వదల్లేదు

ABN , First Publish Date - 2020-10-16T12:24:53+05:30 IST

తమ్మిలేరు శాంతించింది..యనమదుర్రు భీమవరాన్ని ముంచెత్తింది. ఎర్రకాలువ నిడదవోలు..

వదల్లేదు

నిడదవోలు,గూడెం, భీమవరానికి వరద ముప్పు

యనమదుర్రు ఉగ్రరూపం

నివాస గృహాల్లోకి వరద నీరు

రోడ్లపైనే అర్ధరాత్రి వరకు పాట్లు

30 ఏళ్ల తరువాత నిడదవోలు పట్టణంలోకి వరద

నవరాత్రులకు ముందు కోటసత్తెమ్మ, 

నత్తా రామలింగేశ్వర ఆలయాలు మునక

వేల ఎకరాల్లో పంట నీట ముంపు

సహాయక శిబిరాల్లో వందలాది మంది


ఏలూరు(ఆంధ్రజ్యోతి): తమ్మిలేరు శాంతించింది..యనమదుర్రు భీమవరాన్ని ముంచెత్తింది. ఎర్రకాలువ నిడదవోలు, తాడేపల్లిగూడెంలను చుట్టుముట్టింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది నివాస గృహాల్లోకి వరద నీరు చేరింది. వేల ఎకరాల పంట సర్వనాశనం అయ్యింది.  రైతులకు కన్నీటిని మిగిల్చింది. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు, ఆర్టీసీ డిపోలు సైతం నీట ముని గాయి. తమ్మిలేరు వరద నుంచి ఏలూరు కోలుకుంటుండగా భీమవరం జలదిగ్బంధంలోనే ఉంది. నవరాత్రులు ఆరంభమయ్యే వేళ కోటసత్తెమ్మ ఆలయం, నత్తా రామేశ్వరం లోని శివాలయాలు వరద నీట చిక్కాయి. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వరద తాకిడికి దాదాపు ఐదు వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 


భీమవరంపై యనమదుర్రు పడగ

భీమవరాన్ని యనమదుర్రు ముంచెత్తింది. వందలాది నివాసాల్లోకి వరదనీరు చేరింది. కొన్నిచోట్ల 5 అడుగుల మేర నీరు పారుతోంది. మరికొన్ని చోట్ల పిల్లా, పాపలతో సహా పరివాహక ప్రజలు రోడ్లపైకి చేరారు. ఒక్కసారిగా వరద పెరిగి గురువారం నాటికి మరింత ఉధృతమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే లోపే యనమదుర్రు గట్లను తాకి ప్రవహిస్తూ ప్రమాదస్థాయికి చేరింది. యనమదుర్రులో గురువారం సాయంత్రం 23,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నందమూరి అక్విడెక్టు వద్ద 39 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నట్టు డ్రైనేజీ శాఖ ప్రకటించింది. దీంతో భీమవరం పట్టణంలోని దాదాపు 850కుపైగా నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో ఆయా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మెంటేవారి తోట, దుర్గాపురం, లంకపేట, కాలవగట్టు రోడ్డు, గరగపాడు రోడ్డు పూర్తిగా నీటమునిగింది. నడుము లోతు నీళ్లల్లోనే స్ధానికులు రోజంతా గడిపారు. వరద పరిస్థితిని సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షించారు.


సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. భీమవరం రూరల్‌ ప్రాంతంలోని నాయుడు పాలెం, కొత్తపూసలమర్రు, కోతదిబ్బ, అనాకోడేరు, ఎల్‌వీఎన్‌ పురం, వంటి గ్రామాల్లో నీరు చేరగా అక్కడివారికి మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. రాత్రి పొద్దిపోయేంత వరకు వందలాది మంది బాధితులు కొన్ని చోట్ల మెరక ప్రాంతాల్లోను మరికొంత మంది రోడ్లపై జాగారం చేస్తున్నారు. అలాగే గణపవరం మండలం కేశవరం, కోమర్రు, పిప్పర, వంటి ప్రాంతాల్లో యనమదుర్రు వరద చేరింది. పిప్పరలో సబ్‌స్టేషన్‌లోకి రెండున్నర అడుగుల నీరు చేరింది. పంట పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఆక్వా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భీమవరం, గణపవరం ప్రాంతాల్లో యనమదుర్రు కాలువ గట్ల వెంబడి రైతులు గండి పడకుండా పహారా కాస్తున్నారు.యనమదుర్రు డ్రైన్‌ గట్లను ఇంతకు ముందే పటిష్టం చేయడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎత్తు పెంచిన కారణంగా కొంతలో కొంత ముంపు పరిధి తగ్గింది. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం వైపు గోస్తనీ నది నుంచి వరద చేరింది.పుణ్యక్షేత్రమైన శివాలయాన్ని ముంచెత్తింది.  


ఎర్రకాల్వ విజృంభణ

మూడు రోజులుగా ఎర్రకాలువ విజృంభిస్తూనే ఉంది. వేలాది ఎకరాలను ముంచెత్తుతూనే ఉంది. తాజాగా 1986 తరువాత తొలి సారిగా ఎర్రకాలువ పోటెత్తి నిడదవోలును ముంచెత్తింది.  ఇప్పటికే 9 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిడదవోలు రూరల్‌ మండలంలో 5 గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం రాత్రి ఇళ్లకే పరిమితం అయిన వారికి ఆహార పొట్లాలను అందిం చారు. కంసాలిపాలెం నుంచి తాళ్లపాలెం వరకు వరద నీరు పూర్తిగా ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే ముందస్తు చర్యలకు యంత్రాంగం సంసిద్ధంగా ఉంది.


మరో వైపు తాడేపల్లిగూడెం రూరల్‌ మండలాన్ని ఎర్రకాలువ కకావికలం చేస్తున్నది. వేల ఎకరాలను ముంచెత్తింది. మారంపల్లి, మాధవరం, నందమూరు, జగన్నాఽథపురం, వీరంపాలెం వద్ద గ్రామాల్లో వందలాది ఎకరాలు పూర్తిగా నీటమునిగాయి. అప్పా రావుపేట-కోరుమామిడి, మాధవరం- కంసాలిపాలెం, మాధవరం- జగన్నాథపురం, పోనాల-ఆరుళ్లలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాధవరం, జగన్నాథపురానికి చెందిన 1500 మందిని సహాయక శిబిరాలకు చేర్చారు. 


యుద్ధప్రాతిపదికన పనులు: మంత్రి నాని

ఏలూరు: వరద నీరు తగ్గుముఖం పట్ట గానే జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్యం, మురుగునీరు పారుదల, మెడికల్‌ క్యాంపులు నిర్వహణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. అంటువ్యాధులు ప్రబలకుండా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహి ంచాలని ఆదేశించారు. శనివారపుపేట కాజ్‌వే, శ్రీపర్రు కాజ్‌వే వద్ద ప్లై ఓవర్‌  బ్రిడ్జిలు నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసు కోవాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-10-16T12:24:53+05:30 IST