వరదలకు ఎదురీత

ABN , First Publish Date - 2022-08-12T05:36:18+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలన్నీ గోదారి కష్టాలకు ఎదురీదుతున్నాయి. నెల రోజులుగా పదుల సంఖ్యలో గ్రామాల్లో పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఆఖరుకు రేషన్‌ కూడా లేకపోయింది.

వరదలకు ఎదురీత
వేలేరుపాడు శివారును తాకిన గోదావరి వరద

గోదావరి వరదల్లో ముంపు బాధితుల అవస్థలు

వేలేరుపాడులో  అంతా అయోమయం

వందల మంది కొండలు, గుట్టల మీదే

పచ్చడి మెతుకులు.. తుప్పు నీళ్లే గతి

కూరగాయలు, పాలు, కరెంటు లేవు

రేషన్‌కు దిక్కులేదు.. కిరోసిన్‌ లేక కట్టెలతోనే వంటా వార్పు

గత నెల తప్పిదాలతోనే యంత్రాంగం

బావురుమంటున్న బాధితులు


పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలన్నీ గోదారి కష్టాలకు ఎదురీదుతున్నాయి. నెల రోజులుగా పదుల సంఖ్యలో గ్రామాల్లో పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఆఖరుకు రేషన్‌ కూడా లేకపోయింది. కరెంటు సరఫరా సంగతి చెప్పనక్కర్లేదు. మళ్ళీ ముంచు కొచ్చిన గోదావరి వరదలతో అంతా విలవిలలాడు తున్నారు. వేలేరుపాడు మండలం సగభాగం వరదకు చేరువైంది. వీరందరి కష్టాలు చెప్పనలవి కావు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా గుణపాఠం నేర్చుకుంటారనుకున్నా యంత్రాంగంలో అదేదీ మచ్చుకైనా కనిపించడం లేదు. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి/వేలేరుపాడు) :

గత నెలలో ఇదే సమయాన గోదావరి వరద ముంచు కొస్తున్న వేళ ప్రాణభయంతో చెల్లా చెదురయ్యారు. పిల్లా పాపలతో సురక్షిత ప్రాంతాలకు.. కొండ గుట్టల్లో చేరిపోయారు. సరిగ్గా నెల తరువాత ఇప్పుడు వరద కష్టాలు కళ్ళముందే కనిపిస్తుండగా ఇళ్ళల్లో పేరుకుపోయిన బురదను తొలగించేం దుకు.. కుప్పకూలిన గుడిసెలను పునర్నిర్మించేందుకు అవకాశం లేక, చేతిలో చిల్లిగవ్వ లేని దీనావస్థలో ఇప్పటికీ వందల కుటుం బాలు కొండ గుట్టలపైనే ఆవాసం. విష సర్పాలు, మంచి నీరు, కరెంటు సరఫరా లేనిచోట బలవంతంగా బతుకీడుస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న రుద్రంకోట, రేపాకగొమ్ము, తాట్కూరు గొమ్ము, తిరుమలపురం, నార్లవరం, కటుకూరు, కొయిద వంటి ఏడు గ్రామాలు, వీటి పరిధిలోని మరో 20 శివారు ప్రాంతాల ప్రజలంతా  నెల రోజులుగా కొండలు, గుట్టల నుంచి దిగి రాలేదు. ఉన్న ఊళ్ళో ఇళ్ళు కుప్పకూలడం, ఆవాసానికి అనువైన పరిస్థితి లేకపోవడంతో అప్పటికే కొండలపై తాత్కాలికంగా నిర్మించుకున్న టెంట్‌లలోనే కాలక్షేపం చేస్తున్నా రు. అప్పట్లో తల ఒక్కింటికి ఐదు కిలోలు బియ్యం, ఇంటిల్లిపాదికి కిలో వంట నూనె, మరో రెండు వేలు చేతిలో పెట్టి అధికారులు సరిపెట్టేశారు. తర్వాత నిర్వాసిత కుటుంబాలన్నింటినీ గాలికొది లేశారు. తాజాగా మరోమారు గోదావరి ఊళ్ళ వైపు చొచ్చుకొ స్తోంది. భద్రాచలం వద్ద గురువారం నాటికి మూడో హెచ్చరిక కు వరద అతి చేరువలోనే ఉంది. దీనికి సమాంతరంగా వరద ఏ రోజుకారోజు గోదావరి ఒడ్డున వున్న గ్రామలకు అత్యంత సమీపంగా చేరుతుంది. ఒక అంచనా ప్రకారం కటుకూరులో 250 కుటుంబాలు, కొయిదాలో 200, రుద్రంకోటలో 300, నార్లవ రంలో మరో 100 కుటుంబాలు, వీటితోపాటు శివారు గ్రామాల్లో ఉన్న మరో వెయ్యి మందికిపైగా కొండలు, గుట్టలే వరద నుంచి రక్షించుకునేందుకు ప్రస్తుతానికి కోటలుగానే మారాయి.


కరెంటు.. రేషన్‌కు దిక్కులేదు

వేలేరుపాడు మండలం వరదల్లో మూడొంతులు పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడికక్కడ ఇళ్ళన్నీ కూలాయి. మూడు వేలకుపైగా గిరిజనుల గుడిసెలు గోదాట్లో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలిన వందల కుటుంబాలన్నీ  పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 18 రోజుల క్రితం కొండలు, గుట్టలు మీద ఉన్న వారికి విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు జనరేటర్‌ అవకాశం కల్పించినా మిగతా కుటుంబాలన్నీ  ఇప్పటి వరకు రాత్రి వేళ చీకట్లో రాక్షస దోమల మధ్యే గడుపుతున్నాయి. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రత్యేక చర్యలు లేవు. చంటి పిల్లలకు కనీసం పాలిచ్చి పక్షం రోజులు దాటింది. గత నెలలో కేవలం నాలుగైదు రోజులపాటు మాత్ర మే పాలు సరఫరా చేసి అధికారులు చేతులెత్తేశారు. ఒకవైపు కరెంటు లేక, మరోవైపు చంటి పిల్లలకు పాలు లేక నిర్వాసిత బాధితులంతా గొల్లుమంటున్నారు. ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతమే. ఆగస్టులో వేలేరు పాడు మండలం రేషన్‌ సరఫరా చేయలేదు. గత నెలలో సర్కారు ఇచ్చిన ఐదు కిలోల బియ్య మే ఇప్పటికీ దిక్కు. ఓ వైపు రేషన్‌ కూడా పూర్తిగా అందకపోవడంతో పచ్చడి మెతుకుల తోనే సరిపెట్టుకుంటున్నారు. కూరగాయలు లేకపోవడం, పాలు దొరకకపోవడం, కనీసం రోజువారి వంట చేసుకునేందుకు కిరోసిన్‌ కూడా అందుబాటులో లేక అడవిలో దొరికిన కట్టెలతోనే రోజువారి వంటా వార్పులతో సరిపెట్టేసుకుంటున్నారు.

 

55 అడుగులు దిశగా..

భద్రాచలంలో గడిచిన 48 గంటల వ్యవధిలో గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా మూడో హెచ్చ రిక జారీకి కొద్ది దూరమే ఉంది. శనివా రానికి గోదావరిలో వరద 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఇప్పటికే వేలేరు పాడులో దాదాపు అన్ని గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుక్కునూరులో  భద్రాచలం వెళ్ళే మార్గం మునిగిపోయిం ది. కుక్కునూరు, వేలేరుపాడు వంటి రెండు మండలాలకు అశ్వారావుపేట వెళ్లే మార్గం ఒక్కటే కాస్తంత అనువుగా ఉంది. మిగతా మార్గాలన్నీ వరదలో చొక్కు కున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. 


తాగునీరు ఇచ్చేదెవరు ?

ఓ వైపు వరద నీరు చుట్టుముడుతుండగా తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కరువ య్యా యి. కొండలు, గుట్టలమీద ఆవాసాలు ఉంటు న్న కుటుంబాలన్నీ చేరువలో ఉన్న నీటినే కాచి దాహార్తిని తీర్చుకుంటున్నారు. వాటినే వంటకు ఉపయోగిస్తున్నారు. గత నెలలో సర్కారు అన్నీ తామే సరఫరా చేస్తున్నామన్నట్టు ఇంటికి రెండు వాటర్‌ క్యాన్లు ఇచ్చి షో చేశారు. అది తప్ప ఇప్పటి వరకు మంచినీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. వేలేరుపాడు వారంతా సమీప బోర్ల నుంచి నీరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా వాటి నుంచి తుప్పు కంపుతో కూడిన నీరు వస్తుం డడంతో విలవిలలాడిపోతున్నారు. కొందరైతే 15 కిలోమీటర్ల దూరాన ఉన్న భూదేవిపేట వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మండలంలో ఉన్న 60కు పైగా గ్రామాలన్నింటిలోనూ ఇదే స్థితే. స్థానిక టీడీపీ నేతలు చొరవ తీసుకోవడం, ఎన్టీఆర్‌ ట్రస్టు, దాతల నుంచి అందిన కొన్ని నిత్యావసరాలతోనే రోజు గడుపుతున్నాయి. 


Updated Date - 2022-08-12T05:36:18+05:30 IST