Florida లో షాకింగ్ ఘటన.. ఆత్మలు చెప్పాయంటూ.. యజమాని ఇంటికి నిప్పంటించాడు!

ABN , First Publish Date - 2022-07-01T21:02:27+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా (Florida)లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Florida లో షాకింగ్ ఘటన.. ఆత్మలు చెప్పాయంటూ.. యజమాని ఇంటికి నిప్పంటించాడు!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా (Florida)లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న తన యజమాని ఇంటికి నిప్పు పెట్టాడు. అదేంటని అడిగితే ఆత్మలు చెప్పాయి.. అందుకే చేశానంటూ తాపీగా చెప్పాడు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్ బర్గ్‌లో ఉండే తన్హా హా(54) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ వ్యాపారవేత్త వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. తన్హా యజమాని ఇటీవలే సెయింట్ పీటర్ బర్గ్‌లో ఓ కొత్త ఇంటి నిర్మాణం మొదలెట్టాడు. అక్కడే తన్హాను పనికి పెట్టాడు. ఆ ఇంటి నిర్మాణ పనులు చూసుకోవడం అతని పని. ఈ క్రమంలో మే 3వ తేదీన తన్హా ముఖానికి మాస్క్‌తో ఆ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా తాను వచ్చిన బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


కొద్దిసేపటి తర్వాత ఇంట్లోంచి ఒక్కసారిగా పెద్దగా మంటలు రావడం గమనించిన స్థానికులు యజమానికి ఫోన్ చేసి చెప్పారు. ఈ ఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మొదట స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. దీంతో తన్హా బండారం బయటపడింది. ఆ దృశ్యాల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. అయితే, అతడు అలా ఎందుకు చేశాడో చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. తనకు కలలో ఆత్మలు కనిపించి ఆ పని చేయమన్నాయని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు. కాగా, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. తన్హాకు గత కొంతకాలంగా యజమానితో పడటంలేదట. అందుకే అతనిపై కోపంతో ఇలా చేసినట్లు పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-07-01T21:02:27+05:30 IST