ఆలమట్టికి వరద

ABN , First Publish Date - 2020-06-20T09:02:58+05:30 IST

కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టుకు వరద మొదలైంది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 48వేల క్యూసెక్కుల ..

ఆలమట్టికి వరద

ప్రస్తుతం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం

ఈ సీజన్‌లో వచ్చింది 18 టీఎంసీలకుపైనే

ఇటు గోదావరిలోనూ పెరుగుతున్న వరద

ఆలమట్టికి వరద


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టుకు వరద మొదలైంది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 48వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అంటే... రోజుకు 4 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఆలమట్టి ప్రాజెక్టు పూర్తి సా మర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజన్‌లో కొత్తగా 18 టీఎంసీల నీరు వచ్చింది. అంటే.. ఈ ప్రాజెక్టు నిండడానికి ఇంకా 86 టీఎంసీల నీరు అవసరం ఉంది. అయితే, ఈ ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని ఎప్పడికప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఫలితంగా ప్రతి సారి దిగువకు నీటి విడుదల చాలా ఆలస్యమవుతోంది. అక్కడ నీటిని విడుదల చేసినా.. దిగువన నారాయణపూర్‌ నిండిన తర్వాతే తెలంగాణలోని ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. ప్రస్తుతం నారాయణపూర్‌కు చెప్పుకోదగ్గ ప్రవాహం రావడం లేదు.


దాంతో రాష్ట్రంలోకి వరద రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వేళ ఎగువన కృష్ణాలో రోజుకు రెండు లక్షల క్యూసెక్కుల వరద నమోదైతే.. త్వరగా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. ఈ సీజన్‌ ఆశాజనకంగానే కనిపిస్తోందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, గోదావరి బేసిన్‌లోనూ వరద క్రమేణా పెరుగుతోంది. ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహం లేనప్పటికీ, దిగువన మేడిగడ్డ వద్ద శుక్రవారం 25వేల క్యూసెక్కుల వరద నమోదైంది. అయితే, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

Updated Date - 2020-06-20T09:02:58+05:30 IST