పామ్ బే: ఫ్లోరిడా రాష్ట్రం పామ్ బే ప్రాంతంలో ఓ మహిళా పోలీసు తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె ఉన్న సెల్ఫీ ఫ్రేములోనే ఓ మొసలి కూడా కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్టార్మ్ డ్రెయిన్(వరద నీటిని తరలించే మార్గం) నుంచి బయట పడలేక అక్కడే చిక్కుకుపోయిన ఆ మొసలిని ఆమె గుర్తించకపోవడంతో సెల్ఫీలో మొసలి కూడా పడింది. ఈ ఫొటోను అక్కడి పోలీసు శాఖ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా జత చేసింది.‘‘సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేస్తుంటే మొసలి వచ్చి ఇలా చిందరవందర చేసింది. కనీసం.. అది నవ్వుతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టిందని సరిపెట్టుకోవాలేమో’’ అంటూ అక్కడి అధికారులు ఓ ఫన్నీ కామెంట్ జత చేశారు. అయితే.. ఇలా స్టార్మ్ డ్రెయిన్లో చిక్కుకుపోయిన మొసలిని ఆ తరువాత..అధికారులు జంతువులు పట్టుకునే వ్యక్తి సాయంతో కాపాడారు.