Florida ఆసుపత్రుల్లో సీన్ రిపీట్.. కరోనాతో ఒక్కో రోజు ఎంత మంది మరణిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2021-08-29T10:32:06+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కరోనాతో అల్లాడుతోంది. ఇక్కడ ప్రతిరోజూ విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో పరిస్థితి చేయిదాటిపోతోంది.

Florida ఆసుపత్రుల్లో సీన్ రిపీట్.. కరోనాతో ఒక్కో రోజు ఎంత మంది మరణిస్తున్నారంటే..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కరోనాతో అల్లాడుతోంది. ఇక్కడ ప్రతిరోజూ విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇక్కడి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కరువవుతోంది. ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక వైద్యులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కరోనా ఉగ్రరూపం చూసిన అమెరికన్లకు మళ్లీ ఆ రోజులు తిరిగిచ్చినట్లే అనిపిస్తోందట. ప్రస్తుతం ఫ్లోరిడాలోని చాలా ఆస్పత్రుల్లో రెండ్రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయని సమాచారం. అంటే ఈ రెండ్రోజుల్లో సాధ్యమైనంత ఆక్సిజన్ తెచ్చుకోవాలి. లేదంటే ఆ తర్వాత పేషెంట్లను కాపాడటంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఫ్లోరిడా ప్రాంతంలో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇక్కడ గడిచిన వారం రోజులుగా రోజుకు కనీసం 227 మంది కరోనా కారణంగా మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.


అమెరికా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా డెల్టా వేరియంట్ ఇక్కడ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రెండు నెలల క్రితంతో పోల్చుకుంటే ఇక్కడి కరోనా కేసుల్లో సుమారు 300శాతం ఎదుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు 1100పైగా పేషెంట్లు కరోనా కారణంగా కన్నుమూస్తున్నారు. ఫ్లోరిడాలోని 68 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతున్నాయి. ‘‘ఇంత మంది పరిస్థితి విషమంగా ఉండటం ఇప్పటి వరకూ చూడలేదు’’ అని జార్జియాలోని ఒక వైద్యుడు విస్మయం వ్యక్తం చేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరిడాలోనేకాక అర్కాన్సాస్, లూసియానా, హవాయి, మిస్సిసిపి, ఓరెగాన్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రులు కూడా రికార్డు స్థాయిలో పేషెంట్లు చేరినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం డాక్టర్లు, అధికారులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2021-08-29T10:32:06+05:30 IST