ఉధృతంగా తమ్మిలేరు..

ABN , First Publish Date - 2022-08-09T06:20:13+05:30 IST

తమ్మిలేరు ప్రాజెక్టుకు సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి బాగా పెరిగింది.

ఉధృతంగా తమ్మిలేరు..
చిన్నంపేట కాజ్‌వే వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వరద

చాట్రాయి, ఆగస్టు 8: తమ్మిలేరు ప్రాజెక్టుకు సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి బాగా పెరిగింది. తెలంగాణలో భారీ వర్షాలు కురవటం వల్ల బేతుపల్లి జలాశయం అలుగు పడి  భారీగా వరద తమ్మిలేరులోకి చేరుతున్నది. సోమవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు నీటి మట్టం 334 అడుగులకు చేరుకున్నదని ప్రాజెక్టు ఏఈఈ ప్రఫుల్ల తెలిపారు. పరివాహక ప్రాంతంలో సరైన వర్షాలు లేక తమ్మిలేరు ప్రాజెక్టులోకి నీరు చేరుకోలేదు. ఇప్పుడు భారీగా వరద వస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు కింద ఏలూరు జిల్లా పరిధిలో 25 వేల ఎకరాల సాగుభూమి ఉంది. 


తాత్కాలిక రహదారికి గండి

ముసునూరు: భారీ వర్షాలకు తమ్మిలేరులో వరద ఉధృతి సోమవారం పెరిగింది. విజయరాయి వైపు వెళ్ళేందుకు బలివే తమ్మిలేరులో వేసిన తాత్కాలిక రహదారికి పెద్ద గండి పడి ఇనుప తూరలు సైతం కొట్టుకు పోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ తాత్కాలిక రహదారికి కొద్దిగా గండి పడగా, ప్రస్తుతం తమ్మిలేరులో వరద ఉధృతికి రహదారి కోతకు గురై పెద్ద గండిగా మారింది. తమ్మిలేరు పరీవాహక గ్రామాల ప్రజలను అధికా రులు అప్రమత్తం చేశారు. బలివే వద్ద రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. తమ్మిలేరులో వరద ఉధృతి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ఈతకు, చేపలు వేటకు వెళ్ళవద్దని కోరారు. కాగా వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి.  పంటలకు ఈ వర్షాలు ఉపయుక్తంగా ఉంటాయని రైతులు అంటున్నారు. 


గోతుల్లో నీరు నిలిచి ప్రజల పాట్లు

కైకలూరు: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు రహ దారులు జల మయమయ్యాయి. రహదా ర్లపై గోతులు వర్షపునీటితో నిండి పోవడంతో వాహన దార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఆ గోతుల్లో పడి అనేకమంది గాయాల పాలవు తున్నారు. వరహాప ట్నం–శీతనపలి ఆర్‌ అండ్‌ బీ రహదారిలో ఈ దుస్థితి నెల కొంది. నిత్యం ఈ రహదారి గుండా శీతనపల్లి పీహెచ్‌సీకి  రోగులు, గర్భిణులు, బాలిం తలు వాహనదారులు ఈ రహదారిగుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో వీధిలైట్లు కూడా లేకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. 

కలిదిండి: భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగటంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.  పేట కలిదిండికి వెళ్లే రహదారి నీట మునిగి చిత్తడిగా మారింది. ఇందిరా కాలనీలో అంతర్గత రహదారులు జలమయమ య్యాయి. కలిదిండి ప్రధాన రహదారికిరువైపులా నీరు నిలిచి  బురదకయ్యగా మారింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో జనం ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. రోడ్డు పక్కన చిరువ్యాపారుల దుకాణాలు వెలవెలబోయాయి. 

Updated Date - 2022-08-09T06:20:13+05:30 IST