Abn logo
Oct 2 2020 @ 02:38AM

సాగర్‌కు పోటెత్తిన వరద

2,07,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

20 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో నాగార్జునసాగర్‌కు ప్రవాహం పోటెత్తుతోంది. గురువారం సాగర్‌కు 2,07,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,69,449 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఏడు గేట్లను ఎత్తి 2,07,757 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.


మరోవైపు, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,57,542 క్యూసెక్కుల నీరు వస్తుండగా; అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టుకు 87,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా ఏడు గేట్ల ద్వారా 48,860 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు.


నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌లకు నీటి విడుదలను నిలిపివేశారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరామసాగర్‌లోకి 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం 90టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement
Advertisement
Advertisement