ముంచుకొస్తోంది

ABN , First Publish Date - 2021-06-24T06:19:22+05:30 IST

గోదావరి ముంచుకొస్తోంది. వేలాది మంది క్షణమొక యుగంలా గడుపుతున్నారు.

ముంచుకొస్తోంది
కొత్తూరు నుంచి తరలి వెళ్తున్న నిర్వాసితులు

గడగడలాడుతున్న ముంపు గ్రామాలు

పూర్తి కాని కాలనీలు.. 

స్థానికంగా నివాసాలు ఉండలేరు 

పరిహారమిస్తేనే వెళతామని నిర్వాసితుల పట్టు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

గోదావరి ముంచుకొస్తోంది. వేలాది మంది క్షణమొక యుగంలా గడుపుతున్నారు. పోలవరం నిర్వాసిత ప్రాంత గ్రామాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. గుండె దడను పెంచుతోంది. గోదావరి పరీవాహకంలో ఆగస్టు, సెప్టెంబరు నాటికి వరద ఉగ్రరూపం దాల్చి ఇక్కడి గ్రామాలన్నీ ఎక్కడి కక్కడ స్తంభించిపోతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా గోదావరికి అడ్డుగా ఎగువన నిర్మిస్తున్న ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ కారణంగా గోదావరిలోకి చేరే నీరు భారీగా దిగువకు చేరలేక ఎగువకు ఎగతన్నుతోంది. ఫలితంగా గత ఏడాది కాఫర్‌ డ్యామ్‌ కుడి ఎడమల వైపు కొంత ఖాళీ ఉంచి ప్రవాహాన్ని దిగువకు చేరేలా చేసేవారు. అయినప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం వంటి మండలాల్లో వరద నీరు గ్రామాలవైపు చేరింది. మరోవైపు గోదావరి ఉపనదులు ముంచుకొచ్చాయి. ఇవన్నీ కలిపి ముంపు వాసులను గుక్క తిప్పుకోలేకుండా చేశాయి. ఈసారి ఎగు వ కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసివేసి గోదావరి వరదను స్పిల్‌వేకు మళ్లించాలని ప్రతిపాదించారు. పెద్దగా నీళ్లు స్పిల్‌వే వైపు చేరకుండా ముంపు మండలాల వైపు ఇప్పటికే ఎగతన్నింది. గోదావరిలో ఇసుక మేటల స్థానంలో నిండు గోదావరి ఆవిష్కృతమైంది. ఈ నెల మొదటి వారంలోనే కుక్కునూరు, వేలేరుపాడు, గోదావరి పరీవాహంలో వున్న మత్స్యకారుల గుడిసెలు, నాటు బోట్లు నీట మునిగాయి. అప్పటి నుంచి గోదావరిని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ముంపు ప్రాంతాల ను ఖాళీ చేసి తక్షణం కాలనీలకు తరలి వెళ్లాలని మే రెండో వారంలోనే అధికారులు హెచ్చరికలు చేశారు. 


గోదావరి నీటిమట్టం 25.7 మీటర్లు


గత ఏడాది ఇదేరోజు 17.5 మీటర్ల కాఫర్‌ డ్యామ్‌ వద్ద సీడబ్ల్యూసీ తీసిన వరద నీటిమట్టం. కానీ ఈ ఏడాది వర్షాలు రాకమునుపే, పైనుంచి వరద ముంచెత్తక మునుపే 25.7 మీటర్లు. వాస్తవానికి కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటిమట్టం 25.72గా నమోదైతే అప్రోచ్‌ చానల్‌ మీదుగా స్పిల్‌వే వరకూ నీటిని మళ్లిస్తారు. వాస్తవానికి స్పిల్‌ వేలోని 10 బ్లాక్‌ల నుంచే ప్రస్తుతానికి వరద నీరు కిందకు చేరే వీలుంది. తాజాగా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా ఎగువకు వరద నీరు చేరుతుండడం ప్రమాద సంకేతాలను పంపింది. రాబోయే మూడు నెలల్లో పరిస్థి తిని ఊహించుకుని ఇప్పటివరకు ఊరును ఒదలకుండా గడిపిన వారే పిల్లా పాపలతో సహా పోలవరం చేరుకుం టున్నారు. కొత్తూరును దాదాపు ఖాళీ చేశారు. మాదాపు రం, కోండ్రుకోట, ఏకూరు, శివగిరి గ్రామాలన్నింటినీ ఖాళీ చేశారు. ఎగువ సీలేరు నుంచి వరద నీరు వచ్చి చేరడంతో పరిస్థితి మరింత చేయి దాటబోతోంది. 


పరిహారం మాటేంటి ?


ఒకవైపు గోదావరి ముంపు భయం. మరోవైపు ప్రమాదస్థాయిలో కాఫర్‌ డ్యామ్‌ ప్రభావం. మూడో వైపు చేతికందని పరిహా రం. ముంపు వాసులందరినీ మూడు ప్రశ్న లు గుక్క తిప్పుకోలేకుండా చేస్తున్నాయి. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత జఠి లం అవుతుందని ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని గిరిజనులు, గిరిజనేతరులు భావిస్తున్నారు. వ్యక్తిగత పరిహారం జాబితాలు విడుదలైంది. ఈ జాబితాలో అనేక కుటుంబాలకు చోటు లేకుండా పోయాయి. అధికారంలోకి వస్తే ఇస్తామన్న పది లక్షల పరిహారం మాటలన్ని ఇప్పుడు గోదాట్లో కలిశాయి. పరిహారం కోసం వేల కుటుంబాలు ముంచుకొస్తున్న ముప్పును గమనించినా కాస్తంత మొండి ధైర్యంతోనే కనిపిస్తున్నారు.


ఇలా గోదారిని చూడలేదు

గోదావరిలో ఇం తటి నీటి ముంపు ను చూడనేలేదు. సెప్టెంబరు, అక్టోబ రు మాసాల్లో గోదా వరి విరుచుకుపడడమే తప్ప జూన్‌లో ఈ విధంగా ఇంతవరకూ చూడనేలేదు. నిజంగా కాఫర్‌ డ్యామ్‌ ముప్పు నేరుగానే కనిపిస్తోంది. 

   – యుగంధర్‌, కుక్కునూరు



మున్ముందెలా ఉంటుందో ?

ఇప్పటికే గోదావ రిని చూస్తే భయం వేస్తోంది. ఇప్పుడే ఈవిధంగా ఉంటే మున్ముందు  ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. గోదావరిలో ఇంత ఉధృతి కాని, ఈనెలలోనే నీరు వెనక్కు తన్నడం కాని తొలిసారి చూస్తున్నాం.  

  – నాగేంద్రరావు, కుక్కునూరు 



భూమిలిచ్చినందుకా.. తిప్పలు

ఇప్పుడు ఉన్న ట్టుగా గోదావరిని ఎప్పుడూ చూడలే దు. అధికారులు ఏమో పొమ్మంటు న్నారు. పునరావాసం మాట ఎత్తితే కొండలు, గుట్టలవైపు చూపిస్తు న్నారు.  ప్రాజెక్టుకు భూములిస్తే ఇప్పుడేమో మాకీ తిప్పలు. 

  –ప్రభాకరరావు, వేలేరుపాడు 


Updated Date - 2021-06-24T06:19:22+05:30 IST