గ్రామాల వైపు పరుగులు

ABN , First Publish Date - 2022-08-18T06:57:19+05:30 IST

గోదావరి వరద ముంపు మండలాల వాసు లను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

గ్రామాల వైపు పరుగులు

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద 

ముంపు మండలాల్లో ఆందోళన

ప్రజలను గాలికొదిలేసిన ప్రభుత్వం

భద్రాచలం వద్ద 54.40 అడుగులకు నీటిమట్టం 

మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక

దిగువకు 15 లక్షల క్యూసెక్కులు


వేలేరుపాడు/కుక్కునూరు, ఆగస్టు 17 : గోదావరి వరద ముంపు మండలాల వాసు లను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 40 రోజులుగా వరద పెరుగుతూ, తగ్గుతూ మళ్లీ పెరుగుతూ దోబూచులాడుతే  ప్రజల కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా యి. జూలైలో వచ్చిన భారీ వరదలకే అతలాకుతలమైన వేలేరుపాడు మండలం.. ఆ తర్వాత జరిగిన విధ్వంసాన్ని చూసి గుండెలు బాదుకున్న బాధితులు పడిపోకుండా మిగిలిన ఇళ్లను శుభ్రం చేసుకుని తిరిగి వద్దామనుకునే లోపే ఈ నెల ఏడో తేదీన రెండోసారి గోదావరి వరద గ్రామాలను చుట్టుముట్టింది. ఆరు రోజులపాటు గ్రామాలకు సమీపంలోనే తిష్ట వేసిన వరద కొంత తగ్గుముఖం పడుతున్న సమయంలోనే తిరిగి ముచ్చటగా మూడోసారి వరద మరలా పోటెత్తింది. దీంతో దాదాపు 35 గ్రామాలకు రహదారి సౌకర్యం లేక బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ 40 రోజులుగా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో అనేక గ్రామాల్లో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వారు మండల కేంద్రానికి చేరుకునే వీలు లేకపోయింది. జూలై వరదల సందర్భంగా వీలున్నచోట చిన్న ఇంజన్‌ బోట్లు ఏర్పాటుచేసిన అధికారులు ఈసారి అలాంటి ఏర్పాట్లు చేయలేదు. మరీ ప్రాణాల మీదకు వస్తే చేపలు పట్టే బోట్ల ద్వారా అతికష్టం మీద మండల కేంద్రానికి చేరుకోవలసి వస్తోంది. అధికారులు గతంలో మొబైల్‌ లాంచీ ద్వారా వైద్య సేవలందించేవారు. ఈసారి ప్రజలు ఎటుపోతే మాకెందుకు అన్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. 


భద్రాచలం వద్ద స్థిరంగా.. 


భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 7 గంటలకు మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక దాటి 54.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. సాయంత్రం మూడు గంటలకు 54.60 నీటి మట్టం చేరుకోగా సాయంత్రం 6 గంటలకు 54.40 అడుగులు నమోదయ్యాయి. దాదాపు 15లక్షల క్యూసెక్కులు దిగువకు వస్తుండటంతో ఆ నీరంతా ముంపు మండలాల వైపు మళ్లుతూ గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. నాలుగు గంటల నుంచి భద్రాచలం వద్ద గంటకు అంగుళం చొప్పున గోదావరి నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ గ్రామాల్లోకి వరద చొచ్చుకొస్తోంది. వేలేరుపాడులో సంత మార్కెట్‌ పూర్తిగా మునిగిపోగా మెయిన్‌ రోడ్డు మీదకు వరద నీరు ఎగబాకుతోంది. ఎన్టీఆర్‌ మినీ స్టేడియం పూర్తిగా మునిగిపోగా హైస్కూల్‌ల్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. గోరు చుట్టుపై రోకలి పోటులా బుధవారం నుంచి ఉత్తర బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందన్న సమాచారం. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న వరదకు భారీ వర్షాలు తోడైతే గోదావరి నీటి మట్టం మరింత పెరిగి మరోసారి గ్రామాలను ముంచివేసే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుండి విడుదల చేసిన నీరు గురువారం రాత్రికి భద్రాచలం చేరుకోనున్న క్రమంలో మరలా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.


 పోలవరం ప్రాజెక్టు వద్ద..


పోలవరం : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో బుధవారం నాటికి గోదావరి నీటిమట్టం  మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన, కాపర్‌ డ్యాం ఎగువన గోదావరి నీటిమట్టం 34.100 మీటర్లు, దిగువ కాపర్‌ డ్యాం, స్పిల్‌ వే  దిగువన 25.620 మీటర్లు, పోలవరం వద్ద 24.807 మీటర్లు నమోదైంది. అదనంగా వస్తున్న 12,39,153 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేశారు. 

 

 కొనసాగుతున్న వర్షాలు


ఏలూరుసిటీ, ఆగస్టు 17 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి బలహీన పడినా ఇంకా జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా గణపవరం మండలంలో 42.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 9.7 మి.మీ. వర్షాలతో సార్వా పనులు ముమ్మరంగానే సాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షపాతం వివరాలివి.. కలిదిండి 26.6, చాట్రాయ్‌ 26.4, కొయ్యలగూడెం 24.8, నిడమర్రు 20.6, కైకలూరు 19.2, లింగపాలెం 17.4, చింతలపూడి 14.2, టి.నరసాపురం 10.8,  పోలవరం 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో 10 మిల్లీమీటర్లు కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. 

గోదావరికి వరద పెరుగుతున్న దృష్ఠ్యా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వై.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలంలో జడ్పీ సీఈవో కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌, డ్వామా పీడీ డి.రాంబాబు బుధవారం పర్యటించారు. గురువారం 13 టన్నుల కూరగాయలు, లక్ష వాటర్‌ ప్యాకెట్లు, 2100 లీటర్ల పాల ప్యాకెట్లు, 20 వేల క్యాండిల్స్‌, 250 గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు సీఈవో రవికుమార్‌ చెప్పారు.  




Updated Date - 2022-08-18T06:57:19+05:30 IST