తుంగభద్రకు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-08-11T04:57:27+05:30 IST

తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. డ్యాం నుంచి 30 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో బుధవారం మధ్యాహ్నం కౌతాళం మండల పరిధిలోని మెలిగనూరులో రామలింగేశ్వరస్వామి దేవాలయం సమీపం వరకు వరద నీరు పరవళ్లు తొక్కుతోంది.

తుంగభద్రకు పోటెత్తిన వరద
ఆర్డీఎస్‌ ఆనకట్టపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

  1. నీట మునిగిన 600 ఎకరాల పంట పొలాలు 
  2. వల్లూరులో నీట మునిగిన వాటర్‌ స్కీం మోటార్లు  
  3. కోసిగి, కౌతాళం మండలాల్లో తీవ్ర నష్టం 

కోసిగి (కౌతాళం) ఆగస్టు 10: తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. డ్యాం నుంచి 30 గేట్ల ద్వారా 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో బుధవారం మధ్యాహ్నం కౌతాళం మండల పరిధిలోని మెలిగనూరులో రామలింగేశ్వరస్వామి దేవాలయం సమీపం వరకు వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. అలాగే వల్లూరు, గుడికంబాలి, మరళి, తదితర గ్రామాల్లో వరద నీటికి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వల్లూరులోనే సుమారు 400 ఎకరాలకు పైగా వరి పైరు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. గంగాదేవి ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వల్లూరులో పది గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీటి వాటర్‌ స్కీం మోటార్లు నీటిలో మునిగిపోవడంతో ఆ గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరళి, మెలిగనూరు, గుడికంబాలి గ్రామాల్లో సైతం వరద నీటికి పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. అలాగే కోసిగి మండల పరిధిలోని కడిదొడ్డి గ్రామంలో వరద నీటికి పంట పొలాలు నీటమునిగాయి. ఓ ట్రాక్టర్‌ వరద నీటిలో చిక్కుకోవడంతో రైతులు ట్రాక్టర్‌ ఇంజినను మాత్రమే బయటకు తీసి, ట్రాలీని అక్కడే వదిలేశారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు రైతులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే సాతనూరు గ్రామంలో రైతులు వేసుకున్న మోటార్లు, గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటి మోటార్లు సైతం మునిగాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రుద్రగౌడు, ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్‌, సీఐ ఎరిషావలి, ఎస్‌ఐ రాజారెడ్డిలు గ్రామ సర్పంచులతో కలిసి అధికారులు దండోరా వేయించారు. ఆర్డీఎస్‌ ఆనకట్ట మీద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆనకట్ట వైపు మత్స్యకారులు, రైతులు ఎవరూ కూడా వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాత్రివేళల్లో గ్రామాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-08-11T04:57:27+05:30 IST