ముంచెత్తిన డ్రెయిన్లు

ABN , First Publish Date - 2021-09-29T05:45:12+05:30 IST

వర్షం తగ్గినా వరద ఉధృతి తగ్గలేదు. పంట కాల్వలు, మురుగు డ్రెయిన్‌లు పొంగిపొర్లుతున్నాయి.

ముంచెత్తిన డ్రెయిన్లు
ఉంగుటూరు మండలంలో తాడిపూడి కాల్వకు పడిన గండి

 పొంగిన యనమదుర్రు డ్రెయిన్‌

 మునిగిన ఎస్‌.కొందేపాడు వంతెన

 రాకపోకలు బంద్‌  


వర్షం తగ్గినా వరద ఉధృతి తగ్గలేదు. పంట కాల్వలు, మురుగు డ్రెయిన్‌లు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాలు వరద నీటిలో మునిగిపోయాయి.  పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, చెత్త నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. రోడ్లపై నీరు చెరువులను తలపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పంటల నష్టాలను అంచనా వేస్తున్నారు. 


గణపవరం, సెప్టెంబరు 28: యనమదుర్రు డ్రెయిన్‌ పొంగి ప్రవహించ డంతో మండలంలోని ఎస్‌.కొందేపాడు వంతెన వరదలో మునిగిపోయి రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల ఎర్ర కాల్వ వరదనీరు యనమదుర్రు డ్రెయిన్‌ను ముంచెత్తింది. పిప్పర వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా ఉందని, మరింత పెరిగే అవకాశాలున్నాయని డ్రెయిన్‌ పరీ వాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోలెవల్‌ వంతెన నీటి ముంపునకు గురైంది. దీనికితోడు యనమదుర్రు వరదల్లో కొట్టుకొచ్చిన గుర్రపు డెక్క ఎస్‌.కొందేపాడు వంతెనను తాకింది. దీంతో ప్రవాహం ఆగి డ్రెయిన్‌ నీటి ప్రవాహం పెరిగి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గ్రామ సర్పంచ్‌ సీతాళం వీరలక్ష్మి, ఉపసర్పంచ్‌ సీతాళం పుల్లయ్యనాయుడు, గ్రామ కార్యదర్శి ఎం.రత్నాకరరావు, వీఆర్వో జానకి రాముడు ఆధ్వర్యంలో జేసీబీతో గుర్రపు డెక్కను యుద్ధప్రతిపాదికన తొలగించారు. మధ్యాహ్నం  లోలెవల్‌ వంతెన పూర్తిగా వరదనీటిలో మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. డ్రెయిన్‌కు అటువైపు అత్తిలి, తణుకు ఇటువైపు యండగండి, భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరంకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇలా ఉండగా యనమదుర్రు డ్రెయిన్‌ ఉధృతికి పరీవాహక గ్రామాల్లో వెయ్యి ఎకరాలు వరి చేలు నీటి ముంపునకు గురయ్యాయని తహసీల్దార్‌ బొడ్డు శ్రీనివాస్‌రావు, ఏవో వైవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

అత్తిలి:  భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల  వరదనీరు  యనమదుర్రు డ్రెయిన్‌కు భారీగా చేరడంతో అత్తిలి మండలంలో పొలాలు ముంపునకు గుర య్యాయి. స్లూయిజ్‌ గేట్లు పని చేయకపోవడంతో అత్తిలి మండల పరిధిలో తిరుపతిపురం, వరిగేడు, బల్లిపాడు ఆయకట్టు ప్రాంతం ముంపు బారిన పడింది. నీట మునగిన పంట చేలను మంగళవారం ఎంపీపీ సూర్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు  సత్యనారాయణ, మహ్మద్‌ హబీబుద్దీన్‌, తహసీల్దార్‌ రామాంజనేయులు, ఎంపీడీవో వీరాస్వామి, మండల వ్యవసాయాధికారి  గంగాధర్‌ పరిశీలించారు. 

తాడిపూడి కాల్వకు గండి

ఉంగుటూరు,సెప్టెంబరు 28 మండలంలోని తాడిపూడి కాల్వకు గండ్లు పడడంతో వరి,ఉద్యానవన పంటలు మునిగి పోయాయి. మండలంలో 1272 ఎకరాలలో వరి, మినుము, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయాఽధికారి వెంకటేష్‌ తెలిపారు. 


 ఎర్రకాల్వ ఉగ్రరూపం


నిడదవోలు, సెప్టెంబరు 28: ఎర్రకాల్వ ఉగ్రరూపం దాల్చడంతో నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. మరోపక్క నిడద వోలు మండలం కంసాలిపాలెం నుంచి తాడేపల్లిగూడెం మండలం మాధవరం మధ్య  ఎర్రకాల్వ వరద నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతం వద్ద పోలీసులు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా పహారా కాస్తున్నారు. నిడదవోలు మండలంలోని పదమూడు గ్రామాల్లో ఎర్రకాల్వ వరద కారణంగా 4000 ఎకరాల వరి, 200 ఎకరాలకు పైగా అరటి సుమారు 100 ఎకరాలకు పైగా దొండ, బెండ వంటి కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు ఎర్రకాల్వ వరదపై అధికారులతో సమీక్షిస్తున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: తాడేపల్లిగూడెం మండలంలో 4500 ఎకరాల్లో వరిచేలు నీటిలో నానుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు కొంగువారిగూడెం నీటి ప్రవాహం, బైనేరువాగు, పులివాగు నుంచి నీరు భారీగా ఎర్రకాల్వలోకి వచ్చి చేరుతుండడంతో నీటి ఉధృతి పెరుగుతోంది. దీంతో  మాధవరం, పట్టింపాలెం., అప్పారావుపేట, జగన్నాఽథపురం మారంపల్లి గ్రామాల్లో 4500 ఎకరాలు వరి నీటిలో మునిగిందని ఏవో ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.  మారంపల్లిలో రైల్వే ట్రాక్‌ వద్దకు వరద నీరు చేరింది. నందమూరు అక్విడెక్టు వద్ద నీటిమట్టం 33.50 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు చేలవైపు  కదులుతోంది. నందమూరు, మారంపల్లి గ్రామాల్లో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తహసీల్దార్‌ అప్పారావు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు కార్యదర్శులకు సూచించారు. 

ఉధృతంగా  వయ్యేరు  

తణుకు, సెప్టెంబరు 28: దువ్వ వద్ద ఉన్న వయ్యేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.  ఇప్పటికే రెవెన్యూ అధికారులు కాలువ గట్టుపై పాకలు వేసుకుని నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.    




Updated Date - 2021-09-29T05:45:12+05:30 IST