కెంటకీలో భారీ వర్షాలు.. 15 మంది మృతి..

ABN , First Publish Date - 2022-07-30T04:53:49+05:30 IST

తూర్పు కెంటకీలోని(Kentucky) ఇటీవల కురిసిన కుండపోత వర్షాల(Torrential rains) కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి.

కెంటకీలో భారీ వర్షాలు.. 15 మంది మృతి..

ఎన్నారై డెస్క్: తూర్పు కెంటకీలోని(Kentucky) కురుస్తున్న ఎడతెగని వర్షాల(Torrential rains) కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ వరదల(Floods) కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. కాగా.. వరదల్లో చిక్కుకుని కనీసం 15 మంది మృతి చెందగా.. మరెంతో మంది గల్లంతయ్యారని రాష్ట్ర గవర్నర్ యాండీ బేషీర్ శుక్రవారం ప్రకటించారు. మొత్తం మృతుల సంఖ్య ఇంతకు రెండింతలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. వరదల్లో ఎంతమంది గల్లంతయ్యారనే వివరాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు.


వరద తాకిడికి అనేక భవనాల కూలిపోయాయి. రహదారులు, వంతెనలపై నీరు చేరింది. ప్రకృతి ప్రతాపానికి ఆ ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. 23 వేల ఇళ్లకు కరెంటు సరఫరా లేదని గవర్నర్ తెలిపారు. మరో రోజు పాటు వరద ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వరదల్లో చిక్కుకున్న అనేక మందిని  ప్రభుత్వ అత్యవసర సిబ్బంది  బోట్లు, హెలికాఫ్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Updated Date - 2022-07-30T04:53:49+05:30 IST