లంకల్లోకి వరద నీరు

ABN , First Publish Date - 2022-08-13T06:10:45+05:30 IST

శ్రావణ పౌర్ణమి కావడంతో సముద్రం ఉప్పొంగడం వల్ల గోదావరి నదీ ప్రవాహం మరింత పోటెత్తింది. దాంతో సమీపంలోని లంక గ్రామాల్లోని కాజ్‌వేలు, నివాస గృహాలకు సైతం వరదనీరు ముంచెత్తింది.

లంకల్లోకి వరద నీరు
ముమ్మిడివరం మండలం కూనాలంక రామాలయం వద్ద..

 లంక గ్రామాల్లో మోకాల్లోతుకు చేరిన వరద
  పడవలపై జనం ప్రయాణం
  పట్టించుకోని అధికారులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): శ్రావణ పౌర్ణమి కావడంతో సముద్రం ఉప్పొంగడం వల్ల గోదావరి నదీ  ప్రవాహం మరింత పోటెత్తింది. దాంతో సమీపంలోని లంక  గ్రామాల్లోని కాజ్‌వేలు, నివాస గృహాలకు సైతం వరదనీరు ముంచెత్తింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ పరంగా వరద పునరావాస చర్యలు పెద్దగా చేపట్టక పోవడంతో లంక గ్రామాల్లోని ప్రజలకు మరోసారి ఇబ్బందులు అనివార్యమయ్యాయి. నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. నెల రోజుల వ్యవధి ముగియకుండానే రెండోసారి వరదలు సంభ వించడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 40కు పైగా  గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సుమారు 14 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలడంతో కోనసీమ జిల్లాలో ఉన్న వశిష్ఠ, వైనతేయ, గౌతమీ, వృద్ధగౌతమీ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి  వరద నీరు ప్రవేశించింది.
అనేక చోట్ల కాజ్‌వేలు పూర్తిగా జల దిగ్బంధానికి గురయ్యాయి. చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వే, అయినవిల్లి మం డలంలోని ఎదురు బిడియం కాజ్‌వే, అప్పనపల్లి-పాశర్లపూడి మధ్య ఉన్న కాజ్‌వే, పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి వద్ద ఉన్న కాజ్‌వే, కొత్తపేటలోని నారాయణలంక కాజ్‌వేలు జల దిగ్బంధానికి గురయ్యాయి. కొన్నిచోట్ల ప్రయాణికుల రాకపోకల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు పడవలను ఏర్పాటు చేసి ప్రజలను దాటిస్తున్నారు. ప్రధాన రేవులో రాకపోకలను నిలిపివేశారు. అయినవిల్లి  ఎదరు బిడియం వద్ద మూడు  పడవలను ఏర్పాటు చేశారు. అప్పనపల్లి కాజ్‌వే పూర్తిగా నీట మునగడంతో పాటు సమీపంలోని వీధుల్లోకి వరద నీరు ప్రవేశించింది. అప్పనపల్లి వద్ద ఉన్న పెట్రోల్‌ బంకు చుట్టూ కూడా నీరు పెరిగింది.  బి.దొడ్డవరంలో ప్రమాదవశాత్తూ వరదలో కొట్టుకుపోతున్న వృద్ధురాలిను  స్థానికులు రక్షించారు. అల్లవరం మండలం బోడసకుర్రు శివారు పల్లిపాలెంలో కొన్ని ఇళ్లు నీట మునగడంతో వారిని స్థానిక పునరావాస కేంద్రానికి తరలించి అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
ముమ్మిడివరం మండలంలోని నదీ పరివాహక లంక గ్రామాల్లో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే పశువులకు పచ్చగడ్డి, ఎండుగడ్డి కరువు కావడంతో మూగరోదన చేస్తున్నాయి. మరోసారి వరద రావడంతో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లోకి వరదనీరు చేరుతుంది. పౌర్ణమి పోటుతో వరద నీరు సముద్రంలోకి పెద్దగా దిగకపోవడంతో నీరు స్తంభించి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.
రానున్న రెండు రోజుల్లో వరద మరింత పెరగవచ్చనే అంచనాలు కోనసీమ జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తుంది. అయితే ఈ సారి అధికార యంత్రాంగం వరద సహాయ చర్యలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఆయా లంక గ్రామాల నుంచి వ్యక్తమవుతున్నాయి.  కాజ్‌వేలు నీట మునగడం వల్ల ప్రజలను బయటి ప్రాంతాలకు తర లించేందుకు పడవలు లేకపోవడం వల్ల వారు మళ్లీ తీవ్రంగా క ష్టాలు పడుతున్నారు.                        
ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు లంక గ్రామాల్లో ఉండడంతో ఏర్పాట్లు చేసుకునేందుకు ఆయా కుటుంబాల సభ్యులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని ప్రసిద్ధి చెందిన బాలబాలాజీ దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు నిర్ణయించుకున్న పెళ్లి బృందాల కష్టాలు అన్నీఇన్నీ కావు. ట్రాక్టర్లపై కాజ్‌వేను దాటి వరదనీటిలోనే దేవస్థానానికి వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వరద తగ్గే వరకు బాలబాలాజీ దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే  వివిధ ప్రాంతాల్లో కాజ్‌వేలు మునగడం, వరదనీరు నిలకడగా కొనసాగడంతో రాగల రోజుల్లో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయన్న భయం ఆయా  గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా లంక ప్రాంతాల నుంచి చదువుకునేందుకు అమలాపురం పరిసర ప్రాంతాలకు వచ్చే విద్యార్థులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షల కారణంగా ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతం.

Updated Date - 2022-08-13T06:10:45+05:30 IST