ముంపు ముంగిట

ABN , First Publish Date - 2022-08-19T05:34:05+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగు తోంది. గురువారానికి గోదావరి ప్రమాద స్థాయికి చేరుకుంది.

ముంపు ముంగిట

పెరిగిన గోదావరి నీటిమట్టం.. 

ప్రాజెక్టుకు రాకపోకలు బంద్‌ 

కుక్కునూరు/పోలవరం, ఆగస్టు 18 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగు తోంది. గురువారానికి గోదావరి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలా లను ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి విడుదల చేస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే కడమ్మ వంతెన పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రాజెక్టు పోలీసు చెక్‌ పోస్టు వద్ద మూడడుగుల ఎత్తున వరద జలాలు ప్రవహిస్తున్నాయి. కడమ్మ స్లూయిస్‌ గేట్లు పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో ఏటిగట్టుకు కుడి వైపున వున్న కొండవాగుల జలాలు గోదావరిలోకి ప్రవహించే వీలులేక రెండు వేల ఎకరాల పంట పొలాలు నీట ముని గాయి. పాత పోలవరం ఫార్‌కార్నర్‌ గ్లోరియా బెలిని హాస్పిటల్‌ వద్ద అఖండ గోదావరి రివర్‌ బండ్‌ అధికారులు వర్షం నీరు బయటకుపోయేందుకు ఏర్పాటుచేసిన తూము నుంచి గోదావరి గ్రామంలోకి ప్రవేశిస్తుండటంతో అధికారు లు ఆ నీటిని మోటార్లతో తోడిస్తున్నారు. సీడబ్ల్యూసీ కార్యాలయం సమీపంలో నెక్లస్‌ బండ్‌కు రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో చేయకపోవడం వల్ల గతంలో వేసిన ఇసుక బస్తాలు, సర్వే బాదులు వెదురు తడికలు గత నెలలో వరద ప్రభావానికి నదిలో కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతం ప్రమాద స్థాయిలో కోతకు గురవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌డ్యాం, స్పిల్‌వే ఎగువన గోదావరి నీటిమట్టం 34.300 మీటర్లు నమోదు కాగా కాఫర్‌ డ్యాం స్పిల్‌ వే దిగువన 26 మీటర్లు నమోదైంది. అదనంగా వస్తున్న 12,63,666 లక్షల కూసెక్కుల వరద జలాలను జలవనరుల శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.


స్వల్పంగా తగ్గిన గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. గురువారం ఉదయం ఏడు గంటలకు భద్రాచలం వద్ద 53.40 అడుగుల నీటి మట్టం వున్న గోదావరి సాయంత్రా నికి 52.50 అడుగులకు చేరింది. 13 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది. కుక్కునూరు నుంచి భద్రా చలం వైపుకు వెళ్లే రహదారి వింజరం వద్ద నీట మునిగి పోవడంతో రాకపోకలు నిలిచిపోవడం తో జనం ఇబ్బంది పడుతున్నారు. 


Updated Date - 2022-08-19T05:34:05+05:30 IST