కృష్ణా నదికి వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-09-19T09:47:20+05:30 IST

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణానదిలో వరద ప్రవాహం హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. క్రెస్ట్‌ కంటే ఎక్కువ ఎత్తులో ఉదయం ఉన్న ప్రవాహం సాయంత్రా

కృష్ణా నదికి  వరద ప్రవాహం

 ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

 సాయంత్రానికి ఉపసంహరణ

 దిగువకు 4.33లక్షల క్యూసెక్కుల నీరు

 

గుంటూరు, తాడేపల్లి టౌన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణానదిలో వరద ప్రవాహం హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. క్రెస్ట్‌ కంటే ఎక్కువ ఎత్తులో ఉదయం ఉన్న ప్రవాహం సాయంత్రానికి తగ్గుతోంది. దీంతో శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను సాయంత్రం 6.45 గంటల సమయంలో వరద ప్రవాహం క్రెస్టు కంటే తగ్గడంతో ఉపసంహరించారు. మరి కొద్ది రోజులు వరద ప్రవాహంలో ఇలానే హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.


ఎగువ జలాశయాలకు కొనసాగుతెన్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ బ్యారేజ్‌ వద్దకు ఎంత మోతాదులో వరదనీరు వచ్చి చేరుతుందనే దానిని అంచనా వేస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కులకు కొంచెం అటు ఇటుగానే వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రానికి 3,50,000 క్యూసెక్కుల నీరు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 20,000 క్యూసెక్కుల నీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది.


దిగువకు 4,33,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 4,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు.   


Updated Date - 2020-09-19T09:47:20+05:30 IST