ట్రాన్స్‌కోకు వరద దెబ్బ

ABN , First Publish Date - 2021-08-05T06:00:42+05:30 IST

కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. అత్యావసర సేవల విభాగం పరిధిలో ఉన్న కరెంటు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని విద్యుత్‌ శాఖకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. చాలాచోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. ఓ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సైతం నీట మునిగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని సగం ప్రాంతం అంధకారమైంది.

ట్రాన్స్‌కోకు వరద దెబ్బ
విద్యుత్‌ స్థంభాలను ఏర్పాటు చేస్తున్న దృశ్యం

రూ.2 కోట్ల ఆస్తుల ధ్వంసం  8 నేలకూలిన ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌ స్తంభాలు 

స్థంభించిన 24 గంటల్లోనే సబ్‌స్టేషన్‌కు మరమ్మతులు 

38 గ్రామాలకు నిలిచిన కరెంటు సరఫరా పునరుద్ధరణ 

నిర్మల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. అత్యావసర సేవల విభాగం పరిధిలో ఉన్న కరెంటు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని విద్యుత్‌ శాఖకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. చాలాచోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. ఓ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సైతం నీట మునిగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని సగం ప్రాంతం అంధకారమైంది. 

38 గ్రామాల్లో నిలిచిన కరెంటు సరఫరా

జిల్లాలోని 38 గ్రామాలకు పూర్తిగా కరెంటు సరఫరా స్థంభించింది. మొత్తం 304 ట్రాన్స్‌ఫార్మర్‌లు, 1606 స్థంభాలు నేలకూలాయి. ఇంత మొత్తంలో నష్టం వాటిల్లడం ఆ శాఖకు ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. వరదతో జరిగిన నష్టం అంచనాలు రూపొందించిన విద్యుత్‌ శాఖ ఈ నష్టం విలువతో షాక్‌కు గురైంది. అటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ షారూఖీలు వరద నష్టంపై సమీక్ష జరిపి కరెంటు పునరుద్ధరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో నిర్మల్‌ ట్రాన్స్‌కో సూపరింటెండెంటింగ్‌ ఇంజనీర్‌ జెఆర్‌.చౌహన్‌ రంగంలోకి దిగి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో పాటు ఆయనే నష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించడమే కాకుండా అక్కడ పునరుద్ధరణ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. దీంతో సరఫరా నిలిచిపోయిన 38 గ్రామాలకు ఇప్పటి వరకు 20 గ్రామాల్లో పునరుద్ధరించగలిగారు. నేలకూలిన 304 ట్రాన్స్‌ఫార్మర్‌లకు 145 పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించారు. కాగా, నేలకొరిగిన 1606 విద్యుత్‌ స్థంభాలకు గానూ 761 విద్యుత్‌ స్థంభాలను పునరుద్దరించి కరెంటు సౌకర్యాన్ని మెరుగుపర్చారు. విశ్వనాథ్‌పేట్‌లో గల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు కూడా 24 గంటల్లోగా మరమ్మతులు చేశారు. సోన్‌, సారంగాపూర్‌, దస్తూరాబాద్‌, లక్ష్మణచాంద మండలాల్లో కరెంటు సరఫరా పూర్తిగా పునరుద్ధరింపబడడమే కాకుండా సౌకర్యం మరింత మెరుగయ్యింది. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించడంతో పది రోజుల్లోనే వరదతో కలిగిన నష్టాన్ని అధిగమించగలిగింది. అధికారులు, సిబ్బందిని ముందుండి నడిపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ జేఆర్‌. చౌహన్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీలు ప్రత్యేకంగా అభినందించడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధప్రతిపాదికన చర్యలతోనే మెరుగైన ఫలితం..

విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి చేపట్టిన చర్యల కారణంగానే కరెంటు సరఫరా పునరుద్ధరణ సాధ్యమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్‌ అధికారి జేఆర్‌.చౌహాన్‌ వ్యూహత్మక మార్గనిర్దేశంతో పనుల్లో వేగం కొనసాగిందంటున్నారు. అధికారులు సిబ్బందిని సమన్వయం చేస్తూ నిరాటకంగా మరమ్మతులు చేశారు. 

24 గంటల్లోగా సబ్‌స్టేషన్‌ పునరుద్ధరణ..

మూడు రోజుల పాటు నిరాటకంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని విశ్వనాథ్‌పేట్‌ వద్ద గల 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నీట మునిగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని స గం భాగానికి సరఫరా నిలిచి అంధకారమయమయ్యింది. దీంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. వర్షం నీటితో సబ్‌స్టేషన్‌ మునిగిపోయిన కారణంగా అం దులోని అనేక పరికరాలు దెబ్బతిన్నాయి. నీటి తాకిడిని లెక్క చేయకుండానే అధికారులు రంగంలోకి దిగి సబ్‌స్టేషన్‌ మరమ్మతులు చేపట్టారు. 24 గంటల్లోనేగానే పునరుద్ధరించగలిగారు. మొత్తం సబ్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులన్నీ ఎస్‌ఈ ఆధ్వర్యంలో కొనసాగాయి. సిబ్బంది త మ ప్రాణాలను లెక్క చేయకుండా సబ్‌స్టేషన్‌ను పునరుద్ధ రించగలిగారని పేర్కొంటున్నారు. దీంతో ఒకటిన్నర రోజుల్లోనే నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్దరింపబడింది. 

పల్లెలకు యధావిధిగా సరఫరా

వర్షం కారణంగా 38 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి 20 గ్రామాలకు ఇప్పటి వరకు పునరుద్ధరించగలిగారు. మరో 18 గ్రామాలకు కూడా కొద్దిరోజుల్లోనే సరఫరాను పునరుద్ధ్దరించే చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు కరెంటు నిలిచిపోయిన మారుమూల పల్లెలపై విద్యుత్‌ శాఖ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. 

సిబ్బంది సహకారంతోనే పునరుద్ధరణ...

జెఆర్‌. చౌహాన్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌

వరదల కారణంగా విద్యుత్‌ శాఖకు రూ. 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అధికారులు, సిబ్బంది సహకారంతో సమస్యలన్నింటిని పరిష్కరించాం. కరెంటు నిలిచిపోయిన గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించాం. ట్రాన్స్‌ఫార్మర్‌లకు మరమ్మతులు పూర్తి చేసి నేలకూలిన స్థంభాలను తిరిగి ఏర్పాటు చేశాం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీల దిశా నిర్దేశంతో పాటు తమ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయం కారణంగా సమస్యను కొద్ది రోజుల్లోనే అధిగమించగలిగాం. 

Updated Date - 2021-08-05T06:00:42+05:30 IST