సన్నద్ధత లేకనే వరద వినాశనం

ABN , First Publish Date - 2022-07-29T05:55:40+05:30 IST

తీవ్రవాయుగుండం ఏర్పడిందని, దాని ప్రభావంతో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని, వరదలు కూడా రావచ్చని వాతావరణ శాఖ నాలుగు రోజులు ముందే...

సన్నద్ధత లేకనే వరద వినాశనం

తీవ్రవాయుగుండం ఏర్పడిందని, దాని ప్రభావంతో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని, వరదలు కూడా రావచ్చని వాతావరణ శాఖ నాలుగు రోజులు ముందే హెచ్చరించినా ప్రభుత్వం వరదలకు సన్నద్ధం కాలేదు. గోదావరి వరద తీవ్రత గురించి కేంద్ర జల వనరుల శాఖ, విపత్తు నిర్వహణ శాఖలు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ముందే అప్రమత్తం చేశాయి. అయినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ తన భజన ప్లీనరీ నిమగ్నమైపోయారు. ఆ నిర్లక్ష్యం వల్లనే నేడు కోనసీమ కన్నీటిసీమగామారింది.


ఎన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చిన ప్రళయ గోదావరి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోను, లంక గ్రామాల్లోను విధ్వంసం సృష్టించింది. ప్రాణ నష్టం ఏమీలేకపోయినా లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. గోదావరి ఉప్పొంగి గ్రామాలకు గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. సర్వం కోల్పోయిన వరద బాధిత కుటుంబాల రోదనలు, వేదనలు మిన్నంటుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో అరటి, బొప్పాయి, పండ్ల తోటలు, తమలపాకు తోటలు, కూరగాయలు, వేల ఎకరాల్లో వేసిన వరినాట్లు, నారు మడులు, అనేక మెట్ట పంటలు నాశనం అయ్యాయి.


ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లంక గ్రామాలు, పోలవరం ముంపు మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పోలవరం ముంపు నిర్వాసితుల గోస వర్ణించలేనిది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చుట్టూ నీళ్లు ఉన్నా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని దుస్థితి. పాలు, మందులు, ఇతర నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం. పశువుల మేత దొరక్క మూగజీవాలు విలవిలలాడాయి. ఇప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గాల్లో రెండు గంటలు ఏరియల్‌ సర్వే చేసి మొక్కు తీర్చుకున్నారు. వరద తీవ్రతను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి ఉదారంగా సహాయం చేస్తారని, సాయానికి కేంద్రాన్ని కోరతారని వరద బాధితులు భావించారు. జగన్ ప్రభుత్వం సాయం చేయకపోగా, కేంద్రాన్ని నోరుతెరిచి సాయం కూడా అడగలేదు. కనీసం కేంద్రానికి నివేదిక సైతం పంపలేదు. జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా జరగలేదు.


విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అండగా నిలవాల్సిన పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరం. ప్రకృతి సృష్టించిన విలయానికి తామేం చేయగలమని రాష్ట్ర మంత్రి ఒకరు మాట్లాడి బాధ్యత నుండి తప్పించుకొన్నారు. పునరావాస కాలనీల్లో వ్యక్తి మరణిస్తే 41కి.మీ. తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారంటే ప్రజలు ఎంతటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. ప్రతిపక్షనేత చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించి వెళ్లారు కాబట్టి జగన్ పోటీగా వరద ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.10 వేలు ఇస్తుంటే, జగన్ ప్రభుత్వం రూ.2వేలు ఇచ్చి సరిపెడుతోంది. ఆ సాయం ఇంట్లో పేరుకున్న బురద కడుక్కోవడానికి కూడా సరిపోదు. నాడు హుద్‌ హుద్‌ తుఫాన్ సృష్టించిన విలయానికి విశాఖ నగరం వణికింది. సమస్త వ్యవస్థలు నేలమట్టం అయ్యాయి. తుఫాన్ తీరం దాటకముందే, వాతావరణం సహకరించకపోయినా, రహదారులు సరిగ్గా లేకపోయినా ‘నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉంటానా’ అంటూ చంద్రబాబు స్పందించి రాజమండ్రి మీదుగా తుఫాను మధ్యలోనే ప్రయాణించి తెల్లవారేసరికి విశాఖ వీధుల్లో జనం మధ్య నిలిచారు. విశాఖ కలెక్టరేటులో రాత్రి బస్సులోనే బస చేసి తెల్లవారుజామున 4గంటల నుంచి అర్ధరాత్రి వరకు పది రోజులు పాటు ఒక యంత్రంలా శ్రమించారు. కకావికలమైన విశాఖను అనూహ్యవేగంతో నిలదొక్కుకునేలా చేశారు.


తిత్లీ రూపంలో మరో అతిపెద్ద సవాలు ఎదురై ఆ తుఫాను సృష్టించిన విలయానికి శ్రీకా కుళం జిల్లా అతలాకుతలమైంది. విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లక్షలాది కొబ్బరి చెట్లు, అరటి, జీడి మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. దాదాపు 36 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. ఆ తుఫాను తీరం దాటకముందే శ్రీకాకుళంలో వాలిపోయారు చంద్రబాబు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, రాత్రింబవళ్ళు పనిచేసి, ఆస్తి నష్టాన్ని ప్రాణనష్టాన్ని నివారించారు. ప్రజల్లో భరోసా నింపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు అధికారులను పంపవచ్చు, హెలికాప్టరు ద్వారా ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోవచ్చు, నష్టం అంచనా వేసి సాయం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. కానీ మోకాలి లోతు వరద నీళ్ళల్లో ప్రజల వద్దకు వెళ్లి ‘అధైర్యపడకండి’ అని భరోసా ఇచ్చారు చంద్రబాబు. నేటి ప్రభుత్వం తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క వరద బాధితులు సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేస్తుంటే, మరోపక్క నేటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో ‘గడపగడప’ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేస్తున్నారు.


ఏది ఏమైనా గోదావరి పరివాహక ప్రాంతాల వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయాన్ని రూ.2 వేల నుంచి రూ.10వేలకు పెంచాల్సిన అవసరం ఉంది. బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు, పాలు, తాగునీరు, కూరగాయలు, వంటగ్యాస్‌, వైద్యం అందించాలి. వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్న పలు కుటుంబాల్లో ఉన్న పశువులకు రెండు నెలలకు సరిపడే ఎండు గడ్డి, దాణా సరఫరా చెయ్యాలి. మునిగిన పంటలకు రూ.50వేల నుంచి లక్ష దాకా పరిహారం చెల్లించాలి. గోదావరి పరీవాహక ప్రాంతమంతా కన్నీటి మడుగులో ఈదులాడుతున్నది. ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుకుతున్నది. హృదయం లేని ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తాయి. కష్ట కాలంలో కనిపెట్టుకొనేవారే నిజమైన నాయకుడు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి వర్యులు

Updated Date - 2022-07-29T05:55:40+05:30 IST