వరద గోదారి!

ABN , First Publish Date - 2021-07-25T06:32:55+05:30 IST

గోదావరి వరద ఉధృతమవుతోంది. ఏజెన్సీని ముంచేస్తోంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో పెద్ద ప్రభావం లేదు.

వరద గోదారి!
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి

కాఫర్‌డ్యామ్‌ వల్ల ప్రవాహంలో మార్పు

 డ్యామ్‌ ఎగువన ఎక్కువ నిలిచిపోతున్న వరద నీరు

 వీలైనంతగా స్పిల్‌వే నుంచి వదిలేస్తున్న వైనం

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి రాత్రి  9 గంటలకు     5.4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి వరద ఉధృతమవుతోంది. ఏజెన్సీని ముంచేస్తోంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో పెద్ద ప్రభావం లేదు. కానీ కోనసీమ లంకలను ముంచుతూ చాలా మటుకు వరదనీరు సముద్రంలోకి వెళ్లిపోతోంది. వాస్తవానికి ఈపాటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో వార్నింగ్‌  కూడా  జారీ చేయాలి. కానీ మొదటి హెచ్చరిక కూడా జారీ కాలేదు. ఎందుకంటే భద్రాచలం నుంచి వస్తున్న వరద నీరు అధికంగా పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వల్ల ఎగువ భాగంలోనే ఉండిపోవడం వల్ల స్పిల్‌వే గుండా వచ్చే నీరే కిందకు వస్తోంది. దీంతో ఒత్తిడి తగ్గిం ది. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటల సమయానికి సుమారుగా 49 అడుగుల నీటిమట్టం వచ్చింది. అదే సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.4 లక్షల  క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నా రు. కానీ ఈ ప్రవాహ తీవ్రత పెరుగుతోంది. అందువల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని, అప్పుడు మొదటి వార్నింగ్‌ జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎగువ భాగంలో ఉన్న వరద నీరు ఇవాళ కాకపోయినా రేపైనా బ్యారేజీ గుండా సముద్రంలోకి పోవలసిందే. లేకపోతే ఏజెన్సీ గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. పోలవరం ప్రధాన డ్యామ్‌ ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌  కట్టేవరకూ అక్కడ పెద్దగా నిల్వచేయరు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ నుంచి కాల్వలకు కూడా నీటిని మళ్లిం చే అవకాశం లేదు. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులలో ఇంకా పెండింగ్‌ ఉంది. ఇక పోలవరం కాఫర్‌డ్యామ్‌ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం సాయంకాలం ఆరు గంటలకు  31.9 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పిల్‌వే గుండా 6 లక్షల 62 వేల 825 క్యూ సెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలోని గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రజలకు వరద బాధ, అఽధికార యం త్రాంగానికి సహాయక చర్యలు చేపట్టే సమస్య తప్పింది. కానీ ముంపు బాధితులందరికీ పరిహారం ఇవ్వకుండానే తరలించడంతో అరకొర సౌకర్యాల మధ్య వారు గడుపుతున్నారు. ప్రస్తుతం దేవీపట్నం గ్రామంలో వరద నీరు అధికంగా చేరింది. పోలీసు స్టేషన్‌ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఇటు పోచమ్మ గుడి పూర్తిగా మునిగిపోయింది. శిఖరం ఒక్కటే బయటకు కనిపిస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు దిగువకు రావడంతో పి గన్నవరం మండలంలోని గంటిపెదపూడి, ఊడిమూడి గ్రామ పంచాయతీల పరిధిలోని నాలుగు లంకగ్రామాల ప్రజలు ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నాటు పడవల మీదే ప్రస్తుతం ఆయా లంకలవాసులు బయటకు రాకపోకలు సాగిస్తున్నారు.



Updated Date - 2021-07-25T06:32:55+05:30 IST