కరోనా అంటించాడంటూ డాక్టర్‌పై ఫిర్యాదు చేసిన నర్సు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-10-26T04:19:42+05:30 IST

డాక్టర్ కరోనా అంటించాడంటూ అమెరికాలో ఓ నర్సు కోర్టుకెక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెనిస్ జీన్ అనే యువతి

కరోనా అంటించాడంటూ డాక్టర్‌పై ఫిర్యాదు చేసిన నర్సు.. అమెరికాలో..

ఆర్లాండో: కరోనా అంటించాడంటూ అమెరికాలో ఓ నర్సు కోర్టుకెక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెనిస్ జీన్ అనే యువతి ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో పీపీఈ కిట్లు లేవని గతంలో డాక్టర్‌తో చెబితే పట్టించుకోలేదని ఆమె చెప్పింది. అంతేకాకుండా డాక్టర్ మార్చి నెలలో డ్యాన్స్ ఫెస్టివల్‌కు వెళ్లాడని.. కొద్ది రోజులకు ఆయనకు కరోనా లక్షణాలు వచ్చాయని పేర్కొంది. ఇదే సమయంలో పీపీఈ కిట్ల గురించి చెబితే.. డాక్టర్ కావాలని తనపై దగ్గాడని నర్సు ఆరోపిస్తోంది. ‘నాకు కరోనా ఉంటే నీకు కూడా కరోనా వస్తుంది’ అంటూ డాక్టర్ తనపై కావాలని దగ్గినట్టు నర్సు చెబుతోంది. 


ఇక డాక్టర్ తనపై దగ్గిన కొద్ది రోజులకే తాను, తన రెండేళ్ల కొడుకు కరోనా బారిన పడ్డామని నర్సు తెలిపింది. డాక్టర్ వల్ల తాము వారం రోజుల పాటు ఆసుపత్రిలో నరకం అనుభవించాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికి.. డాక్టర్ తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నర్సు కోర్టుకెక్కింది. ఇక ఆసుపత్రి యాజమాన్యం మాత్రం నర్సు ఆరోపణలను కొట్టిపడేసింది. తమ ఆసుపత్రిలో అవసరమైన పీపీఈ కిట్లు ఉన్నాయని వెల్లడించింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నర్సు ఆరోపించడం తగదని మండిపడింది.

Updated Date - 2020-10-26T04:19:42+05:30 IST