ప్రమాదకరంగా కరకట్ట
ఏక్షణానైనా తెగే అవకాశం
పునరావాస కేంద్రాలకు వేలాది కుటుంబాల తరలింపు
నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు 27 : పెన్నా నదిని ఆనుకుని ఉన్న వెంకటేశ్వరపురం పరిధిలోని భగత్‌సింగ్‌కాలనీ, జనార్దనరెడ్డికాలనీ, వారధి సెంటర్, సాలుచింతలు ప్రాంతాల్లోకి పెన్నా నీరు చేరింది. నల్లకాలువలో భారీగా నీరు ప్రవహిస్తుండటంతో జనార్దనరెడ్డికాలనీ, వెంకటేశ్వరపురం మధ్య సంబంధాలు తెగిపోయాయి. వందలాది నివాసాలు నీటి మునిగాయి. అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి దాదాపు వెయ్యి కుటుంబాల వారిని నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ కరకట్టను పనుల నిమిత్తం కొంతమేర తీసినట్లు తెలిసింది. అయితే ఒక్కసారిగా పెన్నా ప్రవాహం పెరగడంతో వారధి ప్రాంతంలో కరకట్ట పూర్తిగా తెగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమై చుట్టు పక్కల నివసించే వందలాది కుటుంబాల వారిని సమీపంలోని ఐటీఐ కళాశాలకు తరలించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంచేందుకు వైసీపీ ప్రభుత్వం వేసిన జగనన్న వెంచర్లు పెన్నానదిలో కలిసిపోయాయి. ఆర్డీవో, నగర కమిషనర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు జనార్దన్‌రెడ్డి కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రికి పెన్నానదికి వరద ఉధృతి మరింత పెరగవచ్చన్న అధికారుల హెచ్చరికలతో పరిసర ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు బాకికేడ్లు ఏర్పాటు చేశారు.