Abn logo
Sep 23 2021 @ 00:25AM

వరద గోదావరి..

- 69 రోజులుగా కొనసాగుతున్న వరద 

- ఎల్లంపల్లి నుంచి 472 టీఎంసీల నీళ్లు దిగువకు..

- 26 రోజులు నడిచిన కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద గోదావరిగా మారింది. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండడంతో పాటు అదనంగా వచ్చిన నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి సుమారు 472 టీఎంసీల నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఇదే సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లిలోకి 37 రోజుల పాటు మోటార్లను నడిపి సుమారు 32 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటికీ పెద్దఎత్తున వరద వస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లకు అధికారులు విశ్రాంతిని ఇచ్చారు. 

జూన్‌ నుంచే వర్షాలు..

ఈ ఏడాది వర్షాకాలంలో జూన్‌ ప్రారంభం నుంచే వర్షాలు కురవడం మొదల య్యాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జూన్‌ 18వ తేదీ నుంచి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్దగల పార్వతి పంప్‌హౌస్‌ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. జూలై 13వ తేదీ వరకు 26 రోజుల పాటు నీటిని ఎత్తిపోశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ భాగాన భారీ వర్షాలు కురియడం ప్రారంభమవడంతో అధికారు లు ఎత్తిపోతలను నిలిపివేశారు. 14 తేదీ సాయం త్రం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరు కోవడంతో గేట్లను ఎత్తి 11,116 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెట్టారు. అప్పటి నుంచి దిగువ కు నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి మంగళవారం నాటికి 69 రోజుల్లో శ్రీపాద ఎల్లంపల్లికి 529 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో గేట్ల ద్వారా 472 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలిపెట్టారు. నంది పంప్‌ హౌస్‌కు 24 టీఎంసీలు, తాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం 3.7 టీఎంసీల నీటిని సద్విని యోగం చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 22 టీఎంసీల వరకు ఎత్తిపోశారు. 

రెండేళ్లుగా ఎల్లంపల్లికి వరద..

సాధారణంగా జిల్లాలో భారీ వర్షాలు జూలై చివరి వారంలో మొదలై ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు కురుస్తుంటాయి. గత ఏడాది భారీ వర్షాల కోసం ఎదురుచూసిన అధికారులు ఆశించిన మేరకు పడవని భావించి ఆగస్టు 3వ తేదీ నుంచి కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారం భించారు. వారం, పది రోజులు మోటార్లు నడిచిన తర్వాత ప్రాజెక్టు ఎగువ భాగాన భారీ వర్షాలు పడడంతో మోటార్లను ఆపేశారు. వారం రోజులకే ప్రాజెక్టు నిండడంతో గేట్లను ఎత్తి అదనంగా వచ్చిన నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఆ ఏడాది ఎల్లంపల్లికి 483 టీఎంసీల వరద రాగా, గేట్ల ద్వారా 420 టీఎంసీల నీటిని వదిలిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 49 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. నంది పంప్‌మౌస్‌కు 39 టీఎంసీల నీటిని సరఫరా చేశారు. ఇలా రెండేళ్లుగా శ్రీపాద ఎల్లంపల్లికి 450 టీఎంసీలకు పైగా వరద వస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరం పెద్దగా లేకుండా పోతున్నది. గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆలస్యంగా నడిపినప్పటికీ, ఈ ఏడాది సంబంధిత అధికారులు ముందస్తుగానే మోటార్లను నడిపించా రు. కొద్ది రోజుల పాటు వేచి చూసి ఉంటే 26 రోజుల పాటు మోటార్లను నడిపించాల్సిన అవస రం లేకుండా పోయేదని, తద్వారా సుమారు 500 కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లు ఆదా అయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. బుధవారం కూడా ఎస్సారెస్పీ నుంచి 65,938 క్యూసెక్కుల వరద వస్తుండగా, 65,676 క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నారు.