రహదారులే కాలువలు..!

ABN , First Publish Date - 2020-10-16T12:27:43+05:30 IST

చినకాపవరం డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవ హించడంతో గుమ్ములూరు, నక్కల కాలువలు వద్ద పెదకాపవరం-ఆకివీడు రహదారి నీట

రహదారులే కాలువలు..!

పొంగిన డ్రెయిన్లు గట్లను తాకుతున్న ప్రవాహం 

చేలల్లోకి వరద నీరు 

రాకపోకలు బంద్‌


ఆకివీడు రూరల్‌, అక్టోబరు 15: చినకాపవరం డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవ హించడంతో గుమ్ములూరు, నక్కల కాలువలు వద్ద పెదకాపవరం-ఆకివీడు రహదారి నీట మునిగింది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుం డడం తో ముంపు మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ముంపు నుంచి చేలను కాపాడుకునేందుకు రైతులు పోరాటం చేస్తున్నారు. కళింగపాలెం, సిద్ధాపురం గ్రామాలలో రైతులు మట్టి బస్తాలు వేసి, ఎక్స్‌కవేటర్‌తో గట్టు పటిష్టం చేస్తున్నారు. రెండుసార్లు నారుమడుల దశలో నష్టపోయిన రైతులు, పొట్ట, ఈనిక దశలో పంట కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు.


ఆకివీడు: మురుగుకాల్వలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి తోడు ఎగువ నుంచి వరద నీరుతో చినకాపవరం, అయిశా మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. పట్టణంలోని సుందరయ్య కాలనీ, సమతానగర్‌ రహదారి, సిద్ధాపురం రోడ్‌ నీట మునిగాయి. బుధవారం రాత్రి నుంచి ఆకివీడు నుంచి సిద్ధాపురం వైపు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సుందరయ్య కాలనీ ప్రజలకు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు.


పాలకోడేరు: యనమదుర్రు, గోస్తనీనది డ్రెయిన్‌లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గట్లకు ఆనుకుని ప్రవహించడంతో ఆయా ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాలకోడేరు వద్ద గోస్తనీ గట్లకు చేరిఉన్న ఇళ్లు మునిగాయి. మోగల్లు వద్ద విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరదనీటిలో ఉంది. మండలంలో 250 హెక్టార్లలో వరి చేలు నీటమునిగాయి. మోగల్లులో భారీ వృక్షం, శృంగవృక్షంలో మట్టి ఇల్లు కూలిపోయాయి.


కాళ్ళ : వర్షాలు, వరదతో శివారు గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. వరి చేలు, పాఠశాల భవనాలతో సహా నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇస్కులంక, ఎస్సీ బోస్‌ కాలనీ 1, 3 గ్రామాల్లో బురద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి బాధితులకు ధైర్యం చెప్పారు.


ఆచంట : భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరి చేలు నేలనంటాయి. ఆచంట, పోడూరు మండలాల్లో వరి చేలు చెరువులను తలపిస్తున్నాయి డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో నష్టం తప్పదని రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఏ.వేమవరం వద్ద నక్కల డ్రెయిన్‌ ఉధృతితో చేలు మునిగాయి.

నరసాపురం రూరల్‌ : వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ప్రభు త్వం తక్షణం అదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు డిమాండ్‌ చేశారు. ఎల్‌బిచర్లలో నీట మునిగిన చేలు, కుళ్లిన వరిని ఆయన పరిశీలించారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు పంటలను కోల్పోయిన రైతులు మళ్లీ సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఎరువులు, పురుగుల మందుల్ని రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు.


పాలకొల్లు రూరల్‌: పంట నష్టం వెంటనే లెక్క వేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  మండ లంలో నీట మునిగిన వరి చేలను వ్యవసాయాధికారులతో కలసి గురువారం ఆయన పరిశీలించారు. ప్రకృతి కన్నెర్రతో రైతులు కుదేలవుతున్నారని, వారికి సత్వరం నష్టపరిహారం అందాలన్నారు.


వీరవాసరం : మండలంలో చేలు మూడు రోజులుగా ముంపులోనే ఉన్నాయి.  డ్రెయిన్లు తూడుతో నిండిపోయి నీరు లాగే పరిస్థితి లేదు. వీరవాసరం పశ్చిమ కాలువ వెంబడి, మత్స్యపురి ఆయకట్టు ముంపులో ఉంది. ప్రస్తుతం చేలు పొట్ట, ఈనిక, గింజ దశల్లో ఉన్నాయి. ముంపు కారణంగా దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


ముంపు చేలలో సస్యరక్షణ ఇలా..

ముంపు తగ్గిన తరువాత వరి చేలలో పొటాష్‌ వేసుకోవాలని ఉండి కేవీకే శాస్త్రవేత్త కృష్ణాజీ తెలిపారు. కుప్పనపూడి, చెరుకుమిల్లి గ్రామాలలో చేలను ఆయన పరిశీలించారు. పొట్ట, ఈనిక దశలో ఉన్న చేలు ముంపును 6 రోజులు మాత్రమే తట్టుకుంటాయని, తరువాత కుళ్లిపోతాయన్నారు. కుప్పనపూడిలో 300 ఎకరాలు నీట మునిగిందని రైతు సలహా మండలి చైర్మన్‌ నంద్యాల సీతా రామయ్య తెలిపారు. మండలంలో 6791 ఎకరాలకు 4138 ఎకరాలలో వరి నీట మునిగిందని ఏవో ప్రియాంక తెలిపారు.


ముంచిన యనమదుర్రు

భీమవరం / టౌన్‌ / రూరల్‌, అక్టోబరు 15 : యనమదర్రు డ్రెయిన్‌ ఉగ్రరూపం దాల్చింది. పల్లపు ప్రాంతాలు గురువారం నీట మునిగాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు వరద ముప్పు తలెత్తింది. భీమవరం పట్టణం మధ్య నుంచి డ్రెయిన్‌ ప్రవహించడంతో రెండు వైపులా ఇళ్లు నీట మునిగాయి. ఐదు ప్రాంతాలలో వెయ్యి మందిని సహాయ శిబిరాలకు తరలించారు. మెంటే వారితోటలో మిరామియా కోడు నీరు వెనక్కి రావడంతో అరుంధతిపేట, శ్మశానవాటికతో పాటు ఎగువ ప్రాం తాలకు వరద నీరు ప్రవహిస్తోంది. వన్‌టౌన్‌ సీఐ కృష్ణ భగవాన్‌, సిబ్బంది, స్ధానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 20, 21, 26, 28 వార్డులలో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రి, రెండో పట్టణ ప్రాంతంలో 29, 30, 31, 37 వార్డులలో నీరు ఎగదన్నుతోంది. లంక పేట, దుర్గాపురంలో 200 ఇళ్ళకు పైగా నీటిలో మునిగిపోయాయి. యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప గ్రామాల వద్ద అధికారులు, రైతులు అప్రమత్తమయ్యారు. గట్టు వెంబడి ఇసుక బస్తాలు వేసి గండి పడకుండా ప్రయత్నాలు చేపట్టారు. గొల్లవానితిప్ప, దిరుసుమర్రు, గూట్లపాడు తీరప్రాంత గ్రామాలలో రహదారులపై కొన్ని అడుగు నీరు ప్రవహిస్తోంది.


ముంపు ప్రాంతాలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

పట్టణంలో ముంపు ప్రాంతాలను సబ్‌ కలెక్టర్‌ విశ్వనాఽథన్‌ అధికారులతో కలసి పరిశీలించారు. మిరామియా కోడువద్ద ఆయిల్‌ ఇంజన్‌లను పెట్టినీటిని తోడుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. మునిసిపల్‌ కమిషనర్‌ శ్యామల కూడా నీటిని తోడుతున్న పారంతాలను పరిశీలించారు.


పునరావాస కేంద్రాలకు తరలింపు

మండలం, పట్టణంలోని ముంపు ప్రాంతాల నుంచి 800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తహసీల్దార్‌ రమణారావు తెలిపారు. పట్టణంలోని 1,2, 38, 26 వార్డుల్లోని ప్రజలకు అక్కడి పాఠశాలల్లో పునరావసం కల్పించామని తెలిపారు. మండలంలోని నాగిడిపాలెం, కొత్త పూసలమూరు తోక తిప్ప, అనాకోడేరు, ఎల్‌విఎన్‌పురం గ్రామల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ముంపు సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2020-10-16T12:27:43+05:30 IST