లోతట్టుకు వీడని భయం.. వరదలో హెచ్చుతగ్గులు..

ABN , First Publish Date - 2020-10-19T17:08:16+05:30 IST

కృష్ణాపరివాహక ప్రాంత ప్రజలు కన్నీటి వరదలో కూరుకుపోయారు. వరద ముప్పు వీరిని మూడు నెలలుగా వెన్నాడుతూనే ఉంది. పూటకో రకంగా ఉంటున్న వరద కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

లోతట్టుకు వీడని భయం.. వరదలో హెచ్చుతగ్గులు..

ఉదయం తగ్గుదల.. సాయంత్రం పెరుగుదల.. 

అవుట్‌ఫ్లో 6.12లక్షల క్యూసెక్కులు


విజయవాడ (ఆంధ్రజ్యోతి) : కృష్ణాపరివాహక ప్రాంత ప్రజలు కన్నీటి వరదలో కూరుకుపోయారు. వరద ముప్పు వీరిని మూడు నెలలుగా వెన్నాడుతూనే ఉంది. పూటకో రకంగా ఉంటున్న వరద కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజులుగా భారీ వర్షాలు ఒకపక్క ముంచెత్తుతుంటే.. మరోపక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఇళ్లనూ, పంటపొలాలనూ ముంచెత్తుతూనే ఉంది. ప్రజలు పునరావాస కేంద్రాల్లో అసౌకర్యాల నడుమ, కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.


ఒకపూట భయం. మరోపూట ఉపశమనం. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పరిస్థితి ఇది. ప్రకాశం బ్యారేజీకి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశారు. అది ఏడు లక్షల క్యూసెక్కుల వద్ద ఆగిపోయి, క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం ఎగువ నుంచి 6.08 లక్షల క్యూసెక్కుల నీరు రాగా, దిగువకు 6.05లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ లెక్కలు మధ్యాహ్నానికి మారిపోయాయి. ఇన్‌ఫ్లో 6.15లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 6.12లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద ఇంకా రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. 70 గేట్లను క్లియర్‌ స్థాయికి ఎత్తారు. వరద నీటి నుంచి 3472 క్యూసెక్కుల నీటిని కాల్వలకు ఇస్తున్నారు. 


రాత్రికి ఇన్‌ఫ్లో 5.12లక్షల క్యూసెక్కులకు చేరింది. దీనికి తగినట్టుగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదిలో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. నదీ పరివాహక ప్రదేశంలో ఉన్న ఇళ్లన్నీ ముంపులోనే ఉన్నాయి. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్ల మధ్యకు వచ్చిన నీరంతా రెండు, మూడు రోజుల్లో వెనక్కి వెళ్లిపోతుందని బాధితులు భావించారు. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లంక గ్రామాలను వరద నీరు చుట్టిముట్టేసింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. వరద ప్రవాహం హెచ్చుతగ్గుల మధ్య ఉండడంతో ఏ క్షణాన దాని ఉధృతి పెరుగుతుందోనన్న ఆందోళన అటు అధికారులు, ఇటు బాధితుల్లో కనిపిస్తుంది. 

Updated Date - 2020-10-19T17:08:16+05:30 IST