి మార్కెట్‌కు తరలించాలంటేనే రైతులు వెనుకడుగు వేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చినా అలాగే వదిలేస్తున్నారు. అయితే మార్కెట్‌లో రైతుల వద్ద తక్కువ ధరలకు పూలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్‌లో పూలకు సరైన ధర కల్పించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.


పదిరోజులుగా భారీగా తగ్గిన ధర

 దసరా, దీపావళి మొదలుకొని సంక్రాంతి వరకు పూల ధరలు బాగానే ఉన్నాయి. రైతులకు కూడా లాభాలు తెచ్చిపెట్టాయి. ఉన్నట్టుండి పదిరోజులుగా ధరలు భారీగా తగ్గాయి. సంక్రాంతి పండగకు ముందు వారం రోజులపాటు చామాంతి పూల ధర కిలో రూ. 60 నుంచి రూ.80 వరకు పలికింది. ప్రస్తుతం చామంతి, బంతి పూల కిలో ధర రూ.10 నుంచి రూ.20కి పడిపోయింది. అలాగే లిల్లీ పూల ధర కిలో రూ. 70 నుంచి రూ. 90 వరకు ఉందేడి. ప్రసుత్తం లిల్లీ పూల కిలో ధర రూ.10 నుంచి రూ.15కు పడి పోయింది. కాగా ఒక్కొక్క రోజు పూలు అమ్ముడుపోక మార్కెట్‌లోనే పారబోసి వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూలు కోసే కూలీకి రోజుకు రూ.400 నుంచి రూ.500 ఇస్తున్నా రైతుకు మాత్రం ఆ డబ్బులు సైతం రావడం లేదంటున్నారు. 


శుభాకార్యాలు లేక డీలా

పూల ధరలు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం మంచి రోజులు లేక ఎలాంటి శుభాకార్యాలు జరగకపోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పండగలు లేకపోవడం, అయ్యప్ప పూజలు ముగియడంతో పూలను కొనేవారులేక డిమాండ్‌ తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఇటీవల బెంగూళూర్‌ నుంచి పెద్ద మొత్తంలో పూలు నగరంలోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు తగ్గాయని వాపోతున్నారు. మళ్లీ పెళ్లిలు, ఇతర శుభకార్యాలు ప్రారంభమైతేనే పూల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని, అంతవరకు పూల రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 


ధరలు లేవని లిల్లీ పూలు కోయడం లేదు

మార్కెట్‌లో లిల్లీపూలకు ధరలు లేకపోవడంతో పొలం లోనే కోయ కుండా వదిలేశాం. రెండు ఎకరాల్లో లిల్లీ పూలు సాగు చేశా. పంట చేతి కొచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడిపోయి తీవ్ర నష్టం వాటి ల్లింది. కిలో పూలను రూ.10కి అమ్మితే ఏం మిగులుతుంది. ప్రభుత్వం స్పందించి మార్కెట్‌లో సరైన ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 

- నర్సింహులు, మాజీ సర్పంచ్‌, పలుగుట్ట 


రవాణా ఖర్చులు కూడా రావట్లేదు

కష్టపడి చామంతి పూలను పండిస్తే మార్కె ట్‌లో ధరలే లేవు. కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ధరలు ఇలా ఉంటే అప్పులే మిగులు గాయి. చాలా మంది పూలను కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పూల రైతులను ఆదుకోవాలి. 

- మల్లారెడ్డి, రైతు, పలుగుట్ట


Updated Date - 2022-01-25T04:40:53+05:30 IST