అంతలోనే ఎంత తేడా..?

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

కేవలం నెల అంటే నెలలోనే గోదావరి రెండుసార్లు ఉగ్రరూపం దాల్చింది. కాని అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కనిపిస్తున్నది. అప్పట్లో గోదావరి భారీగా విరుచుకు పడి నప్పటికీ భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే నాటికి కూడా ముంపు మండలాలకు అతి పెద్ద ఇబ్బందేమీ రాలేదు.

అంతలోనే ఎంత తేడా..?

నెల వ్యవధిలోనే గోదావరి దూకుడు

భద్రాచలం వద్ద 50 అడుగులు ఉండగానే వేలేరుపాడు సమీపాన మునక

కాఫర్‌ డ్యాం ఎదురుపోటే కారణమా ?

రెండేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి

మళ్లీ ఇప్పుడు పునరావృతం


కేవలం నెల అంటే నెలలోనే గోదావరి రెండుసార్లు ఉగ్రరూపం దాల్చింది. కాని అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కనిపిస్తున్నది. అప్పట్లో గోదావరి భారీగా విరుచుకు పడి నప్పటికీ భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే నాటికి కూడా ముంపు మండలాలకు అతి పెద్ద ఇబ్బందేమీ రాలేదు. కానీ ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినంతనే ఊళ్లల్లోకి వరద చొచ్చు కొచ్చింది. ఎందుకిలా జరుగుతోంది..? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ  తొలుస్తోంది.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

వరద తీరు మారింది. గత నెలలో క్రమక్రమంగా వరద పెరిగి ఊళ్లకు ఊళ్లే మునిగాయి. అప్పట్లో భద్రాచలం వద్ద నీటి మట్టం 50 అడుగులు దాటినా మండల కేంద్రమైన వేలేరుపాడుకు కిలోమీటరు దూరం వరకు మాత్రమే వరద వచ్చి చేరింది. కాని ఇప్పుడు అదే నీటి మట్టం బుధవారం సాయంత్రం నాటికి నమోదుకాగా వరద నీరు వేలేరుపాడును క్రమేపీ చుట్టిముట్టే స్థాయికి చేరింది. అప్పటికీ ఇప్పటికీ వరద దూకుడులో ఎంత తేడా. పోలవరం కాఫర్‌ డ్యాం వలనే నీరు ఎగతన్నుతోందా..? శబరి పోటెత్తిన కారణంగానే గోదారమ్మ గ్రామాల వైపు చొచ్చుకొస్తుందా..? అందరి అనుమానం ఇదే. 


వరద దూకుడులో ఎందుకీ తేడా 

గోదావరి వరద భద్రాచలం వద్ద మూడు ప్రమాద హెచ్చ రికలు దాటి ప్రవహిస్తేనే ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు పరిసర గ్రామాలన్నీ వరద నీటిలో చిక్కుకునేవి. దానికనుగుణంగానే నిర్వాసిత కుటుంబాలన్నీ ఎగువ ప్రాంతాలకు తరలిపోయేవి. గత నెలలో గోదావరి వరద ఇక్కడివారందరికీ చుక్కలు చూపించింది. కోలుకోలేనంతగా దెబ్బతీసింది. ఇప్పటికీ ఆ నష్ట కష్టాల నుంచి తేరుకోకమునుపే మళ్ళీ గోదావరి వరద ఎగువ నుంచి క్రమేపీ పెరుగుతూ ఈ మండలాల దిశగా దూసుకొస్తున్నది. గత నెలలో భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 58 అడుగులకు చేరిన తరువాతే ఈ రెండు మండలాల్లో ఎక్కకక్కడ వరద నీరు పెరుగుతూ వచ్చింది.గత వరదల్లో రికార్డు స్థాయిలో భద్రాచలం వద్ద 71.3 అడుగుల మేర వరద చేరడంతో వేలేరుపాడులోని రేపాక గొమ్ముతోపాటు అనేక గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్ళు కుప్పకూలాయి. పదుల సంఖ్యలో వాహనాలు గోదావరి పాలయ్యాయి. వందల సంఖ్యలో పశువులు వరద నీటిలో కలిశాయి. ఆఖరుకు కుక్కునూరు మండలంలో నిర్మించిన నిర్వాసిత కాలనీ కూడా వరద నీటిమయమైంది. పోలవరం ప్రాజెక్టు కాంటూరు 41.75కు మించి 45 కంటే పెరిగి ముందుకు దూసుకొచ్చేసింది. కనీవినీ ఎరుగని విప త్తును చూసి అక్కడివారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు.     


 వరద రూటు మారిందా 

గత నెల 10వ తేదీ నుంచి గోదావరి అంతకంతకు పెరిగి వారంలో ముంపు మండలాల్లో విలయతాండవం చేసింది. ఆ నష్టాలను, కష్టాలను మరిచిపోకముందే తిరిగి ఈనెల 10నే భద్రాచలం వద్ద గోదావరిలో వరద మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక జారీకి దారితీసింది. గోదావరి  బుధవారం సాయంత్రం నాటికే భద్రాచలం వద్ద 50.6 అడుగుల స్థాయిలో వరద ప్రవహిస్తున్నది. ఇదే తరుణంలో దాదాపు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోలవరం వైపు దూసుకొస్తున్నది. ఇది మరింత పెరిగి 14–15 లక్షల క్యూసెక్కుల వరకు ఉండగలదని యంత్రాంగం అంచనా వేస్తోంది. భద్రాచలం ఎగువున పేరూరు ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే వరద పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక సంకేతాలు. ఇప్పటికే వేలేరు పాడు సమీపాన 300 మీటర్ల దూరంలో ఉన్న సంత మార్కెట్‌ను గోదావరి వరద తాకింది. ఒక సమాచారం ప్రకారం పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం కారణంగానే గడిచిన రెండేళ్ల క్రితం నాడు కూడా అప్పట్లో కుక్కు నూరు, వేలేరు పాడు మండలాల్లో లోతట్టు గ్రామాలకు గోదావరి వరద చేరింది. అప్పుడు, ఇప్పుడు కూడా గోదావరి ఉప నది శబరి ఉప్పొంగడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. గత నెలలో వచ్చిన వరదల సమయంలోనూ శబరి నుంచి పెద్దగా వరద గోదావరిలో కలవలేదు. కాని ఈసారి దానికి భిన్నంగా శబరిలో వరద పోటెత్తడంతో ఆ నీరంతా పాపికొండలకు దిగువున గోదావరిలోకి వచ్చి కలుస్తుంది. దీని ప్రవాహ వేగం ఒక ఎత్తయితే, కాఫర్‌ డ్యాం కారణంగా నీరు ఎగతన్నడంతో వేలేరుపాడు మండలానికి వరద పోటు తగిలిందని ఒక అంచనా వేస్తున్నారు.  


పోలవరానికి వరద తాకిడి

పోలవరం స్పిల్‌వే వద్ద మంగళవారం 33.150 మీటర్లు ఉండగా ఇప్పుడు అది కాస్తంత పెరిగి బుధవారం నాటికి 33.370కు పెరిగింది. గత నెలలో భారీ వరదల నాటికి ఇదే కాఫర్‌ డ్యాం వద్ద 36 మీటర్ల అత్యధిక రికార్డు స్థాయికి చేరింది.అప్పటికీ ఇప్పటికీ దాదాపు మూడు మీటర్లు వ్యత్యాసం కనిపిస్తున్నది. అలాగే స్పిల్‌వే వద్ద ఇప్పటికే డిశ్చార్జి 10 లక్షల క్యూసెక్కులకు పైబడే పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో ఇది కాస్తా మరో రెండు లక్షల క్యూసెక్కులకుపైగానే పెరిగి 13 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయికి చేరుకునే అవకాశా లున్నాయి. ‘అమ్మో.. నెలలోనే రెండుసార్లు వరదలు వచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేగాని పెద్దగా వణికిపోయే వాళ్ళమేకాదు. కాని ఈసారి రెండో ప్రమాద హెచ్చరికకే మా ఊళ్ళోకి నీరొచ్చేసింది. తేడా ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు’ వేలేరుపాడు వాసులు ఎవరినోట విన్నా ఇదే కామెంట్‌..




Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST