అమెరికాలో 54 పాఠ్యపుస్తకాలపై నిషేధం..! కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-04-20T00:44:00+05:30 IST

గణితశాస్త్రానికి సంబంధించిన 54 పుస్తకాలను నిషేధిస్తున్నట్టు ఫ్లోరిడా రాష్ట్ర విద్యాశాఖ తాజాగా పేర్కొంది.

అమెరికాలో 54 పాఠ్యపుస్తకాలపై నిషేధం..! కారణం ఇదే..

ఎన్నారై డెస్క్: గణితశాస్త్రానికి సంబంధించిన 54 పాఠ్యపుస్తకాలను నిషేధిస్తున్నట్టు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విద్యాశాఖ తాజాగా పేర్కొంది. పుస్తకాల్లో క్రిటికల్ రేస్ థియరీ అనే టాపిక్ ప్రస్తావన ఉండటం, ఫ్లోరిడా విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడం వంటి కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఈ ఏడు విద్యార్థుల కరిక్యులమ్‌లో చేర్చేందుకు మొత్తం 132 పుస్తకాలను పరిశీలించిన విద్యాశాఖ .. 54 పుస్తకాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతకుమునుపు.. విద్యార్థులకు బోధించే పుస్తకాలను తమ పరిశీలనకు పంపాలంటూ అక్కడి పబ్లిషర్లను విద్యాశాఖ కోరింది. అనంతరం.. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించింది. పరీశీలనకు వచ్చిన మొత్తం పుస్తకాల్లో  21 శాతం బుక్స్‌ను.. నిషేధిత అంశాలున్న కారణంతో తొలగించింది. విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా లేని కారణంగా మరో 9 శాతం పుస్తకాలను బ్యాన్ చేసింది. క్రిటికల్ థియరీ లాంటి అనవసరమైన అంశాలున్న కారణంతో మరో 14 శాతం పుస్తకాలను పుస్తకాల తుది జాబితా నుంచి తీసేసింది. 


ఏమిటీ క్రిటికల్ రేస్ థియరీ.. 

అమెరికాలో వేళ్లూనుకుపోయిన వివక్షకు గల కారణాలను వివరించేదే క్రిటికల్ రేస్ థియరీ(సీఆర్‌టీ). దీని ప్రకారం.. అమెరికాలో శ్వేతజాతీయేతరులు తమ రోజువారీ జీవితాల్లో వివక్ష ఎదుర్కోవడం సర్వసాధారణం. అంతేకాకుండా.. అమెరికాలో వ్యవస్థాగతమైన ఈ వివక్ష.. తెల్లవారికి ప్రయోజనకరంగా మారింది. 1970ల్లో ఈ థియరీ పురుడుపోసుకుంది. న్యాయవాది అయిన డెర్రిక్ బెల్‌తో పాటూ ఇతర శ్వేతజాతీయేతర  సామాజిక కార్యకర్తలు, లాయర్లు,  మేధావుల కృషి కారణంగా ఇది వెలుగులోకి వచ్చింది. డా. కింబర్లే క్రెన్షా వంటి లాయర్లు, ఇతర మేధావులు 1989లో సీఆర్‌టీని సైద్ధాంతికపరమైన అంశాల్లో మరింత బలోపేతం చేశారు. 

Updated Date - 2022-04-20T00:44:00+05:30 IST